cobra forces
-
కోబ్రా దళంలో మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) తొలిసారిగా తన కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్లో మహిళా కమెండోలను రంగంలోకి దించనుంది. ఈ కమెండోలు వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ మహిళా కోబ్రా కమెండోలను బరిలోకి దింపుతారు. 2008–09లో సీఆర్పీఎఫ్లో అంతర్గతంగా రెండు కోబ్రా బెటాలియన్లను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 2009–10 సంవత్సరంలో ఈ బెటాలియన్ల సంఖ్యను నాలుగుకు పెంచారు. 2010–11లో మరో 4 బెటాలియన్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, 6 మహిళల, 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. సీఆర్పీఎఫ్లో మొదటి మహిళా బెటాలియన్ 1986లో ఏర్పడింది. ఇటీవల మహిళా బెటాలియన్ 35వ రైజింగ్ డే సందర్భంగా కోబ్రా శిక్షణకు మహిళా జవాన్లను ఎంపిక చేశారు. ప్రస్తుతం కోబ్రా యూనిట్లో కమెండో శిక్షణ కోసం ఎంపికైన 34 మంది మహిళా జవాన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది మహిళా జవాన్లు కోబ్రా యూనిట్లో చేరేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం. కమాండో శిక్షణలో భాగంగా మహిళా జవాన్ల శారీరక ధారుఢ్యం, సాంకేతిక అవగాహనను పెంచడమే కాకుండా ఫైరింగ్, ప్రత్యేక ఆయుధాల వినియోగం, శత్రువులను ఎదుర్కొనేందుకు ప్రణాళికల రూపకల్పన, ఫీల్డ్ క్రాఫ్ట్, పేలుడు పదార్థాల ఏరివేత, అడవుల్లో మనుగడకు సంబంధించిన నైపుణ్యాలను అందిస్తారు. కోబ్రా కమాండో శిక్షణ పూర్తయిన తర్వాత పురుష కమాండోలతో కలిసి వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో మహిళా కమెండోలను మొహరిస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్లోని కోబ్రా యూనిట్లను నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో పాటు, కొన్ని యూనిట్లను ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు చర్యల అణిచివేతకు వినియోగిస్తున్నారు. -
నక్సల్స్ ఏరివేతలో కీలకం కానున్న మహిళా శక్తి
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతుంటాయి. అయితే, నక్సల్స్ ఏరివేతలో మహిళా శక్తిని కూడా వినియోగించుకోవాలని కేంద్రం భావించింది. ఈ మేరకు నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మహిళా భద్రతా దళాలు విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడవుల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) మహిళా కమాండోలు పని చేయనున్నారు. సీఆర్పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుచేసిన ఘనత సీఆర్పీఎఫ్కే దక్కిందని ప్రకటించింది. ఇక సీఆర్పీఎప్ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను అరికడతామని ధీమా వ్యక్తం చేసింది. సీఆర్పీఎఫ్ మహిళా బెటాలియన్‌లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి తెలిపారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయని వివరించారు. విధి నిర్వహణలో భాగంగా సీఆర్పీఎఫ్ దళం అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తోందని పేర్కొన్నారు. Women commandos for Anti-Naxals operations: @crpfindia inducts #women commondos for its anti #naxal CoBRA unit. After completion of their 3 months training, mahila warriors will be posted in Naxal affected areas like Sukma, Dantewada, Bijapur etc with male commandos. pic.twitter.com/P3UGRxA2lH — Ankur Sharma (@AnkurSharma__) February 6, 2021 -
హెలికాఫ్టర్‌పై మావోయిస్టుల కాల్పులు
ఛత్తీస్‌గఢ్ : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లా చింతల్నార్ సీఆర్పీఎఫ్ సమీపంలో నేవీకి చెందిన MI-17 యుద్ధ హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఈరోజు ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హెలికాప్టర్ సాయంతో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు జవాన్లు ప్రయత్నించారు. అయితే మావోలు కాల్పులు జరపటంతో మూడు బుల్లెట్లు తగిలి హెలికాప్టర్ గాలిలోనే వెనుతిరిగింది. మరోవైపు ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. -
మావోయిస్టులు - కోబ్రా దళాల మధ్య కాల్పులు
ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా, వారికి బెర్జి అటవీ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు ఎదురయ్యారు. ఇరు పక్షాల మధ్య హోరా హోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి ఎంతమంది గాయపడ్డారోనన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మావోయిస్టుల నుంచి పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.