సాక్షి, ముంబై: లోక్‌సభ ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలపై సర్వత్రా చర్చలు జోరందుకున్నాయి. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మరాఠాలవైపు మళ్లింది. ఏ కూటమి అత్యిధిక స్థానాల్లో గెలుపొందినా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో రాష్ట్రం నుంచి గెలుపొందినవారు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి 35 స్థానాలను దక్కించుకునే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఈ కూటమి తరఫున రాష్ట్రంలో పోటీ చేసినవారికి కీలక మంత్రిపదవులు దక్కే అవకాశముందంటున్నారు.
మంత్రిపదవులపై పెరిగిన ఆశలు...
సర్వేలన్ని మహాకూటమికి అధిక సీట్లు వస్తాయని చెబుతుండడంతో రాష్ట్రంలోని కీలక నాయకుల్లో కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందన్న ఆశలు చిగురించాయి. మహాకూటమిలో ఈ విషయమై ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలిసింది. మహాకూటమిలోని భాగస్వామ పక్షమైన శివసేన 12 నుంచి 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సర్వేలు స్పష్టం చేస్తుండడంతో ఆ పార్టీకి కనీసం ఓ కేబినెట్ మంత్రి పదవితోపాటు మరో రెండు మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయంటున్నారు.
దీంతో శివసేనలోని ఆ ముగ్గురు ఎవరనే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అనంత్ గీతేకు కేంద్ర కేబినెట్ పదవి లభించే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చంద్రకాంత్ ఖైరే, ఆనందరావ్ అడసూల్, అనీల్ దేశాయ్, శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సంజయ్ రావుత్ బలమైన నాయకుడుగా భావించినప్పటికీ ఇటీవలే గుజరాతీ సమాజంపై విమర్శలు గుప్పిస్తూ సామ్నాలో సంపాదకీయం రాసినందుకుగాను ఆయనకు మంత్రిమండలిలో చోటుదక్కే అవకాశాలు సన్నగిల్లాయంటున్నారు.
బీజేపీ ధీమా..
రాష్ట్రంలో 15కుపైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశముందని బీజేపీ నేతలు ధీమాగాఉన్నారు. దీంతో ఆ పార్టీకి ఐదుకు తగ్గకుండా మంత్రిపదవులు దక్కే అవకాశముందని చెబుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు వ్యవసాయశాఖ దక్కే అవకాశముందని, నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ లేదా రైల్వేశాఖ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీలో కీలక నేతలుగా చెప్పుకునే కిరీట్ సోమయ్య, హంసరాజ్ ఆహిర్, హీనా గావిత్ తదితరులకు కూడా మంత్రిపదవులు దక్కవచ్చని చెబుతున్నారు. దళితనాయకుడైన ఆర్పీఐ అధ్యక్షులు రామ్‌దాస్ ఆఠవలేకు సహాయక మంత్రి పదవిని ఇవ్వొచ్చని, రాజు శెట్టి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు.
దిగ్గజాల్లో దిగులు..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన దిగ్గజాల్లో కూడా గెలుపోటములపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీరి భవితవ్యం ఎలా ఉండనుందనేది రేపు తేలనుంది. వీరిలో సుశీల్‌కుమార్ షిండే, ప్రఫుల్ పటేల్, ముకుల్ వాస్నిక్, మిలింద్ దేవరా, గురుదాస్ కామత్, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ, బాలానాంద గావ్కర్ తదితరుల గెలుపు అవకాశాలపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు.
నేడే తీర్పు మనమే కీలకం!
Published Thu, May 15 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement