రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైల్ వంతెన
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న తరుణంలో పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రభుత్వ పక్షపాత వైఖరిని తేటతెల్లం చేశాయి. బ్రిడ్జి పైనుంచి కాకుండా మరో ప్రాంతం నుంచి పాదయాత్ర కొనసాగించాలని పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలకు జారీ చేసిన నోటీసులు కొంతసేపు హడావుడి సృష్టించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య 4.1 కిలోమీటర్ల మేర అఖండ గోదావరి నదిపై రోడ్డు కం రైలు వంతెన ఉంది. ఈ నెల 12వ తేదీన ఈ వంతెన మీదుగా జననేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు పక్షం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ‘బ్రిడ్జి 50 ఏళ్ల క్రితం నిర్మించింది. మధ్యలో అనేకమార్లు మరమ్మతులు జరిగాయి. కండిషన్ బాగోలేనందున భారీ వాహనాలను నిషేధించాం. ఫుట్‌పాత్, రెయిలింగ్ బలహీనంగా ఉన్నాయి. వంతెన కండిషన్ దృష్ట్యా పాదయాత్ర ప్రవేశానికి మరో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకోండి. గత అనుభవాల దృష్ట్యా కోటిపల్లి బస్‌స్టాండ్ పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాటకు అవకాశం ఉంది. బహిరంగ సభను మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగలరు’ అని శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాశరావుకు నోటీసులు జారీ చేశారు.
దీంతో పార్టీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, నేతలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్ తదితరులు అర్బన్ ఎస్పీ బి.రాజకుమారితో సమావేశమయ్యారు. పాదయాత్ర విశిష్టత, బ్రిడ్జి పూర్వాపరాలపై చర్చించారు. ఈ వంతెనపై నుంచి రోజూ దాదాపు 65 రైళ్లు ప్రయాణిస్తున్నాయని, ఇందులో గూడ్స్ రైళ్లు కూడా ఉన్నాయని, ఆయా రైళ్లను సిగ్నల్ రానప్పుడు వంతనపై గంటల కొద్దీ నిలిపివేస్తున్నారని, భారీ వాహనాలు కూడా తిరుగుతున్నాయని వివరించారు. దీంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచోసుకోకుండా వలంటీర్లను నియమించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత వహించాలన్న షరతులతో ఎస్పీ అనుమతి మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment