Mancherial Crime news Telugu: Drinking Father Assassinated 35 Years Old Son At Mancherial - Sakshi
Sakshi News home page

మార్పు కోరిన తనయుడిని హతమార్చిన తండ్రి.. కొలువు ఇస్తాడనుకుంటే..

Published Wed, Apr 13 2022 5:36 PM | Last Updated on Wed, Apr 13 2022 6:55 PM

Drinking Father Assassinated 35 Years Old Son At Mancherial - Sakshi

మృతుడు కనుకుంట్ల రాజ్‌కుమార్‌ (పాతచిత్రం) 

సాక్షి, శ్రీరాంపూర్‌(మంచిర్యాల): తాగుడు మాని, తల్లిని మంచిగా చూసుకో.. ఇప్పటికైనా మారవా...? అని కోరిన కొడుకును తండ్రి హతమార్చాడు. ఈ సంఘటన మంచిర్యాల శ్రీరాంపూర్‌ శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కొత్తరోడ్‌ రాజీవ్‌నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. సింగరేణి కార్మికుడు కనుకుంట్ల కొమురయ్య తన ఏకైక కుమారుడు రాజ్‌కుమార్‌(35)ను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్కే6గనిలో పని చేస్తున్న కొమురయ్యకు భార్య కమల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రాజ్‌కుమార్‌ ఉన్నారు.

కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. కుమారుడు ఐటీఐ పూర్తి చేశాడు. తల్లిదండ్రులతోపాటు ఇంట్లోనే ఉంటున్నాడు. కొమురయ్య కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచు భార్యతో గొడవ పడుతూ ఆమెకు వివాహేతర సంబంధం అంటగడుతూ వేధించేవాడు. ఈ విషయంలో కొడుకు తండ్రి నిర్వాహకాన్ని ప్రశ్నించే వాడు. దీంతో కొమురయ్య తన కొడుకుపై కూడా కోపం పెంచుకొని తరచూ తిట్టేవాడు. ఎదిగిన తన కొడుకు చెప్పినా మారకుండా వేధింపులకు గురి చేయడంతో ఇబ్బందులు తాళలేక కమల  కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది.

దీంతో తండ్రికొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం కొమురయ్య తాగివచ్చి తల్లికి మద్దతు ఇస్తున్నావంటూ కొడుకుతో గొడవపడ్డాడు. రాజ్‌కుమార్‌ మంచంపై పడుకుని సెల్‌ఫోన్‌ చూస్తుండగా కొమురయ్య కర్రతో తలపై చితకబాధాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రాజ్‌కుమార్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. కొద్ది సేపటికి కొమురయ్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీరాంపూర్‌ సీఐ రాజు, ఎస్సై మానస కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కొలువు చేద్దామన్న కోరిక తీరలే...
రాజ్‌కుమార్‌ ఐటీఐ చేయగా.. సింగరేణిలో తండ్రి స్థానంలో వచ్చే కారుణ్య ఉద్యోగం చేస్తానని కలలుగన్నాడు. రెండేళ్ల సర్వీసు కూడా దగ్గరగా వచ్చింది. గతంలోనే కొమురయ్య మెడికల్‌ బోర్డుకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల్లో బోర్డు పిలుస్తుందని, అన్‌ఫిట్‌ అవుతాడని, ఇక తాను తండ్రి స్థానంలో సింగరేణి కొలువు చేస్తానని రాజ్‌కుమార్‌ ఎంతో ఆశపడ్డాడు. కొలువు ఇస్తాడనుకున్న తండ్రే కాటికి పంపడం తీవ్ర విషాదం నింపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement