రావులపాలెం/తాడేపల్లి రూరల్: ఓ బిడ్డతో కలిసి ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు.. మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఓ చిన్నారికి జన్మనిచ్చాడు. అనంతరం వారిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి తల్లీబిడ్డలను గోదావరి బ్రిడ్జి పైకి తీసుకువచ్చి.. నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. వివరాలు.. భర్తతో విభేదాల వల్ల పుప్పాల సుహాసిని(36) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్‌లో పనిచేస్తూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది.
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. సురేశ్‌కు అప్పటికే వివాహమైంది. అయినా సుహాసినిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్ట మీద ఉన్న ఓ ఇంట్లో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జెర్సీ(ఏడాది పాప) జన్మించిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్‌పేటలో ఉంటోంది. సురేశ్ తరుచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. దీంతో సుహాసిని తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది.
ఈ నేపథ్యంలో సురేశ్ దుస్తులు కొందామని నమ్మించి సుహాసిని, లక్ష్మీకీర్తన, జెర్సీలను శనివారం రాత్రి కారులో రాజమహేంద్రవరం తీసుకువచ్చాడు. అక్కడి నుంచి రావులపాలెం తెచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు. ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ సుహాసినిని బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. సుహాసినితో పాటు జెర్సీని గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్‌లో పాటలు వింటున్న కీర్తనను కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత సురేశ్ కారులో పరారయ్యాడు.
సకాలంలో స్పందించిన పోలీసులు
బ్రిడ్జి పై నుంచి పడిపోతున్న సమయంలో కీర్తన బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపును బలంగా పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్‌తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్‌కు డయల్ చేసింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తన ఆచూకీ కోసం పోలీసులు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment