Mining production
-
భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్‌లో బంగారం మార్కెట్‌పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు. ► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్‌కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. ► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం. ► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి. ► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి. ► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్‌లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది. ► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది. ► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్‌లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్‌ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. సానుకూల మార్పులు ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ -
రక్షణ సూత్రాలతోనే ప్రమాదాల నివారణ
జీడీకే–11వ గనిని సందర్శించిన రక్షణ తనిఖీ బృందం గోదావరిఖని : సింగరేణి గనుల్లో రక్షణ సూత్రాలు పాటిస్తేనే ప్రమాదాలు నివారించగలుగుతామని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ గురువయ్య అన్నారు. 49 రక్షణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జీడీకే–11వ గనిని రక్షణ తనిఖీ బృందం సందర్శించింది. ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో రక్షణకు కూడా అంతే ఇవ్వాలని సూచించారు. రక్షణను విస్మరించడం, చెడు అలవాట్లకు బానిస కావడంతో కలిగే అనర్ధాలను తెలిపేలా రిచర్డ్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడి ‘భూతం’ వేషధారణ ఆకట్టుకుంది. కార్మికులు చేసే పనిలో నిమగ్నం కాకుండా ఇతర వృత్తులను చేపడితే ఏర్పడే ప్రమాదాలపై జనరల్ మజ్దూర్ కార్మికులు మార్క మొగిలి, తీగల లింగయ్య, సర్వే లైన్ మెన్ కె.రామస్వామి ప్రదర్శించి న నాటిక ఆలోచింపచేసింది. ఏజెంట్ సాంబయ్య, మేనేజర్ బి.రవీందర్, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్‌బాబు, సంక్షేమాధికారి సారంగపాణి, నాయకులు ఆరెళ్లి పోచం, మోదుల సంపత్, వీరయ్య పాల్గొన్నారు. డివిజన్ –1 పరిధిలోని ఎంవీటీసీలో రక్షణ వారోత్సవాలు నిర్వహించారు. ఎంవీటీసీ టీం కన్వీనర్ ఎంఏసీ రెడ్డి, సభ్యులు సుబ్రహ్మణ్యం, ప్రసన్నకుమార్ గనుల్లో జరిగే ప్రమాదాలు, వాటి నివారణ, రక్షణపై కార్మికులకు వివరించారు. -
రక్తార్పణం
శ్రీరాంపూర్ : సింగరేణి గనులు ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. అనేక ప్రమాదాలు పైకప్పు కూలడం వల్ల జరుగుతున్నాయి. దీంతో చాలా మంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కాగా, కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తూ లోపలికి వెళ్తున్న కొద్ది పైకప్పు కూలకుండా సపోర్టు పెడతారు. గతంలో చెక్కదిమ్మలు కట్టేవారు. ఇటీవలి కాలంలో రూఫ్బోల్టులు వేస్తున్నారు. ఇవి కూడా ఆరు ఫీట్ల పైనుంచి పొర విడుచుకుంటూ వచ్చినా రక్షణ ఇవ్వడం లేదు. ఒత్తిడి ఒక్కసారి పెరిగితే రూఫ్‌బోల్టు ఊడివచ్చి రూఫ్పాల్గా మారుతుంది. రూఫ్పాల్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం సింగరేణి వద్ద లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందబాటులోకి రాలేదు. కూలడానికి కొన్ని సెకన్ల ముందు వచ్చే శబ్దాలు విని కార్మికులు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే మార్గం. క్షణ కాలంలో జరిగే ఈ ప్రమాదాల్లో కొద్ది మంది మాత్రమే బతికే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రమాదంగా మారుతుందని ఇండికేషన్ ఇచ్చే పరికరాలు ఉన్నాయి. లోడ్సెల్ అనే పరికరం ద్వారా పైకప్పు ఒత్తిడి ఎంత ఉందో కొలుస్తారు. ఒత్తిడి పెరుగుతూ వస్తే ప్రమాద స్థలంగా(ఫాల్ట్ ఏరియా)గా గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడతారు. ప్రధానంగా పర్యవేక్షణ లోపం ప్రమాద స్థలంలో పని చేసేటప్పుడు కార్మికులు స్వీయ రక్షణ తీసుకోవడం అవసరం. అలాగే కార్మికులను ప నులకు పురమాయించేటప్పుడు సింగరేణి అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, అలా చేయడం లేదు. ప్రమాదకరంగా ఉన్న పనిస్థలాల్లో బొగ్గు వెలికితీత నిపుణులైన అధికారుల సమక్షంలో జరగాలి. దీనికి సరిపడా సూపర్వైజర్లు ఉండాలి. కానీ సింగరేణి వ్యాప్తంగా 600 ఓవర్‌మెన్, సర్దార్ల కొరత ఉంది. దీనికితోడు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం అధికారులు పోటీపడుతూ పనులు చేయిస్తున్నారు. రేజింగ్ తక్కువగా వస్తే పరుగెత్తించి పనులు చేయిస్తున్నారు. అంతేకాకుండా రక్షణ కోసం సేఫ్టీ సిబ్బందిని, సూపర్వైజర్లను ఇవ్వమని అడిగితే అధికారులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు గనిలోకి దిగి పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదు. సేఫ్టీ సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఫేస్ వర్కర్లకు స్థానం కల్పించాల్సిన చోట ఎక్కడో సర్ఫేస్‌లో పని చేసే నాయకులు సేఫ్టీ కమిటీల్లో ఉంటున్నారు. కార్పొరేట్ స్థాయి సేఫ్టీ సమావేశం జరగక రెండేళ్లు అవుతుంది. సేఫ్టీ వీక్ కూడా నిర్వహించడం లేదంటే యాజమాన్యానికి కార్మికులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నష్టపరిహారాల చెల్లింపుల్లో అన్యాయం ఎంత నష్టపరిహారం ఇచ్చిన చనిపోయిన కార్మికుడు లేని లోటు ఆ కుటుంబానికి పూడ్చనిది. అయితే వారికి ఆదుకోవడానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అధ్వానంగా ఉంది. గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి యాజమాన్యం రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. ఇది కూడా విధుల్లో ఉన్నప్పుడు ప్ర మాదం జరిగితేనే. అదే గుండెపోటుతో, గాలి అందక ఊపిరి ఆగి చనిపోతే ఇవ్వడం లేదు. గాయాలై చనిపోతేనే ఎక్స్‌గ్రేషియా అంటున్నారు. ఈ వివక్ష దేశంలో ఎక్కడ లేదని కార్మికులు మండి పడుతున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంటులో బాయిలర్ పేలి కార్మికులు చనిపోయిన ఘటనలో యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. హెచ్పీసీఎల్లో రూ. కోటి నష్టపరిహారం చెల్లించారు. ఏటా రూ.400 కోట్ల లాభాలు సాధించి పెడుతున్న కార్మికులకు ఇచ్చేది కేవలం రూ.6లక్షలే. కార్మికుడు మృతిచెందినప్పుడు కార్మిక సంఘాలు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శవంతో బైఠాయించి శవరాజకీయాల చేయడానికి యూనియన్ నేతలు పనికి వస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుడు చనిపోయిన తరువాత మరుసటి రోజు వెళ్లి కనీసం ఆ కుటుంబ బాగోగులు కూడా తెలుసుకోరు. ఎన్నికల్లో తాము గెలిస్తే వైజాగ్ త రహాలో ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామని టీబీజీకేఎస్ నేతలు బీరాలు పలికారు. తీరా గెలిచిన తరువాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి మాత్రమే యాజమాన్యం ముందుకు వచ్చింది. దీనికి ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్మెస్లు అడ్డుపడ్డాయి. కార్మికుల నుంచి సగం డబ్బులు వసూలు చేసి ఇస్తే యాజమాన్యం సగం కలిపి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ వద్దని ఎక్స్‌గ్రేషియానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జాతీయ సంఘాలని చెప్పుకొనే సంఘాలు దీనిపై కోలిండియాలో ఎందుకు సాధించుకురావడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అధికారం సింగరేణికి ఉందని.. కాదు ప్రభుత్వమే ఆదేశించాలని.. కాదు ఇది దీనికి కోలిండియాలోనే ఒప్పందం చేసుకోవాలని ఒక సంఘంపై మరో సంఘం ఆరోపించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయి. ఎంత సేపు ఇతర సంఘాన్ని వైఫల్యం చెందించి వచ్చే ఎన్నికల నాటికి బలపడాలన్నదే అన్ని సంఘాల ఎత్తుగడ తప్ప ఐక్యంగా పోరాడి ఎక్స్‌గ్రేషియా సాధించాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఏది ఏమైన అటు యాజమాన్యం కార్మికుల ప్రాణాలకు రక్షణ ఇవ్వకపోవడం, ఇటు సంఘాలు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో నల్లసూర్యుల కుటుంబాలు చీకటి మయం అవుతున్నాయి.