Godavari bridge
-
మనసులు కలిపే వంతెన..
యాండే.. గోదారి బ్రిడ్జి ఎప్పుడు వస్తుందండీ పడుచుపిల్ల ఉత్సాహంగా అడిగింది.. లేదే లక్ష్మి రాగానే చెప్తాను నువ్ కాస్త పడుకో.. ఓహ్.. ఇంకా టైముందా... సరే రాగానే మర్చిపోకు మరి అంటూ అటు తిరిగింది అమ్మాయి.. ఇంకో పాతికేళ్ల కుర్రాడు పై బెర్త్ నుంచి కిందికి చూస్తూ రాయమండ్రి బిర్జి వచ్చేహిందా అన్నాడు.. లేదండీ.. బండింకా సామాల్కోట దాట్లేదు .. ఇంకా టైముంది అన్నాడు కిందిబెర్త్ అంకుల్.. ఓహో.. ఐతే రైల్ బ్రిడ్జి మీదకు ఎంటరవగానే చెప్పండే అంటూ కుర్రాడు మళ్ళీ ఫోన్లో బుర్ర దూర్చేసాడు. ఓలమ్మి.. రామండ్రి గోదారి బ్రిడ్జి వచ్చిండేటి అంది వరాలమ్మ.. లేదమ్మమ్మా.. ఇంకా రానేదు.. వచ్చినప్పుడు దడదడదడ సప్పుడొస్తది.. అందరికి తెలుస్తాదిలే.. నేను లేపుతాను నువ్వు తొంగోయే అని చెప్తోంది మనవరాలు మంగ... ఐడ్రాబాడ్ .. విశాపట్నం.. లేదా ఇసాపట్నం మద్రాస్.. ఈరూట్లో వెళ్ళేవాళ్ళకు గోదారి బ్రిడ్జి ఒక ఎమోషన్. ఒక బంధం.. అంతవరకూ నిప్పులుగక్కుతూ యుద్ధానికి వెళ్తున్న వైజయంతి యుద్ధ ట్యాంక్ మాదిరిగా దూసుకెళ్లే రైళ్లన్నీ గోదారిని చూడగానే.. ఎక్కడలేని సిగ్గును పులుముకున్న పడుచుపిల్ల పెళ్ళిచూపుల్లో నడిచినట్లు వగలుపోతూ స్లో అయిపోతాయి. అక్కడికి వచ్చేసరికి అడుగులు తడబడినట్లు.. అడుగులో అడుగేసినట్లు.. వాలుజడ ఊగినట్లు.. జడలోని మల్లెలు నవ్వినట్లు.. అంత సొగసుగా నడుస్తుంది ట్రైన్ అదంతే .. గోదారి.. దానిమీద వంతెన.. ఈ దక్షిణభారతంలోనే ఒక ఐకానిక్ నిర్మాణం...అది కేవలం తూర్పు.. పశ్చిమ గోదావరి జిలాలలను మాత్రమే కలిపే వంతెన కాదండి.. ఎన్నో మనసులతో ముడేసుకున్న బంధం.. కాదనుకున్నా వెంటాడే అనుబంధం. 1964 లో మూడో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి బీజం పడింది. 1974లో వంతెన నిర్మాణం పూర్తవగా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దాన్ని జాతికి అంకితం చేసారు. ఆ మహా మహా నిర్మాణం ప్రారంభోత్సవాన్ని అప్పటి విజయవాడ కేంద్రంగా ఉన్న ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీని నిర్మాణంతో రాజమండ్రి, కొవ్వూరు మధ్య లాంచీల ప్రయాణం స్థానే బస్సులను నడపడం మొదలైంది. రెండు గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సులువయ్యాయి. ఈ ఏడాదితో గోదారి రైల్. రోడ్ బ్రిడ్జికి యాభయ్యేళ్ళు నిండాయి..ఇక ఈ మార్గంలో ట్రైన్ మీదుగా ప్రయాణించే కోట్లాదిమందికి ఈ వంతెన మీదుగా ట్రైన్ నడవడం.. దాన్ని కిటికీలోంచి చూడడం ఒక అద్భుత భావన. ఒరేయ్.. బుడ్డోడా.. గోదారొచ్చింది.. చిల్లర పైసలు ఉంటే ఇవ్వరా అంటూ తీసుకుని కిటికీలోంచి గోదారమ్మకు దక్షిణ సమర్పించి ఒక దండం పెట్టుకుని సంతృప్తి పడని జీవులు లేనట్లే లెక్క. రాత్రి పూలతో బెర్త్ మీద నిద్దరోయి తెల్లారి వాటిని బయటపడేయకుండా గోదారి వచ్చేవరకూ ప్రేమగా చేతిలో పట్టుకుని కూర్చునే నవవధువులు.. సాయం సంధ్యవేళ దూరంగా కొండల్లోకి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆదిత్యుని.. గోదారిని కలిపి చూడడం.. అందులోని భావుకత్వాన్ని ఆనందించడం కవులకే సాధ్యం.. అమ్మా కిందికి చూడు ఎన్ని బోట్లో... అంటూ ముద్దుముద్దుగా చెబుతున్న పిల్లాడిని దగ్గరకు పొదుముకుంటూ అవున్నన్నా గోదారిలో అన్నీ ఉంటాయి.. వాళ్లంతా చేపలు పడుతున్నారు అని వివరించే తల్లి. బ్రిడ్జి రాగానే... నోట్లో నీళ్లూరుతుండగా యాండే ఈ సీజన్లో గోదారిలో పులస దొరుకుతుందండీ... అది పులుసూపెట్టుకుని మర్నాడు తింటే ఉంటుందండీ అని వివరించే ఇంకో ఫుడీ నేరేషన్.. ఇంకో లెవెల్..ఇలా గోదావరి వంతెన కేవలం ఒక నది మీద కట్టిన ఇనుప నిర్మాణం కాదండి.. అందులో బంధం.. ఆత్మీయత.. ఒక తీయని అనుభూతి.. ఇలా చెబుతూ వెళ్తే ఇంకెంతైనా రాయొచ్చు..- సిమ్మాదిరప్పన్న -
సెల్ఫీపేరు చెప్పి సుహాసిని, పిల్లలను నదిలోకి తోసేసిన సురేష్
-
నమ్మించి.. నట్టేట్లో తోసేసి..
రావులపాలెం/తాడేపల్లి రూరల్: ఓ బిడ్డతో కలిసి ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు.. మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఓ చిన్నారికి జన్మనిచ్చాడు. అనంతరం వారిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి తల్లీబిడ్డలను గోదావరి బ్రిడ్జి పైకి తీసుకువచ్చి.. నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. వివరాలు.. భర్తతో విభేదాల వల్ల పుప్పాల సుహాసిని(36) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్లో పనిచేస్తూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. సురేశ్‌కు అప్పటికే వివాహమైంది. అయినా సుహాసినిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్ట మీద ఉన్న ఓ ఇంట్లో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జెర్సీ(ఏడాది పాప) జన్మించిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్‌పేటలో ఉంటోంది. సురేశ్ తరుచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. దీంతో సుహాసిని తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది. ఈ నేపథ్యంలో సురేశ్ దుస్తులు కొందామని నమ్మించి సుహాసిని, లక్ష్మీకీర్తన, జెర్సీలను శనివారం రాత్రి కారులో రాజమహేంద్రవరం తీసుకువచ్చాడు. అక్కడి నుంచి రావులపాలెం తెచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు. ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ సుహాసినిని బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. సుహాసినితో పాటు జెర్సీని గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్లో పాటలు వింటున్న కీర్తనను కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత సురేశ్ కారులో పరారయ్యాడు. సకాలంలో స్పందించిన పోలీసులు బ్రిడ్జి పై నుంచి పడిపోతున్న సమయంలో కీర్తన బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపును బలంగా పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్‌తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్‌కు డయల్ చేసింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తన ఆచూకీ కోసం పోలీసులు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు. -
గోదావరి వంతెనపై ఆత్మహత్యల నివారణకు చర్యలు
-
యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరిలో దూకబోయిన యువకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ చాకచక్యంగా కాపాడారు. రాజమండ్రి రోడ్డుకం రైల్వే వంతెనపై మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప ఎలక్ట్రికల్ అండ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్‌పై రోడ్డు కం రైలు వంతెనపైకి వచ్చాడు. మోటారు సైకిల్‌ను పక్కనపెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన ఎంపీ భరత్‌రామ్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, కారులోంచి బయటకు దూకి, ఆ యువకుడిని పట్టుకుని రోడ్డు మీదుకు లాగారు. ఎంపీ అనుచరులు కూడా గట్టిగా పట్టుకున్నారు. ఎంపీ వెంటనే రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ గణేష్‌కు ఫోన్‌చేసి విషయం తెలిపారు. ఆ యువకుడిని ఆటోలో రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లారు. యువకుడిని కాపాడిన ఎంపీ భరత్‌రామ్‌ను పలువురు అభినందించారు. -
సూసైడ్ స్పాట్..! ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
సాక్షి, నిజామాబాద్: జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి యంచ గోదావరి బ్రిడ్జి స్పాట్‌గా మారిపోయింది. గలగల పారే గోదారమ్మలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, జీవితంపై విరక్తి.. కారణాలు ఏవైనా సూసైడ్ స్పాట్ బాసర గోదావరే గుర్తుకువస్తుంది. చదువులమ్మ సరస్వతి మాత అనుగ్రహం పొందాల్సిన వారు గోదావరిలో దూకి కాటికి పోతున్నారు. గత మూడేళ్లలో 20 మంది దానిపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల కాలంలో.. గోదావరి నదిలో దూకి గత మూడేళ్లలో 20 మంది బలవన్మరణం చెందారు. సాయంత్రం, రాత్రి వేళలో బాధితులు అక్కడికి వెళ్లి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణారావ్ బలవన్మరణం చెందగా తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వ్యాపారి సందీప్ గోదావరి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారికి జిల్లా సరిహద్దులోని గోదావరి నది బ్రిడ్జి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. ఆత్మహత్యకు పాల్పడిన సందీప్ వాహనం ఎత్తుపెంచాలని కలెక్టర్, సీపీలకు వినతి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన గోదావరి బ్రిడ్జి ఇరువైపులా రక్షణ గోడ ఎత్తును పెంచాలని, కంచెతో రక్షణ కల్పించాలని యంచ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్, సీపీలకు వినతిపత్రం సమర్పించారు. బ్రిడ్జికి ఇరువైపులా.. గోదావరిపై నవీపేట మండలం యంచ నుంచి బాసర వరకు గల వంతెనపై రక్షణ గోడ ఎత్తుగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే వారికి అనుకూలంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా ఎత్తయిన రక్షణ గోడ లేదంటే ఫెన్సింగ్ ఏర్పాటుతో ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. అధికారులు ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బందోబస్తు ఏర్పాటు చేయాలి రాత్రి వేళలో జనసాంద్రత తక్కువగా ఉన్న యంచ గోదావరి బ్రిడ్జిపై పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలి. వంతెనపై రక్షణ గోడ ఎత్తు పెంచడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయ డం వల్ల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. – వినోద్‌కుమార్, యంచ నిఘా ఏర్పాటు చేశాం వంతెనపై ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకుండా అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. యంచ గ్రామస్తులతో పాటు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నాం. బ్రిడ్జికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. – రాజారెడ్డి, ఎస్సై, నవీపేట ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మరణం అంచున నరకయాతన! ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా..
ఆలమూరు: మరణానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉండి కొన్ని గంటల పాటు నరక యాతన అనుభవించి.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్‌కుమార్ రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో హోమ్‌గార్డ్. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా గౌతమీ గోదావరి కొత్త వంతెనపై వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ పక్కన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టి గోదావరిలో జారి పోయాడు. అదృష్టవశాత్తు గోదావరి నదికి, వంతెన పైభాగానికి మధ్యనున్న చెక్కబల్లపై పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్‌కుమార్ హెల్మెట్ ధరించడం వల్ల బలమైన గాయాలు కాలేదు. గాయాలు తట్టుకోలేక, మరో పక్క గోదావరిలో పడిపోతానన్న భయంతో ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులు విన్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు, హైవే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి పోలీసులు కిందకు దిగి తాడు సాయంతో అతన్ని పైకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్‌హెచ్ 16 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించాక.. రావులపాలెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్‌కుమార్ ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకున్నా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. -
సూసైడ్ స్పాట్‌గా మారిన గోదావరి బ్రిడ్జి.!
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : ‘భార్యాభర్తలు గొడవ పడ్డారు.. క్షణికావేశంలో భార్య ఆటో ఎక్కి గోదావరి బ్రిడ్జివద్దకు వెళ్లింది.. అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో అక్కడే విధినిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదే ఆటోలో బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు గోదావరి బ్రిడ్జి సమీపంలో ఇటీవల కాలంలో పెరిగిపోయాయి’. ఇన్నాళ్లు గోదారి ఎండిపోయి తాగునీటి కోసం గోస పడుతుండగా.. ఇప్పుడు నిండుకుండలా మారిన గోదావరితో మరో లొల్లి మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరిబ్రిడ్జికి ఐదు కిలో మీటర్ల దూరంలో సుందిళ్ల బ్యారేజీ నిర్మించడంతో నీటిమట్టం భారీగా పెరిగింది. రివర్స్ పం పింగ్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి నిల్వలు పెరిగిపోయాయి. ఈక్రమంలో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇటీవల కాలంలో గోదావరిబ్రిడ్జి వద్ద ఆత్మహత్యయత్నాలకు పాల్పడే వారి సంఖ్య కూడా పెరిగింది. గడిచిన రెండు నెలల్లో 15 మంది గోదావరిబ్రిడ్జి వద్ద ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తమై తొమ్మిది మందిని రక్షించగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. తలనొప్పిగా మారిన ఆత్మహత్యలు.. గోదావరినదిలో ఆత్మహత్య సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. క్షణికావేశంలో వస్తున్న వ్యక్తులు గోదావరిబ్రిడ్జిపైకి చేరుకుని నదిలో దూకుతున్నారు. ఈవిషయాన్ని పలువురు గమనించి పోలీసులకు చేరవేడడంతో బాధితులను రక్షించేందుకు పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది. నిండుగోదావరి సందర్శకులకు సంతోషాన్నిస్తుండగా పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారింది. ప్రతీ రెండురోజులకో సంఘటన జరుగుతుండడంతో పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించారు. అవుట్ పోస్టు ఏర్పాటు.. గోదావరి బ్రిడ్జిపై ప్రమాదాలు తగ్గించడంతో పాటు ఆత్మహత్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు టూటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గత నెల 26 ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడేవారిని గుర్తించి, వెంటనే కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. అయినా కొంతమంది క్షణికావేశంలో వచ్చి ఎవరికీ తెలియకుండా నదిలో దూకి చనిపోయిన సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. గోదావరినదిపై ఉన్న రెండు బ్రిడ్జీలకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీపీసీ యాజమాన్యం సహకారంతో బ్రిడ్జిపై ఉన్న రెయిలింగ్‌కు ఆనుకుని ఆరుఫీట్ల ఎత్తు వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
వంతెన.. ఇంతేనా..?
సాక్షి, ఖమ్మం : రెండు ప్రాంతాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన వారధి అది. దశాబ్దాల చరిత్ర ఉండటమే కాకుండా లెక్కలేనన్ని వాహనాలు ఆ వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాల రద్దీ పెరగడంతో మరో వంతెన నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఒక కొలిక్కి రావడం లేదు. ఉన్న వంతెన కాస్తా శిథిలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే వంతెనపై పెచ్చులూడుతూ, తారు లేచిపోయి, ఇనుప చువ్వలు బయటపడి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతారో అర్థంకాని పరిస్థితి ఉంది. అధికారులు దీనికి తాత్కాలిక మరమ్మతులు సైతం చేపట్టకపోవడంతో పరిస్థితులు రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాక ఈ వంతెనమీదుగానే ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో వంతెన ఊగిసలాడుతోంది. ప్రస్తుతం గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఇటీవలికాలంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను వాహనం ఢీకొనగా, దెబ్బతిన్నది. ఆ రెయిలింగ్ స్థానంలో తాత్కాలికంగా కర్రలు పెట్టారు. గోదావరి నదిపై ఉన్న వంతెన నుంచి నదిని చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. ఇప్పుడు ఆ రెయిలింగ్ ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు దీనిపై శ్రద్ధపెట్టి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిపై వంతెన దుస్థితిపై ‘సాక్షి’ ఫొటో ఫీచర్. -
గోదావరి వంతెనపై పాదయాత్రకు షరతులు
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న తరుణంలో పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రభుత్వ పక్షపాత వైఖరిని తేటతెల్లం చేశాయి. బ్రిడ్జి పైనుంచి కాకుండా మరో ప్రాంతం నుంచి పాదయాత్ర కొనసాగించాలని పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలకు జారీ చేసిన నోటీసులు కొంతసేపు హడావుడి సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య 4.1 కిలోమీటర్ల మేర అఖండ గోదావరి నదిపై రోడ్డు కం రైలు వంతెన ఉంది. ఈ నెల 12వ తేదీన ఈ వంతెన మీదుగా జననేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు పక్షం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ‘బ్రిడ్జి 50 ఏళ్ల క్రితం నిర్మించింది. మధ్యలో అనేకమార్లు మరమ్మతులు జరిగాయి. కండిషన్ బాగోలేనందున భారీ వాహనాలను నిషేధించాం. ఫుట్‌పాత్, రెయిలింగ్ బలహీనంగా ఉన్నాయి. వంతెన కండిషన్ దృష్ట్యా పాదయాత్ర ప్రవేశానికి మరో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకోండి. గత అనుభవాల దృష్ట్యా కోటిపల్లి బస్‌స్టాండ్ పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాటకు అవకాశం ఉంది. బహిరంగ సభను మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగలరు’ అని శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాశరావుకు నోటీసులు జారీ చేశారు. దీంతో పార్టీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, నేతలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్ తదితరులు అర్బన్ ఎస్పీ బి.రాజకుమారితో సమావేశమయ్యారు. పాదయాత్ర విశిష్టత, బ్రిడ్జి పూర్వాపరాలపై చర్చించారు. ఈ వంతెనపై నుంచి రోజూ దాదాపు 65 రైళ్లు ప్రయాణిస్తున్నాయని, ఇందులో గూడ్స్ రైళ్లు కూడా ఉన్నాయని, ఆయా రైళ్లను సిగ్నల్ రానప్పుడు వంతనపై గంటల కొద్దీ నిలిపివేస్తున్నారని, భారీ వాహనాలు కూడా తిరుగుతున్నాయని వివరించారు. దీంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచోసుకోకుండా వలంటీర్లను నియమించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత వహించాలన్న షరతులతో ఎస్పీ అనుమతి మంజూరు చేశారు. -
కొడుకుతో కలసి మహిళ ఆత్మహత్య
నవీపేట: ఐదు నెలల కొడుకుతో సహా రైలులోంచి ఓ మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి బ్రిడ్జికి సమీపంలో జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి మండల కేంద్రానికి చెందిన హంగిర్గ సునీత(25), భర్త రాజు, కొడుకులు కేశవ్, శివశంభులతో కలసి ఉపాధి నిమిత్తం శనివారం పుణే ప్యాసింజర్‌లో నిజామాబాద్‌కు బయలుదేరారు. రాజు, కేశవ్ నిద్రిస్తున్న సమయంలో సునీత కొడుకు శివశంభుతోపాటు ఒక్కసారిగా రైలులో నుంచి కిందికి దూకింది. దీంతో తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. నవీపేట ఎస్ఐ నరేశ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. -
ఆదిలాబాద్‌లో నీటమునిగిన గోదావరి వంతెన
-
నీటమునిగిన గోదావరి వంతెన
దండేపల్లి : ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గూడెం వంతెన పూర్తిగా వరద నీటితో మునిగి పోయింది. దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిపై గల లోలెవల్ వంతెన ఆదివారం రాత్రి మునిగిపోయింది. సోమవారం ఉదయానికి కూడా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న కొంత వంతెన మీదుగా చిన్న వాహనాలకు అధికారులు అనుమతిస్తున్నారు. వంతెనపై వరద ప్రవాహం తగ్గూవరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
గోదావరి వంతెనపై భారీ వాహనాలకు నిషేధం
దండేపల్లి (ఆదిలాబాద్) : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో దండేపల్లి మండలం గూడెం గోదావరి వంతెన వద్ద గురువారం రాత్రి నుంచి నీటి మట్టం పెరిగింది. పాత లోలెవల్ వంతెనకు సమానంగా నీరు నిలిచింది. వంతెన శిథిలావస్థలో ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు వంతెనపై గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం నుంచి మాత్రం ద్వి, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, జీపులను అనుమతించారు. భారీ వాహనాలకు అనుమతి నిరాకరించారు. దీంతో గూడెం అటవీ చెక్‌పోస్టు నుంచి లక్సెట్టిపేట ఎన్టీఆర్ చౌరస్తా వరకు లారీలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆర్టీసీ వారు బస్సులను ఇటువైపు గూడెం చెక్‌పోస్టు వరకు, అటు వైపు రాయపట్నం వరకు నడిపిస్తున్నారు. అటు వైపు, ఇటువైపు బస్సుల్లో దిగిన వారందరూ ఆటోల ద్వారా వంతెన దాటుతున్నారు. అయితే గోదావరి నదిపై నిర్మించిన కొత్త వంతెన పనులు నాలుగు రోజుల్లో పూర్తవుతాయని నేషనల్ హైవే జేఈ జగదీశ్వర్ తెలిపారు. -
గోదావరి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
బూర్గంపాడు (ఖమ్మం) : వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో.. బైక్ మీద ఉన్న వ్యక్తి ఎగిరి గోదావరిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండల కేంద్రంలో గౌతమీపురం కాలనీకి చెందిన గుమ్మలాపురం ప్రసాద్(34) బైక్ పై భద్రాచలం వెళ్తున్న సమయంలో.. గోదావరి బ్రిడ్జిపైకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ బైక్ పై నుంచి ఎగిరిపడి గోదావరిలో పడ్డాడు. ఈ క్రమంలో బ్రిడ్జి కింద ఉన్న విద్యుత్ తీగలపై పడి అవి తెగి ఇసుకలో కూరుకుపోయి.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం చూడలేదని, కారు అతి వేగంగా ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.