కొబ్బరికి మద్దతు ధర పెంపు
మిల్లింగ్ కొబ్బరిపై రూ.400, గుండు కొబ్బరిపై రూ.410
♦ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం
♦ దేశవ్యాప్తంగా ఒకే విద్యుత్ ధర: పీయూష్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: కొబ్బరి రైతులకు ఊరటనిచ్చేలా కేంద్రం ఎండు కొబ్బరి మద్దతు ధర పెంచింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. భేటీ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సగటు నాణ్యత కలిగిన మిల్లింగ్ ఎండు కొబ్బరి 2015లో క్వింటా రూ.5,550 ఉండగా, 2016 సీజన్‌కు రూ. 400 చొప్పున పెంచనున్నట్లు చెప్పారు. గుండు కొబ్బరి (గుండ్రంగా ఉండే ఎండు కొబ్బరి) ధరను 2016కు రూ. 6,240కి (రూ. 410 పెంపు) పెంచారు. కొబ్బరి పెంచే రాష్ట్రాల్లో నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ధర అమలు అంశాలను పర్యవేక్షిస్తాయి.
దక్షిణాన 71 శాతం ట్రాన్స్‌మిషన్ లైన్లు
గడిచిన 18 నెలల్లో దక్షిణ భారత దేశానికి విద్యుత్తు సరఫరా మౌలిక వ్యవస్థను 71 శాతం అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రస్తుత వ్యవస్థకు రెట్టింపుగా విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఉంటుందన్నారు. గతంలో దక్షిణ భారత దేశంలో రూ. 18 ధరకు యూనిట్ విద్యుత్తు దొరికేదని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ధరకు అందుబాటులో ఉందని వెల్లడించారు.
ఎయిర్ మార్షల్స్ సంఖ్య పెంపు: వైమానిక దళంలో ఎయిర్‌మార్షల్స్ ర్యాంకు పోస్టుల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సాయుధ బలగాల ట్రిబ్యునల్ (ఏఎఫ్‌టీ) ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ.. 17 నెలల కాలానికి ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 వరకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎయిర్ మార్షల్స్ పెంపునకు ఇచ్చిన సమయం ముగిసిపోనుంది. దీనికితోడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎయిర్ వైస్ మార్షల్ సంజయ్ శర్మ ఏఎఫ్‌టీని ఆశ్రయించారు. దీనిపై విచారించిన ట్రిబ్యునల్.. సూపర్ న్యూమరరీ పోస్టులను మరో 17 నెలలు పెంచాలని సాయుధ బలగాల ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారుచేయడం కోసం రాజ్‌నాథ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ గురువారం సమావేశం కానుంది.