గోదావరి ఒడ్డుపై లభ్యమైన డీఈఈ బైక్
నవీపేట: ఆర్మూర్ ఇరిగేషన్ డీఈఈ జోరుపల్లి వెంకట రమణారావు (47) నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మండలంలోని పోతంగల్ గ్రామంలో తల్లిదండ్రులను కలిసి బయటకు వెళ్లిన డీఈఈ శుక్రవారం గోదావరి నదిలో శవమై కనిపించారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. నిజామాబాద్‌లోని మారుతి నగర్‌లో వెంకట రమణారావు.. భార్య చందన, కూతురు మనస్వినిలతో కలిసి నివాసముంటున్నారు.
ఆర్నెల్ల కిందట కూతురు చదువు కోసం నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చారు. మనస్విని ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రెండ్రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన రమణారావు తల్లిదండ్రులు చంద్రకళ, గంగాధర్‌రావు, తమ్ముడు మధుకర్‌రావుతో కాసేపు మాట్లాడి నిజామాబాద్ వెళ్తానని చెప్పి తన మోటార్ సైకిల్‌పై బయలుదేరారు.
అదే రోజు రాత్రి యంచ శివారులోని గోదావరి నది బ్రిడ్జి దగ్గరకు వెళ్లారు. అక్కడే వాహనాన్ని నిలిపి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అన్నయ్యకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని, ఆయన ఆచూకీ కనిపించడం లేదని మధుకర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నదిలో మృతదేహం దొరికిందంటూ యంచ గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లు శుక్రవారం పోలీసులకు సమాచారమందించారు. ఆ మృతదేహాన్ని రమణారావుగా గుర్తించారు.
11 నెలల నుంచి సెలవులో...
నిజామాబాద్ డివిజన్‌లో డీఈఈగా పని చేసిన రమణారావు రెండేళ్ల కిందట ఆర్మూర్ డీఈఈగా బదిలీపై వెళ్లారు. దీనికంటే ముందే ఆయన కామారెడ్డి జిల్లాకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఆర్మూర్‌లో ఓ కీలక ప్రజాప్రతినిధి బలవంతంగా సంతకాలు పెట్టించినట్లు రమణారావు గతంలోనే పలువురి వద్ద వాపోయినట్లు తెలిసింది. ఆయన 11 నెలల నుంచి సెలవులో ఉన్నారు. హైదరాబాద్‌కు మకాం మార్చడంతో కామారెడ్డికి కాకుండా హైదరాబాద్‌కు బదిలీ కోసం ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
తాను చదువుకున్న రోజుల్లో రూమ్‌మేట్ అయిన మంత్రి హరీశ్‌రావును కూడా ఈ విషయమై కలిసినట్లు తెలిసింది. రమణారావు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమీప బంధువు. ఆమె భర్త అనిల్‌కు బాబాయ్ వరుస అవుతారు. రమణారావు అంత్యక్రియల్లో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కవిత భర్త అనిల్, మామ రాంకిషన్‌రావు పాల్గొన్నారు. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment