కూటమి ప్రభుత్వం వచ్చాక యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
తిరుపతి అర్బన్ తహశీల్దార్‌కు తిమ్మినాయుడుపాలెం గ్రామస్తుల ఫిర్యాదు
తిరుపతి మంగళం: ‘మా తాతముత్తాల నుంచి తిరుపతి తిమ్మినాయుడుపాలెం గ్రామంలో దళితవాడ ఎదురుగా సర్వే నంబర్ 199లోని 1.49 ఎకరాల స్థలాన్ని శ్మశానవాటికగా వినియోగించుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గ్రామంలోని టీడీపీ నాయకుడు వెంకటరత్నం అండతో కొందరు శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. అక్రమంగా షెడ్లు నిరి్మంచారు. వెంటనే అడ్డుకోండి..’ అని తిమ్మినాయుడుపాలెం గ్రామస్తులు శుక్రవారం తిరుపతి అర్బన్ తహసీల్దార్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు.
వందేళ్ల చరిత్ర కలిగిన శ్మశాన స్థలంలోని ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం ప్రజలు వందేళ్లుగా వినియోగించుకుంటున్న శ్మశాన స్థలంలో ఇటీవల కొందరు టీడీపీ నాయకులతో కలసి ఆక్రమించుకుని అందులో షెడ్లు నిరి్మంచుకున్నారని తెలిపారు. దీంతో తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి స్థలం లేక నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నవారు కొత్తగా అటవీశాఖ భూమిని శ్మశానం కోసం కేటాయించాలని కోరుతున్నారని తెలిపారు. మరోవైపు ఆక్రమణదారులు మళ్లీ నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొత్త నిర్మాణాలను అడ్డుకోవడంతోపాటు ఉన్న వాటిని తొలగించి తమ గ్రామానికి శ్మశాన స్థలాన్ని అప్పగించాలని కోరారు.
శ్మశానం కబ్జాకు యత్నం.. తిరగబడిన దళితులు
రాజంపేట: శ్మశానస్థలాన్ని సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ వర్గీయులపై దళితులు తిరగబడిన ఘటన అన్నమయ్య జిల్లా ములక్కాయపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సర్వే నంబరు 1,713లో 0.20 సెంటు భూమిని దళితవాడకు శ్మశానస్థలంగా కేటాయిస్తూ గత సంవత్సరం ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న కొందరు ఈ స్థలంపై కన్నేశారు.
శుక్రవారం స్థలానికి ముళ్లకంచె వేసి కబ్జాకు యత్నించారు. ఇది తెలుసుకున్న దళితులు మూకుమ్మడిగా స్థలం వద్దకు చేరుకుని టీడీపీ వర్గీయులు వేసుకున్న ముళ్లకంచెను తొలగించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. దళితులపై బెదిరింపులకు దిగారు. సమాచారం తెలుసుకున్న మన్నూరు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగింది.
అయితే తమ శ్మశానవాటికను కబ్జా చేసేందుకు టీడీపీకి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే ములక్కాయపల్లె దళితులు రెవెన్యూ అధికారులకు విన్నవించారు. స్థలాన్ని కబ్జా కానివ్వమని, జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లి పోరాడుతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment