వామపక్ష, వేర్పాటువాద ప్రభావ ప్రాంతాల్లో పోరుకు 34 మంది మహిళలకు కమెండో శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) తొలిసారిగా తన కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్‌లో మహిళా కమెండోలను రంగంలోకి దించనుంది. ఈ కమెండోలు వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ మహిళా కోబ్రా కమెండోలను బరిలోకి దింపుతారు.
2008–09లో సీఆర్‌పీఎఫ్‌లో అంతర్గతంగా రెండు కోబ్రా బెటాలియన్లను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 2009–10 సంవత్సరంలో ఈ బెటాలియన్ల సంఖ్యను నాలుగుకు పెంచారు. 2010–11లో మరో 4 బెటాలియన్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, 6 మహిళల, 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్‌లో మొదటి మహిళా బెటాలియన్ 1986లో ఏర్పడింది. ఇటీవల మహిళా బెటాలియన్ 35వ రైజింగ్ డే సందర్భంగా కోబ్రా శిక్షణకు మహిళా జవాన్లను ఎంపిక చేశారు. ప్రస్తుతం కోబ్రా యూనిట్‌లో కమెండో శిక్షణ కోసం ఎంపికైన 34 మంది మహిళా జవాన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది మహిళా జవాన్లు కోబ్రా యూనిట్‌లో చేరేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం.
కమాండో శిక్షణలో భాగంగా మహిళా జవాన్ల శారీరక ధారుఢ్యం, సాంకేతిక అవగాహనను పెంచడమే కాకుండా ఫైరింగ్, ప్రత్యేక ఆయుధాల వినియోగం, శత్రువులను ఎదుర్కొనేందుకు ప్రణాళికల రూపకల్పన, ఫీల్డ్ క్రాఫ్ట్, పేలుడు పదార్థాల ఏరివేత, అడవుల్లో మనుగడకు సంబంధించిన నైపుణ్యాలను అందిస్తారు. కోబ్రా కమాండో శిక్షణ పూర్తయిన తర్వాత పురుష కమాండోలతో కలిసి వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో మహిళా కమెండోలను మొహరిస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్‌లోని కోబ్రా యూనిట్లను నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో పాటు, కొన్ని యూనిట్లను ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు చర్యల అణిచివేతకు వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment