శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5బి గనిలో ఓ కార్మికుడు హఠాన్మరణం పాలయ్యాడు. నస్పూర్ గ్రామానికి చెందిన గరిగే లింగయ్య (57) ఆర్కే 5బిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఉదయం వేళ మొదటి షిఫ్ట్ విధులకు హాజరయ్యాడు. గని భూగర్భంలోని 23 ఎల్‌ఎన్ 21 డిప్ 2ఏ సీం వద్ద జంక్షన్‌లో లైనింగ్ పనులు చేస్తున్నాడు. కీలకొట్టి చెక్క దాటుతుండగా అదే చెక్కలపై ఒక్కసారిగా కూలిపడ్డాడు. దీన్ని గమనించిన తోటి కార్మికులు ఊడె లింగయ్య (టింబర్‌మెన్), రాంటెంకి లింగయ్య (ట్రామర్) ఇతర కార్మికులను పిలిచి లింగయ్యను చూడగా అప్పటికే చనిపోయాడు.
సమాచారం తెలుసుకున్న గని మేనేజర్ త్రీనాథ్, సెక్షన్ ఇన్‌చార్జి సంతోష్‌కుమార్ గనిలోకి దిగారు. తదుపరి మృతదేహాన్ని ఉపరితలానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అన్ని యూనియన్ల నాయకులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, ఏరియా రక్షణాధికారి బి.శ్రీనివాస్, ఏజెంటు వెంకటేశ్వర్లు హుటాహుటిన అక్కడికి వచ్చారు. అధికారులు శవాన్ని తొందరగా అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో హెచ్‌ఎంఎస్, టీబీజీకేఎస్ మల్లయ్య వర్గం నేతలు అడ్డుకున్నారు.
కంపెనీ వైద్యుడు వచ్చి మరణధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి కార్మికులను పిలిచి ప్రత్యక్ష సాక్షులుగా వాంగ్మూలం తీసుకున్నారు. గనిలో పనిచేస్తూ పడి చనిపోయాడని అధికారులు రిపోర్టు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య యశోధ, కొడుకులు శేఖర్, సాగర్, కూతుళ్ల పద్మ, గంగ ఉన్నారు. ఈ విషయం తెలిసి గని వద్దకు చేరుకున్న వారు బోరున విలపించారు. సర్పంచ్ వేల్పుల రాజేశ్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం..
మృతుని కుటుంబానికి కంపెనీ నుంచి చెల్లించే నష్టపరిహారాలు త్వరగా ఇప్పిస్తామని, యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి డిపెండెంట్ ఉద్యోగం కూడా త్వరగా ఇప్పించేందుకు కృషి చేస్తామని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తెలిపారు. గనుల్లో కార్మికులు చనిపోకుండా అన్నిరకాల పగడ్బందీ చర్యలు తీసుకోవడానికి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు.
వారి వెంట కేంద్ర చర్చల ప్రతినిధి గోవర్ధన్, డివిజన్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, నాయకులు కె.సురేందర్‌రెడ్డి, నీలం సదయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. మృతిని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గనిలో పై కప్పు కూలి చనిపోతేనే గని ప్రమాదంగా భావించి రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తున్నారని.. అదే కార్మికుడు జారిపడ్డా, ఆలసట చెంది కింద పడి చనిపోయినా సహజ మరణం అంటూ గుండెపోటు అంటూ నష్టపరిహారం ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు.
అపస్మారక స్థితిలో గని లోపలి నుంచి కార్మికున్ని తీసుకువస్తే వారిని ఏరియా ఆస్పత్రికి తీసుకుపోవడానికి అంబులెన్సుల్లో కనీసం ఆక్సిజన్ వెంటిలేటరు ఉండటం లేదని, ప్రాథమిక చికిత్స చేయడానికి వైద్యుడు కూడా ఉండటం లేదని మండిపడ్డారు. టీబీజీకేఎస్ మల్లయ్య వర్గం నుంచి బంటు సారయ్య, కానుగంటి చంద్రయ్య, హెచ్‌ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేష్, నాయకులు అర్జున్, రాజేంద్రప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, ఐఎన్టీయూసీ డివిజన్ ఉపాధ్యక్షుడు డి.అన్నయ్య కార్యదర్శులు కాశీరావు, గంగయ్య, టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు మోతె రాఘవరెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
కార్మికుడి హఠాన్మరణం
Published Wed, Jul 23 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement