buried body
-
కారుతోపాటే ఖననం చేశారు..వైరల్!
-
కారుతోసహా పూడ్చిపెట్టేశారు
బీజింగ్: మనుషుల మధ్య బంధాలు కరువైన ఈ కాలంలో.. ప్రాణం లేని వస్తువుపై మక్కువ పెంచుకున్నాడో వ్యక్తి. తాను ఎంతగానో ఇష్టపడే కారు ఎప్పటికీ తనతోపాటే ఉండాలనుకున్నాడు. అందుకే స్థానికులు కారులోనే అతని భౌతికకాయన్ని ఉంచి ఖననం చేసేశారు. సౌత్ చైనా మార్నింగ్ కథనం ప్రకారం... హెబెయి ప్రొవిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన క్వై అనే వ్యక్తి పదేళ్ల క్రితం హుండాయ్ సోనాటా కారును కొనుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. అయితే కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న క్వై.. సోమవారం మృతి చెందాడు. ఆఖరి ఘడియల్లో ఉన్న సమయంలో తన పక్కనున్నవారితో ఓ విషయం చెప్పాడు. తనను శవపేటికలో కాకుండా ప్రేమగా చూసుకున్న కారుతోపాటే ఖననం చేయాలని కోరాడు. అతని కోరిక ప్రకారమే స్థానికులు ఓ క్రేన్‌ను తెప్పించి కారుతో సహా పూడ్చిపెట్టారు. ఆపై దానిపై కాంక్రీట్ నింపి సమాధిని నిర్మించారు. చైనా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఈ వీడియో.. ఇప్పుడు మిగతా మీడియా ఛానెళ్లలోనూ హల్ చల్ చేస్తోంది. -
కూతురు ఆత్మహత్య.. ఇంటి ఆవరణలో పాతిపెట్టిన తండ్రి
శ్రీరాంపూర్(మంచిర్యాల) : కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కన్న తండ్రే ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్‌కు వచ్చి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని బుధవారం ఉదయం మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా బయటకు తీయించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఎస్సై ఉమాసాగర్ కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన జి.గజేంద్రన్ ఇక్కడి సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఉన్న సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో జవాన్‌గా పని చేస్తున్నాడు. ఇక్కడ కాంప్లెక్స్‌లోని ఓ క్వార్టర్లో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. భార్య దేవిక, కూతురు గౌరీ ఉన్నారు. కుమారుడు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దేవిక కొద్ది రోజులుగా భర్తతో కలిసి ఉండడం లేదు. గౌరీకి కొద్ది నెలల క్రితం గోదావరిఖనికి చెందిన రామస్వామితో వివాహామైంది. ఇద్దరి మధ్య గొడవలతో గోదావరిఖనిలో గృహ హింస కేసు నడుస్తోంది. దీంతో గౌరీ తండ్రితో ఉంటోంది. భర్త తీసుకెళ్లడం లేదని తన కూతురు గౌరీ(27) మనస్తాపం చెంది ఈ నెల 4న ఇంట్లోనే ఉరి వేసుకుందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత చూసే సరికి మృతిచెంది ఉందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తానే క్వార్టర్ ఆవరణలో గోతి తీసి పూడ్చిపెట్టినట్లు గజేంద్రన్ మంగళవారం ఎస్సై ఉమాసాగర్కు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని బుధవారం మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, రూరల్ సీఐ ప్రమోద్‌రావు సందర్శించారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. కుటుంబ సభ్యులు, సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ శ్రీనివాస్ సమక్షంలో నస్పూర్ తహసీల్దార్ జ్యోతి, వైద్యులు శేఖర్‌రావు, కీర్తిలు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. కాగా, గౌరీ మృతి అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనను ఎందుకు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసాడనేది విచారణలో తేలాల్సి ఉంది. మీడియా సిబ్బంది సీఐఎస్ఎఫ్ కాంప్లెక్స్‌లో వెళ్లడానికి ప్రయత్నించగా కాపలా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై అధికారుల ఆదేశాలు అంటూ లోపలికి వెళ్లనీయలేదు. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
తర్తూరు (జూపాడుబంగ్లా): పూడ్చిన మృతదేహాన్ని 15 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన తర్తూరు గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బీసన్న (48) నందికొట్కూరు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 18వ తేదీన ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఉన్న తన పొలాన్ని చూసుకుని బైక్‌పై వస్తుండగా మిడ్తూరు సమీపంలో అదుపు తప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే నెల 25 తేదీన అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హడావుడిగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోలుకోలేక అదేరోజు మృతి చెందాడు. అదే రోజు గ్రామంలో ఖననం చేశారు. కర్మఖాండల అనంతరం ప్రభుత్వం నుంచి తమ కుటుంబానికి రావాల్సిన డబ్బుతో పాటు ఉద్యోగం పొందేందుకు బీసన్న కుమారుడు సంపత్‌కుమార్ ఇటీవల నందికొట్కూరు డిపో మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా కోరాడు. కాగా బీసన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీలను ఇవ్వాలని డిపో మేనేజర్ సూచించడంతో సంపత్‌కుమార్ ఆదివారం మిడుతూరు ఎస్ఐ సుబ్రమణ్యంకు సమస్యను వివరించాడు. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసుకొని సోమవారం డిప్యూటీ తహసీల్దారు గౌరీశంకరశర్మ, నందికొట్కూరు వైద్యాధికారి ప్రసాద్‌నాయక్ ఆధ్వర్యంలో బీసన్న మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కేశవరెడ్డి, తహసీల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంటు మీనాకుమార్, వీఆర్వో స్వామన్న తదితరులు పాల్గొన్నారు.