శ్రీరాంపూర్ : సింగరేణిలో మొదటిసారి గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఇంకా ఆగడం లేదు. రెండేళ్ల కాలంలోనే అధికారం కోసం రెండు గ్రూపులుగా విడిపోయిన ఆ యూనియన్‌లో కోర్టు తీర్పు తరువాత అన్నీ చక్కబడ్డాయి అనుకున్న తరుణంలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది. రాజిరెడ్డి వర్గానికి సర్వాధికారాలు కట్టబెట్టుతూ జూన్ 12న హైకోర్టు తీర్పిచ్చింది. కానీ ఇప్పటికి నెల గడుస్తున్నా ఇంకా కమిటీల నిర్మాణం జరుగలేదు. దీంతో యాజమాన్యంతో కార్మిక సమస్యలపై జరుగాల్సిన స్ట్రక్చరల్ సమావేశాల జాడ లేకుండా పోయింది.
పదవుల కోసం పోటీ
ఒక పక్క కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మరో పక్క గెలిచిన వర్గం నేతలు వారి అనుచరులకు పదవులు ఇప్పించేందు పోటీ పడుతున్నారు. డివిజన్ ఉపాధ్యక్ష పదవులు, డివిజన్ 6మెన్ కమిటీల్లో తమ అనుచరులకు స్థానం కల్పించుకోవడం కోసం జరుగుతున్న పోటీ చివరికి నేతల మధ్య విభేదాల దారితీసింది. సింగరేణివ్యాప్తంగా 11 డివిజన్లలో రామగుండం, కొత్తగూడెం రీజియన్లలో డివిజన్ ఉపాధ్యక్షుల నియామకం దాదాపు పూర్తయింది. 6 మెన్ కమిటీలు ఇంకా పూర్తికాలేదు.
ఇక జిల్లాలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌లో కూడా అదే పరిస్థితి. బెల్లంపల్లి ఉపాధ్యక్షుడిగా సదాశివం, మందమర్రి ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి సంపత్‌ను ప్రకటించారు. శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడిగా పోశెట్టి పేరును అధ్యక్షుడు కనకరాజు ప్రకటించిన రెండు రోజులకే ఆ పేరు కాదని ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. దీనికి తోడు 6 మెన్ కమిటీల కూర్పు జరుగలేదు.
శ్రీరాంపూర్ ఉపాధ్యక్ష పదవి కోసం
శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా యూనియన్ అంతర్గత ఎన్నికల్లో రాజిరెడ్డి ప్యానల్ కోసం పనిచేసిన వారిలో ఎవరో ఒకరికి ఉపాధ్యక్ష పదవి దక్కుంతుందని ప్రచారం జరిగింది. ఈ డివిజన్‌లో మొదటి నుంచి పనిచేస్తున్న కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఏనుగు రవిందర్‌రెడ్డి కార్పొరేట్ చర్చల ప్రతినిధిగా వెళ్తున్నారు.
కోర్టు తీర్పు రాకముందు డివిజన్ ఉపాధ్యక్షులుగా పానుగంటి సత్తయ్య, పోశెట్టి, లెక్కల విజయ్, నెల్కి మల్లేశ్ వంటి పేర్లు వినిపించాయి. కానీ కోర్టు తీర్పు వచ్చిన తరువాత మల్లయ్య వర్గం నుంచి రాజిరెడ్డి వర్గంలోకి వలసలు పెరిగాయి. దీంతో గంద రగోళం మొదలైంది. బెల్లంపల్లి డివిజన్ గోలేటీలో పనిచేసిన ఎన్నం గోవర్ధన్ కొన్ని నెలల క్రితం జైపూర్ ఎస్టీపీపీకి బదిలీ అయ్యి శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. మిర్యాల రాజిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటం, మొదటి నుంచి ఆ వర్గంలో పనిచేయడంతో ఆయన్ను కూడా కార్పొరేట్ చర్చల ప్రతినిధిగా తీసుకున్నారు.
ఇక్కడ యూనియన్ వ్యవహారాలు మొదటి నుంచి నిర్వహిస్తున్న వస్తున్న ఏనుగు రవిందరెడ్డికి కొత్తగా వచ్చిన గోవర్ధన్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. రవిందర్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు యూనియన్‌లోని కొందరు గోవర్ధన్‌కు ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని తెరపైకి తెస్తున్నారని ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మల్లయ్య వర్గానికి చెందిన కె.సురేందర్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మల్లయ్య ఓడిపోయిన తరువాత ఆయన సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి అరవిందరెడ్డి గెలుపు కోసం పనిచేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల అరవిందరెడ్డికి అనుచరులుగా ఉన్న బండి రమేశ్ కూడా ఉపాధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఉన్న వీరు టీబీజీకేఎస్‌లో ఎలా పదవులు ఆశిస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రాజిరెడ్డి వర్గం గెలుపునకు కారణం అయిన తమను పక్కన ప్రత్యర్థి మల్లయ్య వర్గానికి చెందిన వారికి ఇందులో పదవులెలా ఇస్తారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. 6మెన్ కమిటీలో కూడా చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జరుగుతున్న పరిణామాలు మిర్యాల రాజిరెడ్డికి ఏనుగు రవిందర్‌రెడ్డి మధ్య సఖ్యతను దెబ్బతీశాయని తెలిసింది.
కార్మికుల్లో ఆందోళన
కోర్టు ఉత్తర్వులు రావడంతో హమ్మయ్యా.. ఇక పంచాయతీ తెగిందని, ఇక స్ట్రక్చరల్ సమావేశాలు జరిగి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురు చూసిన కార్మికులు జరుగుతున్న పరిణామాలు చూసి ఆందోళన చెందుతున్నారు. డిపెండెంట్ హక్కు, సమ్మె కాలం వేతనం, లాభాల్లో వాటా, గని ప్రమాదాల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా వంటి ఎన్నో అత్యవరం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి.
నెల రోజులుగా కాలం వెల్లదీస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు నేతలపై మండిపడుతున్నారు. కమిటీలు వేసుకోవడంలోనే ఇంత ఆపసోపాలు పడుతున్న వీరు రేపు పదవుల్లోకి వచ్చిన తరువాత ఏమాత్రం పని చేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరగా తమ సమస్యలు తీర్చాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఆగని అంతర్గత కుమ్ములాటలు
Published Thu, Jul 10 2014 2:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement