Raji reddy
-
అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు ఆదివారం సాయం త్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అశ్వత్థామరెడ్డి దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ తలుపులు గడియవేసి ఉండటంతో లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లు వచ్చారు. అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని కోరారు. మరోసారి రాజిరెడ్డి అరెస్టు జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం ఆయన రెడ్డి కాలనీలోని తన ఇంట్లో దీక్ష నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీఫ్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్లో కూడా దీక్ష కొనసాగించిన రాజిరెడ్డి ఇంటికి వచ్చి తిరిగి దీక్షలోనే ఉన్నారు. దీంతో ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు దీక్షను విరమించాలని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. తలుపు గడియ పెట్టి ఉండటంతో బలప్రయోగంతో రాజిరెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తోటి కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యాన్‌లో నినాదాలు చేసే క్రమంలో రాజిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. వీరిద్దరి అరెస్టులను ఖండిస్తూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద సంఘీభావ దీక్షలు కొనసాగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 68.32 శాతం బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 1,924 అద్దె బస్సులుసహా 6,114 బస్సులను తిప్పినట్టు వెల్లడించారు. 4,189 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,114 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని చెప్పారు. 5,864 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 174 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో ట్రే టికెట్లు జారీ చేశామన్నారు. ఉస్మానియాలో కొనసాగుతున్న దీక్ష నిన్నటి నుండి తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్న ఆశ్వత్థామరెడ్డిని వైద్య చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మెడికల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఆయనను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. బీపీ, షుగర్ ఉన్నందున వైద్యానికి సహకరించాలని వైద్యులు కోరుతున్నా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, యూరిన్‌లో కీటోన్స్ వచ్చాయని, అవి పెరిగితే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని డ్యూటీ డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. -
‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావును సోమవారం ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులుగా కూనంనేని సాంబశివరావు కార్మికులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోలీసులు సాంబశివరావును అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు చేపడుతుందని మండిపడ్డారు. నిన్న రాత్రి వరకు ఆయన దగ్గరే ఉన్నామని.. అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని రాజిరెడ్డి తెలిపారు. మెడికల్ టెస్టుల పేరిట కావాలనే రాత్రి 2 గంటల సమయంలో పోలీసులను పంపించి అరెస్టు చేయించారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు సైతం ప్రభుత్వం నిర్భంధంగా జరిపిందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కేసీఆర్‌కు భయం పట్టిందని, అందుకే అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. -
కట్నం చాలలేదని..కల్యాణం వద్దన్నాడు..!
వరుడి ఇంటి ఎదుట వధువు, బంధువుల ధర్నా కరీంనగర్ క్రైం: తమకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అని, రూ.10లక్షల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేశారు అమ్మారుు తల్లిదండ్రులు. మే 2న వివాహం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. పెళ్లి కుమారుడు ఈ వివాహం తనకు ఇష్టం లేదని వర్తమానం పంపించాడు. ఇదేంటని అడిగితే.. ఇంకా కట్నం కావాలని అతడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితురాలు తనకు కాబోయే భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి బైఠాయించింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన అప్పాల రాజిరెడ్డి రెండో కూతురు బీటెక్ చదివింది. ఆమెకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన అన్నమరాజు సందీప్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. సందీప్ తన కుటుంబంతో కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి నివాసం ఉంటున్నాడు. ఇతడు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో యూడీసీగా పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగం కావడంతో కట్నం కింద రూ.పది లక్షలు డిమాండ్ చేయగా అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. మార్చి 22న ఘనంగా ఎంగేజ్మెంట్ చేశారు. అదే రోజు వరకట్నం కింది రూ.5 లక్షలు, బంగారం కోసం మరో రూ.2లక్షల ముట్టచెప్పారు. మే 2న వివాహం జరిపించడానికి లగ్నపత్రిక రాసుకున్నారు. పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని సందీప్‌కుమార్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మధ్యవర్తుల ద్వారా ఆమె తల్లిదండ్రులకు సమాచారం పంపించాడు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి బంధువులను నిలదీయగా ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి తమకు ఇంకా కట్నం కావాలంటున్నారు. దీంతో అమ్మాయి, తల్లిదండ్రులు, బంధువులు మహిళా సంఘాల సహకారంతో బుధవారం సాయంత్రం సందీప్‌కుమార్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు రెండు కుటుంబాల వారిని ఠాణాకు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
రేషన్ సరుకులు పక్కదారి
సుల్తానాబాద్: మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీ, బస్టాండ్ సమీపంలో ఉన్న జాపతి రాజిరెడ్డి, బాకం సంపత్ ఇళ్లలో 75 క్వింటాళ్ల 80 కిలోల పీడీఎస్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నట్లు తహశీల్దార్ రజిత, డీటీసీఎస్ కాశీవిశ్వనాథం తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్ కొమురయ్యగౌడ్కు అప్పగించారు. వీరిపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో డీటీసీఎస్ ఎన్.మల్లికార్జున్‌రెడ్డి, హరికిరణ్, ఆర్ఐ సురేందర్ పాల్గొన్నారు. ఓదెల రైల్వేస్టేషన్లో ఏడు క్వింటాళ్ల బియ్యం.. ఓదెల : మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ఏడు క్వింటాళ్ల రేషన్‌బియ్యంను గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఇన్చార్జి తహశీల్దార్ తూము రవీందర్ పట్టుకున్నారు. రాత్రిసమయంలో కాజీపేట్ నుంచి బల్లార్షా వరకు నడిచే నాగపూర్ ప్యాసింజర్ ద్వారా రేషన్‌బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు తనిఖీ చేసి బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు బియ్యంను రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైన వదిలేసి పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంను పొత్కపల్లి రేషన్‌డీలర్ ఇస్మత్తారకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వోలు కనుకయ్య, సదయ్య, బషీర్, ఎల్లయ్య పాల్గొన్నారు. నీరుకుల్లలో రేషన్‌షాప్ సీజ్ సుల్తానాబాద్ : మండలంలోని నీరుకుల్ల డీలర్షాపు (నంబరు21)ను సీజ్ చేసినట్లు తహశీల్దార్ రజిత తెలిపారు. మండల కేంద్రంలో శనివారం పట్టుబడ్డ బియ్యంతో పాటు 14 కిలోల గోధుమలు నీరుకుల్ల గ్రామానికి చెందిన డీలర్ అంజయ్య తమకు అమ్మినట్లు పట్టుబడ్డ బాకం సంపత్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అధికారులు నీరుకుల్లకు వెళ్లి డీలర్షాను సీజ ్చేసినట్లు తెలిపారు. పీడీఎఫ్ సరుకులను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహించేది లేదని ఆమె హెచ్చరించారు. పైడిచింతలపల్లి డీలర్‌పై 6ఏ కేసు ధర్మారం : ధర్మారం మండలం పైడిచింతలపల్లి రేషన్ డీలర్ బీసగోని మల్లేశంపై శనివారం 6ఏ కేసు నమోదు చేసినట్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్ తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు.. డీటీసీఎస్ మల్లిఖార్జున్, వీఆర్వో ప్రసాద్ విచారణ చేపట్టారు. గత నెల పంపిణీ చేయాల్సిన నాలుగు వందల లీటర్ల కిరోసిన్‌ను అక్రమంగా నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమంగా నిల్వ చేసిన డీలర్ మల్లేశంపై 6ఏ కేసునమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ డిమాండ్.. ముఖ్యమంత్రిని కలసి నివేదించాలని తీర్మానం పీఆర్సీ, హెల్త్‌కార్డులపై పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశం హెల్త్‌కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని విమర్శ సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలవాలని తీర్మానించింది. పదో పీఆర్సీ, హెల్త్‌కార్డులు తదితరల అంశాలపై శుక్రవారం పీఆర్టీయూ భవన్లో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఇందులో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని, పీఆర్సీ అమల్లో జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. పీఆర్సీ అమలుకు, ఉద్యోగుల విభజనకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.7 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గతేడాది జూలై 1నుంచి ఆర్థిక లాభం వర్తింపజేయాలని సీఎంను ఇప్పటికే కోరినట్లు చెప్పారు. హెల్త్ కార్డుల అమలుపై కార్పొరేట్ ఆసుపత్రులతో సంప్రదింపుల బాధ్యతను ముఖ్యమంత్రి... డిప్యూటీ సీఎం రాజయ్యకు అప్పగించారని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుప్తా, ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజమహేందర్‌రెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రప్రకాశరావు, పీఆర్టీయూ(టీఎస్) ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం తీర్మానాలివే.. పీఆర్సీ అమలుకు జేఎసీ పక్షాన సీఎం కేసీఆర్‌ను కలవడం 63 శాతం ఫిట్మెంట్తో గత జూలై నుంచి ఆర్థిక లాభం కోరడం ప్రతి మూడేళ్ల సర్వీసుకు ఒక వెయిటేజీ ఇంక్రిమెంట్ వర్తింపు మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్ మంజూరు ఉద్యోగుల తల్లి లేదా తండ్రి మరణిస్తే 11 రోజుల ప్రత్యేక సెలవు హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు -
ఆగని అంతర్గత కుమ్ములాటలు
శ్రీరాంపూర్ : సింగరేణిలో మొదటిసారి గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఇంకా ఆగడం లేదు. రెండేళ్ల కాలంలోనే అధికారం కోసం రెండు గ్రూపులుగా విడిపోయిన ఆ యూనియన్‌లో కోర్టు తీర్పు తరువాత అన్నీ చక్కబడ్డాయి అనుకున్న తరుణంలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది. రాజిరెడ్డి వర్గానికి సర్వాధికారాలు కట్టబెట్టుతూ జూన్ 12న హైకోర్టు తీర్పిచ్చింది. కానీ ఇప్పటికి నెల గడుస్తున్నా ఇంకా కమిటీల నిర్మాణం జరుగలేదు. దీంతో యాజమాన్యంతో కార్మిక సమస్యలపై జరుగాల్సిన స్ట్రక్చరల్ సమావేశాల జాడ లేకుండా పోయింది. పదవుల కోసం పోటీ ఒక పక్క కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మరో పక్క గెలిచిన వర్గం నేతలు వారి అనుచరులకు పదవులు ఇప్పించేందు పోటీ పడుతున్నారు. డివిజన్ ఉపాధ్యక్ష పదవులు, డివిజన్ 6మెన్ కమిటీల్లో తమ అనుచరులకు స్థానం కల్పించుకోవడం కోసం జరుగుతున్న పోటీ చివరికి నేతల మధ్య విభేదాల దారితీసింది. సింగరేణివ్యాప్తంగా 11 డివిజన్లలో రామగుండం, కొత్తగూడెం రీజియన్లలో డివిజన్ ఉపాధ్యక్షుల నియామకం దాదాపు పూర్తయింది. 6 మెన్ కమిటీలు ఇంకా పూర్తికాలేదు. ఇక జిల్లాలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌లో కూడా అదే పరిస్థితి. బెల్లంపల్లి ఉపాధ్యక్షుడిగా సదాశివం, మందమర్రి ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి సంపత్‌ను ప్రకటించారు. శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడిగా పోశెట్టి పేరును అధ్యక్షుడు కనకరాజు ప్రకటించిన రెండు రోజులకే ఆ పేరు కాదని ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. దీనికి తోడు 6 మెన్ కమిటీల కూర్పు జరుగలేదు. శ్రీరాంపూర్ ఉపాధ్యక్ష పదవి కోసం శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా యూనియన్ అంతర్గత ఎన్నికల్లో రాజిరెడ్డి ప్యానల్ కోసం పనిచేసిన వారిలో ఎవరో ఒకరికి ఉపాధ్యక్ష పదవి దక్కుంతుందని ప్రచారం జరిగింది. ఈ డివిజన్లో మొదటి నుంచి పనిచేస్తున్న కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఏనుగు రవిందర్‌రెడ్డి కార్పొరేట్ చర్చల ప్రతినిధిగా వెళ్తున్నారు. కోర్టు తీర్పు రాకముందు డివిజన్ ఉపాధ్యక్షులుగా పానుగంటి సత్తయ్య, పోశెట్టి, లెక్కల విజయ్, నెల్కి మల్లేశ్ వంటి పేర్లు వినిపించాయి. కానీ కోర్టు తీర్పు వచ్చిన తరువాత మల్లయ్య వర్గం నుంచి రాజిరెడ్డి వర్గంలోకి వలసలు పెరిగాయి. దీంతో గంద రగోళం మొదలైంది. బెల్లంపల్లి డివిజన్ గోలేటీలో పనిచేసిన ఎన్నం గోవర్ధన్ కొన్ని నెలల క్రితం జైపూర్ ఎస్టీపీపీకి బదిలీ అయ్యి శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. మిర్యాల రాజిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటం, మొదటి నుంచి ఆ వర్గంలో పనిచేయడంతో ఆయన్ను కూడా కార్పొరేట్ చర్చల ప్రతినిధిగా తీసుకున్నారు. ఇక్కడ యూనియన్ వ్యవహారాలు మొదటి నుంచి నిర్వహిస్తున్న వస్తున్న ఏనుగు రవిందరెడ్డికి కొత్తగా వచ్చిన గోవర్ధన్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. రవిందర్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు యూనియన్‌లోని కొందరు గోవర్ధన్‌కు ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని తెరపైకి తెస్తున్నారని ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మల్లయ్య వర్గానికి చెందిన కె.సురేందర్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మల్లయ్య ఓడిపోయిన తరువాత ఆయన సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి అరవిందరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఇదిలా ఉంటే ఇటీవల అరవిందరెడ్డికి అనుచరులుగా ఉన్న బండి రమేశ్ కూడా ఉపాధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఉన్న వీరు టీబీజీకేఎస్‌లో ఎలా పదవులు ఆశిస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రాజిరెడ్డి వర్గం గెలుపునకు కారణం అయిన తమను పక్కన ప్రత్యర్థి మల్లయ్య వర్గానికి చెందిన వారికి ఇందులో పదవులెలా ఇస్తారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. 6మెన్ కమిటీలో కూడా చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జరుగుతున్న పరిణామాలు మిర్యాల రాజిరెడ్డికి ఏనుగు రవిందర్‌రెడ్డి మధ్య సఖ్యతను దెబ్బతీశాయని తెలిసింది. కార్మికుల్లో ఆందోళన కోర్టు ఉత్తర్వులు రావడంతో హమ్మయ్యా.. ఇక పంచాయతీ తెగిందని, ఇక స్ట్రక్చరల్ సమావేశాలు జరిగి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురు చూసిన కార్మికులు జరుగుతున్న పరిణామాలు చూసి ఆందోళన చెందుతున్నారు. డిపెండెంట్ హక్కు, సమ్మె కాలం వేతనం, లాభాల్లో వాటా, గని ప్రమాదాల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా వంటి ఎన్నో అత్యవరం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి. నెల రోజులుగా కాలం వెల్లదీస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు నేతలపై మండిపడుతున్నారు. కమిటీలు వేసుకోవడంలోనే ఇంత ఆపసోపాలు పడుతున్న వీరు రేపు పదవుల్లోకి వచ్చిన తరువాత ఏమాత్రం పని చేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరగా తమ సమస్యలు తీర్చాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
సీఅండ్ఎండీ కార్యాలయంలో డెరైక్టర్ల నిర్బంధం
శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్ , న్యూస్‌లైన్ : యూనియన్ల గొడవలో తలదూర్చి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రాజిరెడ్డి వర్గం నేత లు మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఆందోళనకు దిగారు. సీఅండ్ఎండీ కార్యాలయంలో డెర్టైక్టర్లను నిర్బంధించారు. డెరైక్టర్(పా) విజయ్‌కుమార్, డెరైక్టర్(ఆపరేషన్స్) బి.రమేశ్‌కుమార్, జీఎం(పర్సనల్) చంద్రమౌళిలను సీఅండ్ఎండీ రూంలో నిర్బంధించి ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ యూనియన్ అధ్యక్షుడు ఎ.కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి, నాయకులు మేడిపల్లి సంపత్, ఆగయ్య, సారంగపాణి, 11 డివిజన్ల నుంచి ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డెరైక్టర్(పా) ఇతర అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా గెలిచిన తమతో చర్చలు జరపకుండా ఓడిపోయిన వారితో చర్చలు జరపడానికి సిద్ధపడుతున్నారని దుయ్యబట్టారు. మల్లయ్య వర్గం నేతలపై పక్షపాతం వహిస్తున్నారని విమర్శించారు. గతంలో జాయింట్ మెమో ఇచ్చి 11 మందితో కూడిన అడ్‌హక్ కమిటీతో చర్చలు జరపాలని లెటర్ ఇచ్చినా కూడా చర్చలు జరపకుండా నాన్చివేత ధోరణి అవలంభించారని, ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్చలు జరపకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. వారికి అవసరం లేకున్నా యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే విధంగా వ్యవహరిస్తూ మల్లయ్య వర్గానికి కొమ్ము కాస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ రవిందర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు ఫోన్లో తెలిపారు. స్పందించిన యాజమాన్యం టీబీజీకేఎస్ ఆందోళనతో యాజమాన్యం స్పందించిందని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి తెలిపారు. ఆందోళన అనంతరం తమ యూనియన్ నేతలను ఇన్చార్జి సీఅండ్ఎండీ పిలిచి మాట్లాడారని పేర్కొన్నారు. ఇందులో డెరైక్టర్లు కూడా పాల్గొన్నారని వివరించారు. డివిజన్ స్థాయిలో జరపాలనుకున్న సమావేశాలను జరపరాదని నిర్ణయించారు. డివిజన్ స్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా కార్పోరేట్‌కు పంపిస్తే అక్కడ యాజమాన్యం వీటిని పరిష్కరించి ఓ నిర్ణయం తీసుకుంటుందని, దీంతో ఎప్పటికప్పుడు డివిజన్ సమస్యలపై కార్పొరేట్ అధికారులు దృష్టిసారించి పరిష్కరిస్తారని తెలిపారు. ఏ డివిజన్ కమిటీతో చర్చలు జరగడం లేదని పేర్కొన్నారు. -
ఆర్టీసీ నష్టానికి బాబే కారణం
వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీని అమ్మేస్తాడని అనుమానం వ్యక్తంచేశారు. శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు జనక్‌ప్రసాద్‌తో కలిసి రాజారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీని రక్షించేలా, ఉద్యోగ భద్రత ఉండేలా, వేతన సవరణతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని రాజారెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు జగన్ పక్షానే ఉంటారన్నారు. కార్మికులు జగన్ పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబుతో నిర్వీర్యమైపోయింది.. ఆర్టీసీని ఆరుజోన్లుగా విడదీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, అందువల్లే సంస్థ నష్టాల్లోకి వెళ్లిపోయిందని రాజారెడ్డి తెలిపారు. ఆర్టీసీలోకి ప్రైవేట్ వాహనాల్ని అనుమతించేలా జీవో జారీ చేశారని గుర్తుచేశారు. 24 రోజులు కార్మికులు సమ్మె చేస్తే కేవలం 9 శాతం జీతం పెంచారని, అయినా ప్రభుత్వ ఉద్యోగుల కంటే వెనకబడి ఉన్నారని గుర్తుచేశారు. 2001లో కార్మికుల సమ్మె కాలంలో ఆర్టీసీకి 50శాతం ప్రభుత్వ రాయితీని చెల్లిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. తన పదవీ కాలంలో ఒక్కపైసా కూడా చెల్లించలేదని, అందువల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వానికి అప్పట్లో 5శాతం ఆర్టీసీ పన్ను చెల్లిస్తుంటే చంద్రబాబు దానిని 15 శాతానికి తీసుకువెళ్లి పుట్టి ముంచేశారని గుర్తుచేశారు. 616 జీవో ద్వారా 20 వేల మ్యాక్సీ క్యాబ్‌లకు బాబు అనుమతిచ్చేందుకు ప్రయత్నం చేశారని, అది నిజమైతే ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి జీరో అయిపోయేదన్నారు. -
చివరిరోజు సందడే సందడి
సంగారెడ్డి డివిజన్/సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలకు గురువారం చివరిరోజు కావటంతో భారీ ఎ త్తున నామినేషన్లు వచ్చాయి. దీంతో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరించే సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభ్యర్థులు జెడ్పీ ప్రధాన గేటు వద్ద బారులు తీరారు. ఒక దశలో అభ్యర్థులు పోటెత్తడంతో గందరగోళం నెలకొంది. ఒకరినొకరు పరస్పరం తోపులాడుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చా రు. సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు తీసుకోవాల్సి ఉన్నా అప్పటికే క్యూ లో చాలామంది ఉండడంతో అధికారులు రాత్రి వరకు స్వీకరించారు. సరిగ్గా 5 గంటలకు ప్రధాన గేటు మూసివేసి లోపల ఉన్న వారి నుంచే నామినేషన్లు తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు.. పలువురు ప్రముఖులు చివరిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. నారాయణఖేడ్ జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున మహానంద షెట్కార్, శ్రీదేవి షెట్కార్, పెద్దశంకరంపేట నుంచి స్పందన నామినేషన్ వేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతాపాటిల్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ మేనకోడలు నాగరాణి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బీరయ్య యాదవ్, ఆయన సతీమణి సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసిన చైతన్యరెడ్డి పుల్కల్ నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో దిగారు. నారాయణఖేడ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు నగేష్ షెట్కార్ కూతురు వర్ష, జితేందర్ షెట్కార్ సతీమణి సంగీత నారాయణఖేడ్ స్థానానికి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. జిన్నారం నుంచి టీడీపీ నాయకుడు చంద్రారెడ్డి, తెలుగు యువత జిల్లా నాయకుడు శ్రీకాంత్‌గౌడ్ పటాన్చెరు నుంచి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి నామినేషన్ వేశారు. మనూ రు జెడ్పీటీసీగా 60 ఏళ్ల వృద్ధురాలు గంగమ్మ నామినేషన్ వేయగా దుబ్బాక నుంచి నిండు గర్భిణి పద్మజ స్వయంగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. సీపీఎం నుంచి 14 మంది ఒకేమారు వరుసగా నామినేషన్ వేశారు. తొగుటలో ఎంపీటీసీకి రెండు.. తొగుట: మండలంలో ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్ సీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డిపేట స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో నర్మెట లావణ్య, ఘనపురం ఎంపీటీసీ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో పుల్లగూర్ల రాజిరెడ్డిలు గురువారం వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్లు వేసినట్టు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. -
‘రాజిరెడ్డి' కే పట్టం
రాజిరెడ్డి ప్యానల్‌కు 4,582 ఓట్ల ఆధిక్యం టీబీజీకేఎస్ ఎన్నికల్లో ‘కెంగెర్ల’ ఓటమి హైకోర్టుకు ఫలితాల నివేదన గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో మిర్యాల రాజిరెడ్డి వర్గం ఘనవిజయం సాధించింది. గోదావరిఖనిలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం ఎన్నిక నిర్వహించగా.. 40,752 ఓట్లకు 24,532 ఓట్లు పోలయ్యాయి. అదేరాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వర కు ఓట్లు లెక్కించారు. రాజిరెడ్డి వర్గానికి 14,499 ఓట్లు, కెంగెర్ల మల్లయ్య వర్గానికి 9,917ఓట్లు లభిం చాయి. మరో 116ఓట్లు చెల్లకుండా పోయాయి. మొ త్తంగా మల్లయ్య ప్యానెల్‌పై రాజిరెడ్డి ప్యానెల్ 4,582 ఓట్ల మెజారిటీ సాధించింది. గెలుపొందిన ప్యానెల్లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు (కొత్తగూడెం), ఉపాధ్యక్షుడిగా ఏనుగు రవీందర్‌రెడ్డి (శ్రీరాంపూర్), ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి (ఆర్జీ-3), సంయుక్త కార్యదర్శిగా మేడిపల్లి సంపత్ (మందమర్రి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.ఆగయ్య (భూపాలపల్లి), కోశాధికారిగా కె.సారంగపాణి (భూపాలపల్లి) ఉన్నారు. లేబర్ కమిషనర్ (సెంట్రల్) రీజినల్ పీఎం శ్రీవాస్తవ ఓట్ల వివరాల పత్రాన్ని ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి, ఇతర ప్యానెల్ నాయకులకు అందించారు. ఫలితాలను హైకోర్టుకు నివేదిస్తానని, అక్కడినుంచే ఎన్నికైన వారి సమాచారం అధికారికంగా వస్తుందని తెలిపారు. కార్మికుల భారీ ర్యాలీ ఫలితాల ప్రకటన అనంతరం టీబీజీకేఎస్ శ్రేణులు, ఐఎన్టీయూ, ఏఐటీయూసీ, దళిత, ఇతర సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రంగులు చ ల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ.. ఆర్జీ-1 కమ్యూనిటీహాల్ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ మద్దతిచ్చినా ఓడిన ‘కెంగెర్ల’ టీబీజీకేఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కెంగెర్ల మల్లయ్య ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, నల్లాల ఓదెలు, ఎంపీ వివేక్ బహిరంగంగా ప్రకటించారు. అయినా కార్మికులు మల్లయ్య, ఆయన ప్యానెల్‌కు చెక్‌పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తరుణంలో టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఒకే యూనియన్‌లో ఓ వర్గానికి పార్టీ మద్దతిచ్చినా ఓడిన విషయమై పార్టీలో చర్చనీయాంశమైంది. దీని ప్రభావం త్వరలో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇది కార్మికుల విజయం తమ గెలుపు ముమ్మాటికీ కార్మికుల విజయమేనని టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో గెలిచిన యూనియన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. కార్మిక సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. సింగరేణిని రక్షించుకునేందుకు సికాస తరహాలో పనిచేస్తామన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలువనున్నట్లు వెల్లడించారు. -
గెలుపెవరిదో..?
గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులైన సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు తరలిరావడంతో గోదావరిఖనిలో రోజంతా సందడి నెలకొంది. టీబీజీకేఎస్‌లో తలెత్తిన నాయకత్వ వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ పీఎం శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్యానల్ టోపీ, లైటు గుర్తుపై, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ తట్టాచెమ్మస్ గుర్తుపై తలపడ్డాయి. సింగరేణి వ్యాప్తంగా సంఘ సభ్యులైన 40,752 మందికి ఓటుహక్కు ఉండగా, వీరిలో 24,532 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 60.19 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం రీజియన్‌లో అత్యధికంగా 74.4 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా కొత్తగూడెం రీజియన్‌లో 37.4 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లోని 26 బూత్‌లలో పోలింగ్ నిర్వహించారు. పలు కేంద్రాల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండి, బూత్‌ల సంఖ్య తక్కువగా ఉండడంతో రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు క్యూలైన్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సెయింట్‌పాల్ స్కూల్, గంగానగర్ సింగరేణి స్కూల్లో లైన్లో నిలుచున్న కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గోదావరిఖని డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మహేందర్‌జీ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. రెండు ప్యానళ్ల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. కార్మికుల ఓట్లను పొందేందుకు ఆయావర్గాలు మద్యం బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య వల్ల అంతర్గత ఎన్నికలు నిర్వహించడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సంఘం నాయకత్వ వివాదం హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎన్నికల ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. -
నవ ధాన్యాలు పండించాలి
నంద్యాల, న్యూస్‌లైన్: వ్యసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి పొలాల్లో నవ ధాన్యాలు పండించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ ఆఫ్ ఎక్సెటెన్షన్ దండు రాజిరెడ్డి రైతులకు సూచించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు లాభాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా ఒకే పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే మేలైన వంగడాలు ఉత్పత్తి చేసేందుకు, రైతుల కష్టాలను పరిష్కరించేందుకు నిత్యం ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మండలానికి ఒక వ్యవసాయ అధికారి ఉన్నారన్నారు. మరో రెండు నెలల్లో దాదాపు 10 వేల గ్రామాల్లో ప్రభుత్వం నెట్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని, అందులో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం లభిస్తుందన్నారు. రైతులు క్లబ్‌లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయ అధికారుల సలహాలు పొందాలన్నారు. జేడీఏ ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో శనగ దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శనగను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రైతుశ్రీ పథకం కింద రూ.లక్ష రుణంకు వడ్డీ లేదని, రూ.3లక్షల వరకు పావలా వడ్డీని వసూలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధన కేంద్రం ఏడీఆర్ పద్మలత మాట్లాడుతూ నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో పచ్చజొన్న, తెల్ల జొన్నలకు సంబంధించి కొత్త రకాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. పచ్చజొన్నలో 2446 రకం, తెల్లజొన్నలో 2647 రకంను ఇప్పటికే మినీకిట్లుగా ఇచ్చామన్నారు. మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగంతో దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. స్పందన అరకొర: కిసాన్ మేళాకు స్పందన అంతంత మాత్రమే లభించింది. ఉదయం 10గంటలకు ఆరంభం కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైంది. 17మండలాలకు సంబంధించి మేళను నిర్వహించినప్పటికీ ఒక్క మహిళా రైతు కూడా హాజరు కాకపోవడం గమనార్హం మేళాకు వ్యవసాయ అధికారులు,శాస్త్రవేత్తలు మాత్రమే హాజరయ్యారు. అనుబంధ శాఖలైన ఉద్యానవన, ఫిషరీష్, సిరికల్చర్, ఇరిగేషన్, తదితర అధికారులు డుమ్మా కొట్టారు. గతంలో జరిగిన కిసాన్ మేళాలో దాదాపు 40 ప్రదర్శనలు చేపట్టగా ప్రస్తుతం 17 మాత్రమే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించి 3, 4స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేయగా మిగిలినవన్ని ప్రైవేటు కంపెనీలకు సంబంధించినవి ఉన్నాయి.