
గుల్బర్గా నుంచి బరిలో అల్లుడు
ఆయన విజయం ఖర్గేకు ప్రతిష్టాత్మకం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్‌సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్‌కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు.
బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్ జాదవ్ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్ పూర్వాశ్రమంలో కాంగ్రెస్ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్‌లోని చించోలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment