సాహస యువతకు ‘సాయుధ’ స్వాగతం | Central Armed Police Forces Release Notification | Sakshi
Sakshi News home page

సాహస యువతకు ‘సాయుధ’ స్వాగతం

Published Thu, Apr 30 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

Central Armed Police Forces Release Notification

 దేశ రక్షణ వ్యవస్థలో గ్రూప్-ఏ కేడర్ పోలీస్ అధికారిగా ప్రస్థానం ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు కేంద్ర సాయుధ పోలీసు దళం (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. యూపీఎస్‌సీ నిర్వహించే ఈ పరీక్షకు తాజా నోటిఫికేషన్ (సీఏపీఎఫ్-2015) వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు..
 
 కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ హోదాతో సరితూగే అసిస్టెంట్ కమాండెంట్ కొలువుల నియామకానికి యూపీఎస్సీ సిద్ధమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్... ఇలా అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా వెలువడిన నోటిఫికేషన్‌లో 304 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు యూపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది.
 
 దళాల వారీగా పోస్టుల వివరాలు
     బీఎస్‌ఎఫ్        28
     సీఆర్‌పీఎఫ్        94
     సీఐఎస్‌ఎఫ్        37
     ఐటీబీపీ        107
     ఎస్‌ఎస్‌బీ        38
     మొత్తం        304
 మూడంచెల ఎంపిక ప్రక్రియ:
 సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష; దేహ దారుఢ్య-వైద్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్); పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య-వైద్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు చివరగా ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ మూడు అంశాల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
 
 రాత పరీక్ష:
 ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్: ఈ పరీక్ష 250 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలుంటాయి. హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్‌లో జవాబులు నల్ల బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
 
 వర్తమాన అంశాలపై పట్టు:
 సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఈ పేపర్‌లోని ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నల్లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం-జీవ వైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్‌లో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలు, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. వర్తమాన అంశాల కోసం ఆర్థిక-రాజకీయ పరిణామాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది. దీంతోపాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం.. అందులోని ముఖ్య ఘట్టాలు-వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ-భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మేలు చేస్తుంది.
 
 పేపర్-2:
 ఎస్సే, ప్రెసిస్ రైటింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్: ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు ఉన్న ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. వీటిని హిందీ/ఇంగ్లిష్‌లో రాయవచ్చు. ప్రెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
 
 ప్రిపరేషన్ టిప్స్: ఈ విభాగంలో రాణించాలంటే అభ్యర్థులకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాన్ని క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి.
 
 రెండో దశ:
 దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్):
 శారీరక ప్రమాణాలు:
 పురుషులు    స్త్రీలు
 ఎత్తు    165 సెం.మీ    157 సెం.మీ
 బరువు    50 కిలోలు    46 కిలోలు
 
 నిర్దేశించిన విధంగా ఎత్తుకు తగిన బరువు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నాలుగు విభాగాల్లో (వంద మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్) ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఈ పరీక్షలు పురుషులు, మహిళలకు వేరువేరుగా ఉంటాయి.
 విభాగం    పురుషులు    మహిళలు
 100 మీటర్లు    16 సెకండ్లు    18 సెకండ్లు
 800 మీటర్లు    3ని॥45 సెకండ్లు    4 ని॥45 సెకండ్లు
 లాంగ్ జంప్    3.5 మీటర్లు    3 మీటర్లు
 షాట్‌పుట్
 (7.26 కేజీలు)    4.5 మీటర్లు    --
 
 లాంగ్‌జంప్, షాట్‌పుట్ విభాగాల్లో గరిష్టంగా మూడు సార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షాట్‌పుట్ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది.
 
 సన్నద్ధత:
 ఇందులో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై తర్ఫీదు పొందాలి. ఇవి ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు.
 
 పర్సనల్ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి; దేహ దారుఢ్య-వైద్య పరీక్షలలో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 150 మార్కులకు నిర్వహించే ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థిలో సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించే దృక్పథాన్ని పరీక్షిస్తారు.
 
 తుది జాబితాలో నిలిస్తే.. సర్వీసులు.. శిక్షణ: మూడు దశల ఎంపిక ప్రక్రియలో రాణించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు తాము పొందిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా శాఖను కేటాయిస్తారు. తర్వాత దశలో సుమారు ఏడాది వ్యవధిలో ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే గ్రూప్-ఎ గెజిటెడ్ హోదాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా పర్మనెంట్ విధుల్లో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 
 సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ - 2015 వివరాలు: మొత్తం ఖాళీలు: 304
 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయో పరిమితి: ఆగస్ట్ 1, 2015 నాటికి 20 నుంచి 25 ఏళ్లు. గరిష్ట వయో పరిమితిలో ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
 
 వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.దరఖాస్తు విధానం: ఠీఠీఠీ.ఠఞటఛిౌజ్ఛీ.జీఛి.జీ ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తమ సర్వీస్ ప్రిఫరెన్స్‌ను తెలియజేయాలి. మహిళా అభ్యర్థులకు ఐటీబీపీకి అర్హత లేదు. కాబట్టి మిగతా నాలుగు సర్వీసుల నుంచే తమ ప్రిఫరెన్స్‌ను పేర్కొనాలి.దరఖాస్తు రుసుం: రూ. 200. దీనిని ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లలో చెల్లించొచ్చు. పార్ట్-2 రిజిస్ట్రేషన్‌లో ‘పే బై క్యాష్’ మోడ్ ద్వారా ఎస్‌బీఐలో చలానా రూపంలో చెల్లించొచ్చు. ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2015, మే 14. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంది.
 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
 
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తు: 2015, ఏప్రిల్ 25 నుంచి 2015, మే 15
 పరీక్ష తేదీ: 2015, జూలై 12
 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జూన్ మూడో వారం
 
 సీఏపీఎఫ్ - 2014 కటాఫ్స్
 సీఏపీఎఫ్ 2014లో 450 మార్కులకు నిర్వహించిన రాత పరీక్ష; 150 మార్కులకు నిర్వహించిన ఇంటర్వ్యూలలో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు.
 2014    జనరల్    ఓబీసీ    ఎస్సీ    ఎస్టీ
 ఫైనల్ కటాఫ్    294    296    253    262
 రాత పరీక్ష    190    190    180    174
 ఇంటర్వ్యూ    104    106    73    89
 
 2013    జనరల్    ఓబీసీ    ఎస్సీ    ఎస్టీ
 ఫైనల్ కటాఫ్    279    283    253    253
 రాత పరీక్ష    171    165    151    143
 ఇంటర్వ్యూ    108    118    102    110
 
 ఉపయోగపడే వ్యూహాలు

 గత ప్రశ్న పత్రాల సాధన రైటింగ్ ప్రాక్టీస్
 వొకాబ్యులరీపై పట్టు.
 ప్రిపరేషన్ పూర్తి చేశాక ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపకల్పన
 మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం.
 సిలబస్‌ను పరిశీలించి తమకు కష్టమైన అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించడం. ఈ కష్టమైన అంశాల ప్రిపరేషన్‌కు సుదీర్ఘ సమయం కేటాయించడం సరికాదు.
 
 రిఫరెన్స్ బుక్స్
 సీపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామ్-
 అరిహంత్ బుక్స్
 సీపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ప్రాక్టీస్ వర్క్‌బుక్ - కిరణ్ ప్రకాశన్
 ఆరు నుంచి 12 తరగతుల వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్
 జనరల్ స్టడీస్ మాన్యువల్ - టాటా మెక్‌గ్రాహిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement