మావోల వేటకు ‘లాడెన్ శునకాలు’
సాక్షి, హైదరాబాద్: అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో అమెరికన్ నేవీ సీల్స్‌కు ఎంతగానో సహకరించిన మేలుజాతి శునకం ‘బెల్జియం మలినాయిస్’ మావోయిస్టు ప్రభావిత అడవుల్లో పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఏ) ఆమోదం తెలపడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అందుకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించింది.
విఫలమవుతున్న జర్మన్ షెపర్డ్ శునకాలు
సీఆర్పీఎఫ్ బలగాలు.. ప్రస్తుతం జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ జాతి శునకాలను వినియోగిస్తున్నాయి. వేడి ఎక్కువగా ఉండే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్స్‌లో ఈ జాతుల శునకాలు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేకపోతున్నాయని సీఆర్పీఎఫ్ గుర్తిం చింది. వాటికి వాసన పసిగట్టే శక్తి ఉండట్లేదు. దీంతో కొన్ని నెలల పాటు ఇక్కడి పరిస్థితులకు అనువైన శునకాలను గుర్తించడానికి బలగాలు అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం మలినాయిస్ సీఆర్పీఎఫ్ దృష్టిని ఆకర్షించింది.
ఏకధాటిగా 30 కి.మీ నడిచే మలినాయిస్
ఎలాంటి పరిస్థితుల్లో ఏకధాటిగా 30 కి.మీ నడవగలగటం బెల్జియం మలినాయిస్ జాతి శునకాలకు ఉన్న ప్రధాన లక్షణం. ఇతర శునకాల కంటే 40 రెట్లు ఎక్కువగా వాసన పసిగట్టే శక్తి ఈ శునకాల సొంతం. ప్రస్తుతం బెంగళూరులోని డాగ్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్‌లో ఈ శునక సంతతిని వృద్ధి చేయడంతో పాటు 20 వారాల పాటు శిక్షణ ఇస్తున్నారు. మరో ఏడాదిలో వీటిని సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు వినియోగించుకోనున్నాయి.