శ్రీరాంపూర్‌లో పర్సనల్ ఫైట్ సిట్టింగ్ ఎంపీ బెనర్జీపై మాజీ అల్లుడు కబీర్ పోటీ గట్టి పోటీ ఇస్తున్న సీపీఎం యువ అభ్యర్థి దీప్సిత పశి్చమబెంగాల్లోని శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు మాజీ మామా అల్లుళ్ల మధ్య పోరుగా మారాయి. టీఎంసీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై ఆయన మాజీ అల్లుడు కబీర్ శంకర్ బోస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మూడుసార్లు నెగ్గిన కళ్యాణ్ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంటే ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. శ్రీరాంపూర్ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా విలసిల్లింది. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ఎర్రజెండా ఎగరేసేందుకు యువ నాయకురాలు దీప్సితా ధర్‌ను సీపీఎం రంగంలోకి దింపింది...
హుగ్లీ నది.. శ్రీరాంపూర్ సంక్లిష్టమైన చరిత్రకు సాక్షి. ఇదే ఇక్కడి ఒండ్రుమట్టిని అన్నం గిన్నెగా మార్చింది. జనపనార, పత్తి, కాగితం పరిశ్రమల ఏర్పాటుతో స్థిరమైన పారిశ్రామికీకరణ జరిగింది. కానీ ఇప్పుడు హింద్ మోటార్స్ మూతబడింది. పత్తి మిల్లులు చరిత్ర పుటల్లోనే మిగిలాయి. జూట్, పేపర్ మిల్లులు లాక్‌డౌన్లను ఎదుర్కొంటున్నాయి.
ఒకప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక శక్తిగా వేలాది మంది వలసదారులకు ఉపాధి కలి్పంచిన ఈ నేల నుంచి ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఏడుసార్లు, టీఎంసీ, కాంగ్రెస్ నాలుగేసి సార్లు, సీపీఐ రెండుసార్లు చొప్పున శ్రీరాంపూర్‌ను గెలుచుకున్నాయి. దేశంలో బీజేపీ ఎన్నడూ గెలవని లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి.
బెనర్జీది దిగజారుడుతనం: బోస్..
కేవలం ఎన్నికల విజయం కోసం వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రజల ముందు పెట్టే స్థాయికి బెనర్జీ దిగజారిపోయారంటూ కబీర్ దుయ్యబడుతున్నారు. ఆయన సానుభూతి డ్రామా ఫలించదని, ప్రజలకు అంతా తెలుసని చెప్పుకొచ్చారు. ‘‘కేవలం బెనర్జీ వల్లే ఆయన కూతురితో నా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తను మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది.
అలాంటప్పుడు కూతురి గత జీవితాన్నే ఇలా ప్రచారానికి వాడుకోవడం చౌకబారుతనం’’ అంటూ మండిపడ్డారు. మాజీ మామకు గట్టి పోటీ ఇచ్చి తీరతానని కబీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్లో పరిస్థితి మారింది. మమత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పురోగతి, అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. సామాన్యులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెనర్జీ లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో నా చేతిలో ఓడటం ఖాయం. బీజేపీకి బెంగాల్లో 35 లోక్‌సభ స్థానాలకు పైగా వస్తాయి’’ అని బోస్ జోస్యం చెబుతున్నారు.
తక్షణావసరం ‘భారత్ బచావో’
సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ జేఎన్‌యూ విద్యారి్థ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రెడ్ వాలంటీర్‌గా బాగా పేరు సంపాదించారామె. సీఏఏ, ఎన్‌ఆర్సీ పేరుతో ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్లో ఫలించబోవని అంటున్నారు.
‘‘3 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ మాటలు బూటకమని తేలిపోయింది. ప్రజలు అన్నివిధాలా మోసపోయారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రత, యువతకు ఉద్యోగావకాశాలు, అవినీతిరహిత అభివృద్ధి సీపీఎంతోనే సాధ్యం’’ అంటూ దీప్సిత చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది.
ప్రజల విచక్షణపై నమ్మకముంది: బెనర్జీ
న్యాయశాస్త్ర పట్టభద్రుడైన కళ్యాణ్ బెనర్జీ సీఎం మమతకు నమ్మకస్తుడు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత శ్రీరాంపూర్ నుంచి మూడుసార్లు ఎంపీ అయ్యారు. తన కూతురిని వేధించి చివరికి విడాకులు తీసుకున్న వ్యక్తికి టికెటివ్వడం బీజేపీ కుత్సిత మనస్తత్వానికి నిదర్శనమని బెనర్జీ మండిపడ్డారు. బోస్‌కు తన మాజీ అల్లునిగా తప్ప మరో గుర్తింపే లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను మాట నిలుపుకునే వ్యక్తినని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. వాళ్లు ఈసారీ నన్నే గెలిపిస్తారు. శ్రీరాంపూర్ నుంచి అత్యధికసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు నాకు కట్టబెడతారు’’ అని అన్నారాయన.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment