ఏళ్లు కష్టపడి పేదలు కట్టుకున్న ఇళ్లను కూలుస్తున్నారు
చెరువుల్ని మింగేసిన పెద్దలను మాత్రం పట్టించుకోవట్లేదు
ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శలు
సీఎం, డిప్యూటీ సీఎంలకు అవి కనిపించట్లేదా అని ప్రశ్న
చర్యలు తీసుకోకుంటే..ప్రజా ఉద్యమానికి సిద్ధమని ప్రకటన
ఆరు సంస్థల కబ్జా పర్వాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ‘చెరువుల పరిరక్షణ పేరుతో పేదలు, మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు నిర్తించుకున్న ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వానికి బడా బాబులు చేసిన కబ్జాలు కనిపించట్లేదా?’అంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ వ్యవహారశైలిని విమర్శించారు.
ఆరు ప్రముఖ సంస్థలు చెరువుల్ని ఎలా కబ్జా చేశాయో, దానికి ప్రభుత్వ విభాగాలు ఏ విధంగా సహకరించాయో వివరిస్తూ బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి తప్పని నిరూపించినా రాజీనామా కాదని, ఏకంగా ప్రాణత్యాగమే చేస్తానంటూ సవాల్ విసిరారు.
ఎస్‌ఎంఆర్ కాసా కరీనో
గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లోని సర్వే నంబరు 13లో 1.49 ఎకరాల విస్తీర్ణంలో కుంటఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతి ఇచ్చారు.దీంతో చెరువును పూర్తిగా మింగేసిన ఎస్‌ఎంఆర్ కాసా కరీనో సంస్థ విల్లాలు నిర్మించింది. ప్రస్తుతం చెరువు ఉండాల్సిన ప్రాంతంలో 15 విల్లాలునిర్మించినట్టు కనిపిస్తోంది. ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు లెక్కేసుకున్నా వీటి ఖరీదు రూ.150 కోట్లకు పైనే.
వజ్రం ఇక్సోరా
శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో సర్వే నంబరు 29లో 1.86 ఎకరాల విస్తీర్ణంలో మేడ్లకుంట చెరువు ఉండేది. ఇందులో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్‌ఎండీఏ 2022లో వజ్రం ఇక్సోరాకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ జీ+11 అంతస్తులతో నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి. దీని మార్కెట్ విలువ రూ.900 కోట్లు.
ఫీనిక్స్, కాండూర్
గండిపేట మండలం పుప్పాలగూడలోని సర్వే నంబర్లు.185, 186, 187, 188, 285, 286, 287, 288, 289ల్లో ముక్కసాని కుంట 19.58 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని తొలుత సెజ్‌గా మార్చిన గత ప్రభుత్వం ఆపై తెలంగాణ స్టేట్ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్చక్చర్ కార్పొరేషన్‌కు (టీఎస్‌ఐఐసీ) బదిలీ చేసింది.
ఫీనిక్స్ సంస్థ ఎనిమిది ఎకరాల్లో, కాండూర్ సంస్థ ఏడు ఎకరాల్లో వాణిజ్య భవనాలు నిర్మించడానికి టీఎస్‌ఐఐసీ 2023లో అనుమతులు మంజూరు చేసింది. ఫీనిక్స్ నిర్మాణాలను పూర్తి చేయగా, కాండూర్ సంస్థ స్కైలైన్ పేరుతో చేపట్టింది. వీటి విలువ రూ.6 వేల కోట్లు.
ఫీనిక్స్
గండిపేట మండలం పుప్పాలగూడలోని 9.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో గెటేడ్ కమ్యూనిటీ నిర్మించడానికి హెచ్‌ఎండీఏ 2021లో ఫీనిక్స్‌కు అనుమతి ఇచ్చింది. ప్లాన్‌తోపాటు గ్రామ మ్యాప్‌లోనూ సర్వే నంబర్లు 272, 273లను వాటర్ బాడీస్‌గా పేర్కొన్నా, అనుమతులు లభించాయి. వీటిలో ఫీనిక్స్ సంస్థ ఆరు సెల్లార్లు, గ్రౌండ్+30 అంతస్తుల్లో 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడుతోంది. దీని మార్కెట్ విలువ కూడా రూ.వందల కోట్లే.
ది ప్రెస్టేజ్ సిటీ
ప్రేమావతిపేటలోని సర్వే నంబరు 86లో 98 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది. ఇందులో 31 ఎకరాల్లో ది ప్రెస్టేజ్ సిటీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చింది. ఇందులో 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు వచ్చాయి.
మరో 24 ఎకరాల్లో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడంతోపాటు 15 ఎకరాల బఫర్ జోన్‌నూ మింగేశారు. వీటి విలువ రూ.8,600 కోట్లు. 1955–1976 మధ్య శిఖం తలాబ్‌లో రికార్డుల్లో ఉన్న ఈ భూమి 1985–86 నాటికి ప్రభుత్వ పట్టా భూమిగా మారిపోయింది.
చెరువు పేరే మారిపోయింది
గడ్డిపోతారంలోని ఉస్మాన్‌కుంట చుట్టూ 70 ఎకరాల్లో 884 విల్లాలు నిర్మించుకోవడానికి హెచ్‌ఎండీఏ 2021లో ప్రణీత్ ప్రవణ్ సంస్థకు అనుమతి ఇచ్చింది. వీరు చెరువు, దానిలోని నీళ్లు వచ్చి, వెళ్లే మార్గాలను అలానే ఉంచి... చుట్టూ 884 విల్లాలు నిర్మించారు. ప్రణీత్–ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్ అంటూ ఆ చెరువు పేరునే మార్చేశారు.
తెల్లాపూర్‌లోని చెరువు, శ్మశానాన్ని కబ్జా చేసిన ఏలియన్ స్పేస్ స్టేషన్ సంస్థ గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి అనుమతి పొందింది. ప్రస్తుతం ఈ చెరువు రికార్డులు సైతం అందుబాటులో లేకుండా చేశారు.
నోటిఫికేషన్ల జారీలోనూ గోల్‌మాల్
రెండు వేలకు పైగా చెరువులు ఉండగా, గడిచిన 14 ఏళ్లల్లో కేవలం 229 చెరువులకే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. గత నెలలోనే అనూహ్యంగా 95 చెరువులకు ఇది జారీ అయ్యింది. ఇందులోనూ ఏదో గోల్‌మాల్ ఉందనిపిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి రాక్స్, లేక్స్, పార్క్ అంటున్నారు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే... డ్యామేజెస్, ప్యాకేజెస్, పర్సంటేజెస్. పర్మిషన్ ఇచ్చిన అధికారులు, వెనుక ఉండి ఇప్పించిన రాజకీయ నాయకులు, నిర్మించిన బిల్డర్లు బాగానే ఉంటున్నారు.
ఏమీ తెలియకుండా కొనుక్కున్నవారు నష్టపోతున్నారు. ఇలాంటి అనుమతులు ఇచ్చి న అధికారులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలి. రిటైర్ అయితే వారి ఆస్తులను జప్తు చేయాలి. మరో 30 సంస్థల బాగోతాలు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేయడం, హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ప్రజా పోరాటం చేస్తా. ఇళ్లు కూల్చిన వారికి ఏం చేద్దాం అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు.
నా ఐదేళ్ల జీతభత్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ముందుకొస్తే దాదాపు రూ.300 కోట్లు సమకూరుతాయి. వీటితో నిర్వాసితులకు ఇళ్లు కట్టిద్దాం. చెరువుల్లో కట్టిన ఆ భవనాలు కూడా అక్రమ భవనాలే వాటిని కూడా కూల్చేయండి. లేనిపక్షంలో ఇప్పటివరకు కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయి బాధితులుగా మారిన వారికి వాటిలో ఇళ్లు ఇవ్వండి. అప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. లేకపోతే పైసల ప్రభుత్వం అవుతుంది. – కె.వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment