- ఆదెమ్మదిబ్బ కబ్జాపై
- స్పందించిన అధికారులు
- కంచె వేసిన కొద్ది ప్రాంతంలో హెచ్చరిక బోర్డు
- హోలీ ఏంజెల్స్ స్కూల్ ప్రాంతం కార్పొరేష¯ŒSదంటూ వివరణ
ఎట్టకేలకు కదిలారు
Published Mon, Feb 6 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM
సాక్షి, రాజమహేంద్రవరం :
నగరంలోని కంబాల చెరువు సమీపంలో రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల భూ కబ్జాపై నగరపాలక సంస్థ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఆ స్థలం తాను కొనుగోలు చేశానంటూ కోలమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు.. 50 ఏళ్లుగా అక్కడ ఉంటున్న పేదలను ఖాళీ చేయించడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. సర్వే నంబర్–730లోని స్థలం ప్రైవేటు వ్యక్తులదంటూ అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఇది ప్రభుత్వం సేకరించిందా? లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై సత్యవోలు పాపారావు కుమారుల్లో ఒకరైన సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆ స్థలం తమదేనని పేర్కొన్నారు. ‘సాక్షి’ తనవద్ద ఉన్న ఆధారాలతో ప్రశ్నించగా.. ఆ భూమిని తాము ప్రభుత్వ సేకరణకు ఇవ్వలేదని తోసిపుచ్చారు. ప్రభుత్వం తమ పినతండ్రి సత్యవోలు లింగమూర్తి, సత్యవతి దంపతుల వాటా సేకరించిందని చెప్పారు. మొత్తం స్థలం 4 ఎకరాల 19 సెంట్లు కాగా.. తన తండ్రి పాపారావు 2 ఎకరాల 23 సెంట్లు, తన పిన్నమ్మ సత్యవతి ఎకరా 96 సెంట్ల లెక్కన పంచుకున్నారని చెప్పారు. తమ స్థలం పిన్నమరెడ్డి ఈశ్వరుడికి అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఓవైపు ఈ స్థలంపై అనేక ఆరోపణలు వస్తూండగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాత్రం తమ పని కానిచ్చేశారు. పేదలను ఖాళీ చేయించి కంచె వేశారు. పనిలో పనిగా సర్వే నంబర్–725/3ఎ లోని హోలీ ఏంజెల్స్ స్కూల్ వెనుక, పక్కన గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను కూడా ఖాళీ చేయించి, అక్కడ కూడా కంచె వేశారు. దీనిపై గత డిసెంబర్ 26న ‘భూమంత్రం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. నెల రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు తాజాగా ఆ స్థలం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థదేనంటూ హోలీ ఏంజెల్స్ స్కూల్ పక్కన, వెనుక బోర్డులు పెట్టారు. ఆ స్థలం ఆక్రమించిన వారు శిక్షార్హులంటూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు వేసిన కంచెకు హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, మిగిలిన ప్రాంతంపై అధికారులు ఇంకా స్పష్టతనివ్వలేదు.
Advertisement