రక్తార్పణం | accidents address care of singareni mines | Sakshi
Sakshi News home page

రక్తార్పణం

Published Wed, Aug 13 2014 1:16 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accidents address care of singareni mines

 శ్రీరాంపూర్ : సింగరేణి గనులు ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. అనేక ప్రమాదాలు పైకప్పు కూలడం వల్ల జరుగుతున్నాయి. దీంతో చాలా మంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కాగా, కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తూ లోపలికి వెళ్తున్న కొద్ది పైకప్పు కూలకుండా సపోర్టు పెడతారు.

 గతంలో చెక్కదిమ్మలు కట్టేవారు. ఇటీవలి కాలంలో రూఫ్‌బోల్టులు వేస్తున్నారు. ఇవి కూడా ఆరు ఫీట్ల పైనుంచి పొర విడుచుకుంటూ వచ్చినా రక్షణ ఇవ్వడం లేదు. ఒత్తిడి ఒక్కసారి పెరిగితే రూఫ్‌బోల్టు ఊడివచ్చి రూఫ్‌పాల్‌గా మారుతుంది. రూఫ్‌పాల్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం సింగరేణి వద్ద లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందబాటులోకి రాలేదు.

కూలడానికి కొన్ని సెకన్ల ముందు వచ్చే శబ్దాలు విని కార్మికులు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే మార్గం. క్షణ కాలంలో జరిగే ఈ ప్రమాదాల్లో కొద్ది మంది మాత్రమే బతికే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రమాదంగా మారుతుందని ఇండికేషన్ ఇచ్చే పరికరాలు ఉన్నాయి. లోడ్‌సెల్ అనే పరికరం ద్వారా పైకప్పు ఒత్తిడి ఎంత ఉందో కొలుస్తారు. ఒత్తిడి పెరుగుతూ వస్తే ప్రమాద స్థలంగా(ఫాల్ట్ ఏరియా)గా గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడతారు.

 ప్రధానంగా పర్యవేక్షణ లోపం
 ప్రమాద స్థలంలో పని చేసేటప్పుడు కార్మికులు స్వీయ రక్షణ తీసుకోవడం అవసరం. అలాగే కార్మికులను ప నులకు పురమాయించేటప్పుడు సింగరేణి అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, అలా చేయడం లేదు. ప్రమాదకరంగా ఉన్న పనిస్థలాల్లో బొగ్గు వెలికితీత నిపుణులైన అధికారుల సమక్షంలో జరగాలి. దీనికి సరిపడా సూపర్‌వైజర్లు ఉండాలి. కానీ సింగరేణి వ్యాప్తంగా 600 ఓవర్‌మెన్, సర్దార్ల కొరత ఉంది. దీనికితోడు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం అధికారులు పోటీపడుతూ పనులు చేయిస్తున్నారు.

రేజింగ్ తక్కువగా వస్తే పరుగెత్తించి పనులు చేయిస్తున్నారు. అంతేకాకుండా రక్షణ కోసం సేఫ్టీ సిబ్బందిని, సూపర్‌వైజర్లను ఇవ్వమని అడిగితే అధికారులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు గనిలోకి దిగి పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదు. సేఫ్టీ సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఫేస్ వర్కర్లకు స్థానం కల్పించాల్సిన చోట ఎక్కడో సర్ఫేస్‌లో పని చేసే నాయకులు సేఫ్టీ కమిటీల్లో ఉంటున్నారు. కార్పొరేట్ స్థాయి సేఫ్టీ సమావేశం జరగక రెండేళ్లు అవుతుంది. సేఫ్టీ వీక్ కూడా నిర్వహించడం లేదంటే యాజమాన్యానికి కార్మికులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.

 నష్టపరిహారాల చెల్లింపుల్లో అన్యాయం
 ఎంత నష్టపరిహారం ఇచ్చిన చనిపోయిన కార్మికుడు లేని లోటు ఆ కుటుంబానికి పూడ్చనిది. అయితే వారికి ఆదుకోవడానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అధ్వానంగా ఉంది. గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి యాజమాన్యం రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. ఇది కూడా విధుల్లో ఉన్నప్పుడు ప్ర మాదం జరిగితేనే. అదే గుండెపోటుతో, గాలి అందక ఊపిరి ఆగి చనిపోతే ఇవ్వడం లేదు. గాయాలై చనిపోతేనే ఎక్స్‌గ్రేషియా అంటున్నారు. ఈ వివక్ష దేశంలో ఎక్కడ లేదని కార్మికులు మండి పడుతున్నారు.

వైజాగ్ స్టీల్‌ప్లాంటులో బాయిలర్ పేలి కార్మికులు చనిపోయిన ఘటనలో యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. హెచ్‌పీసీఎల్‌లో రూ. కోటి నష్టపరిహారం చెల్లించారు. ఏటా రూ.400 కోట్ల లాభాలు సాధించి పెడుతున్న కార్మికులకు ఇచ్చేది కేవలం రూ.6లక్షలే. కార్మికుడు మృతిచెందినప్పుడు కార్మిక సంఘాలు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శవంతో బైఠాయించి శవరాజకీయాల చేయడానికి యూనియన్ నేతలు పనికి వస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.

కార్మికుడు చనిపోయిన తరువాత మరుసటి రోజు వెళ్లి కనీసం ఆ కుటుంబ బాగోగులు కూడా తెలుసుకోరు. ఎన్నికల్లో తాము గెలిస్తే వైజాగ్ త రహాలో ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామని టీబీజీకేఎస్ నేతలు బీరాలు పలికారు. తీరా గెలిచిన తరువాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి మాత్రమే యాజమాన్యం ముందుకు వచ్చింది. దీనికి ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎమ్మెస్‌లు అడ్డుపడ్డాయి. కార్మికుల నుంచి సగం డబ్బులు వసూలు చేసి ఇస్తే యాజమాన్యం సగం కలిపి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ వద్దని ఎక్స్‌గ్రేషియానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే జాతీయ సంఘాలని చెప్పుకొనే సంఘాలు దీనిపై కోలిండియాలో ఎందుకు సాధించుకురావడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అధికారం సింగరేణికి ఉందని.. కాదు ప్రభుత్వమే ఆదేశించాలని.. కాదు ఇది దీనికి కోలిండియాలోనే ఒప్పందం చేసుకోవాలని ఒక సంఘంపై మరో సంఘం ఆరోపించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయి. ఎంత సేపు ఇతర సంఘాన్ని వైఫల్యం చెందించి వచ్చే ఎన్నికల నాటికి బలపడాలన్నదే అన్ని సంఘాల ఎత్తుగడ తప్ప ఐక్యంగా పోరాడి ఎక్స్‌గ్రేషియా సాధించాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఏది ఏమైన అటు యాజమాన్యం కార్మికుల ప్రాణాలకు రక్షణ ఇవ్వకపోవడం, ఇటు సంఘాలు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో నల్లసూర్యుల కుటుంబాలు చీకటి మయం అవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement