పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
Published Mon, Jul 10 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
తర్తూరు (జూపాడుబంగ్లా): పూడ్చిన మృతదేహాన్ని 15 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన తర్తూరు గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బీసన్న (48) నందికొట్కూరు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 18వ తేదీన ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఉన్న తన పొలాన్ని చూసుకుని బైక్‌పై వస్తుండగా మిడ్తూరు సమీపంలో అదుపు తప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే నెల 25 తేదీన అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హడావుడిగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కోలుకోలేక అదేరోజు మృతి చెందాడు. అదే రోజు గ్రామంలో ఖననం చేశారు.
కర్మఖాండల అనంతరం ప్రభుత్వం నుంచి తమ కుటుంబానికి రావాల్సిన డబ్బుతో పాటు ఉద్యోగం పొందేందుకు బీసన్న కుమారుడు సంపత్‌కుమార్ ఇటీవల నందికొట్కూరు డిపో మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా కోరాడు. కాగా బీసన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఐఆర్ కాపీలను ఇవ్వాలని డిపో మేనేజర్ సూచించడంతో సంపత్‌కుమార్ ఆదివారం మిడుతూరు ఎస్‌ఐ సుబ్రమణ్యంకు సమస్యను వివరించాడు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని సోమవారం డిప్యూటీ తహసీల్దారు గౌరీశంకరశర్మ, నందికొట్కూరు వైద్యాధికారి ప్రసాద్‌నాయక్ ఆధ్వర్యంలో బీసన్న మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ కేశవరెడ్డి, తహసీల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంటు మీనాకుమార్, వీఆర్వో స్వామన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement