యంచ సమీపంలో గోదావరి నదిపై గల బ్రిడ్జి
సాక్షి, నిజామాబాద్: జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి యంచ గోదావరి బ్రిడ్జి స్పాట్‌గా మారిపోయింది. గలగల పారే గోదారమ్మలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, జీవితంపై విరక్తి.. కారణాలు ఏవైనా సూసైడ్ స్పాట్ బాసర గోదావరే గుర్తుకువస్తుంది. చదువులమ్మ సరస్వతి మాత అనుగ్రహం పొందాల్సిన వారు గోదావరిలో దూకి కాటికి పోతున్నారు. గత మూడేళ్లలో 20 మంది దానిపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
మూడేళ్ల కాలంలో..
గోదావరి నదిలో దూకి గత మూడేళ్లలో 20 మంది బలవన్మరణం చెందారు. సాయంత్రం, రాత్రి వేళలో బాధితులు అక్కడికి వెళ్లి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణారావ్ బలవన్మరణం చెందగా తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వ్యాపారి సందీప్ గోదావరి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారికి జిల్లా సరిహద్దులోని గోదావరి నది బ్రిడ్జి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది.
ఆత్మహత్యకు పాల్పడిన సందీప్ వాహనం
ఎత్తుపెంచాలని కలెక్టర్, సీపీలకు వినతి
నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన గోదావరి బ్రిడ్జి ఇరువైపులా రక్షణ గోడ ఎత్తును పెంచాలని, కంచెతో రక్షణ కల్పించాలని యంచ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్, సీపీలకు వినతిపత్రం సమర్పించారు.
బ్రిడ్జికి ఇరువైపులా..
గోదావరిపై నవీపేట మండలం యంచ నుంచి బాసర వరకు గల వంతెనపై రక్షణ గోడ ఎత్తుగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే వారికి అనుకూలంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా ఎత్తయిన రక్షణ గోడ లేదంటే ఫెన్సింగ్ ఏర్పాటుతో ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. అధికారులు ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బందోబస్తు ఏర్పాటు చేయాలి
రాత్రి వేళలో జనసాంద్రత తక్కువగా ఉన్న యంచ గోదావరి బ్రిడ్జిపై పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలి. వంతెనపై రక్షణ గోడ ఎత్తు పెంచడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయ డం వల్ల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
– వినోద్‌కుమార్, యంచ
నిఘా ఏర్పాటు చేశాం
వంతెనపై ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకుండా అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. యంచ గ్రామస్తులతో పాటు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నాం. బ్రిడ్జికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం.
– రాజారెడ్డి, ఎస్సై, నవీపేట
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment