శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : జూన్ 2న అవతరిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సింగరే ణి జీవగర్ర కానుంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుత్. తెలంగాణలోని విద్యుత్ సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ర్ట అవ సరాలకు సరిపోవడం లేదు. 4 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లోటు తీర్చాల్సిన బాధ్యత సింగరేణిపై పడింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ముడిసరుకైన బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏర్పడే 4 వేల మెగావాట్ల లోటు తీరాలంటే సింగరేణి అదనంగా ఏడాదికి సుమారు మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బొగ్గు కొత్త విద్యుత్ సంస్థలతోపాటు, కెపాసిటీ పెంచే పాత సంస్థలకు అవసరం పడుతుంది. ఇదిలాఉంటే గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 54.3 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న అందులో కేవలం 50.4 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఏటా వార్షిక బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం బొగ్గు విద్యుత్ సంస్థలకే సరఫరా చేయడం జరుగుతున్నది.
కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన
సింగరేణిలో 35 భూగర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 65 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సాలీనా 50 మిలియన్ టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. 2012-13లో 53.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. తరువాత సంవత్సరం తగ్గింది. కారణం గనులు పాతపడటంతో బొగ్గు నిక్షేపాలు లోతుల్లోకి వెళ్లి ఉత్పత్తికి ప్రతికూలంగా మారుతున్నాయి. అంతేకాకుండా కొత్త భూగర్భ, ఓసీపీలకు అనుమతుల్లో జాప్యం జరుగడం వల్ల బొగ్గు ప్రాజెక్టులు మొదలు కాక ఉత్పత్తి క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 55 మిలియన్ టన్నుల లక్ష్యం ఉంది. కొత్త రాష్ట్రంలో 18 మిలియన్ టన్నుల బొగ్గును అధనంగా సరఫరా చేయడం తప్పని సరైంది. ఇంత భారీ మొత్తం ఉత్పత్తి చేయాలంటే కొత్త గనులు తవ్వాల్సిందే.
దీని కోసం యాజమాన్యం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. విద్యుత్ సమస్య వాకిట్లో ఉన్న దృష్ట్యా త్వరితగతిన బొగ్గు ఉత్పత్తి పెంచాలంటే ఓసీపీలకే ప్రాధాన్యత ఇవాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం 6 నుంచి 8 కొత్త ఓసీపీలు ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న ఓసీపీలు.. తాడిచెర్ల, భూపాలపల్లి ఓసీపీ-2, శ్రావణ్‌పల్లి, మహేదేవ్‌పూర్, ఆర్జీ ఓసీపీ 3 ఫేజ్ 2, జీవీఆర్ ఓసీపీ 2 వంటి పలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
మరి కొన్ని భూగర్భ గనులు
ఇదిలా ఉంటే దీనితోపాటు మరి కొన్ని భూగర్భ గనులు కూడా అవసరం ఉంది. శాంతిఖని, మందమర్రి షాఫ్ట్‌బ్లాక్, ఆర్కేపీ షాఫ్ట్‌బ్లాక్, కేకే 5 విస్తరణ, కాసిపేట 2 ఇంక్లైన్, గుండాల వంటి గనులు వేగవంతంగా తవ్వాలని భావిస్తున్నారు. కొత్తగా మొదలైన అడ్రియాల ప్రాజెక్టు నుంచి కూడా బొగ్గు ఉత్పత్తిని ఘననీయంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది.
భవిష్యత్‌లో సింగరేణి మరిన్ని ప్లాంట్లు
కొత్త రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు విద్యుత్ సమస్యలు తీరాలంటే సింగరేణి కూడా రాబోయే రోజుల్లో మరికొన్ని పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి కొత్త ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్టు తప్పని సరి అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సొంతంగా జైపూర్‌లో 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నది. ఇకపై దీని సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని యాజమాన్యం భావిస్తుంది. అదే విధంగా రామగుండం బీ పవర్‌హౌజ్‌నుంచి 60 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్టులకు కెపాసిటి పెంచుతూ అదనపు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎన్టీపీసీ, భూపాలపల్లి, పాల్వంచ ఇంకా ఇతర జెన్‌కో పరిధిలోని ప్లాంట్లను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
విద్యుత్ అవసరాల కోసం కొత్త ప్రాజెక్టులు తప్పని సరి
తెలంగాణలో 4 వేల మెగావాట్ల లోటు ఉంది. ఈ లోటు తీరాలంటే ఉన్న విద్యుత్ కంపెనీలకు, కొత్త వాటికి డిమాండ్‌కు తగ్గట్లు బొగ్గు ఉత్పత్తిని పెంచాలి. ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి కంటే మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధనంగా చేయాలి. దీనికి 6 నుంచి 8 ఓసీపీలు త్వరితగతిన మొదలు పెట్టాలి. మరికొన్ని భూగర్భ గనులు తవ్వాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టితేనే డిమాండ్‌కు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతాము.
కొత్త రాష్ర్టంలో విద్యుత్ లోటు
Published Wed, May 14 2014 1:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement