‘రాజిరెడ్డి' కే పట్టం
రాజిరెడ్డి ప్యానల్‌కు 4,582 ఓట్ల ఆధిక్యం
టీబీజీకేఎస్ ఎన్నికల్లో ‘కెంగెర్ల’ ఓటమి
హైకోర్టుకు ఫలితాల నివేదన
గోదావరిఖని, న్యూస్‌లైన్ :
సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అంతర్గత ఆఫీస్ బేరర్ల ఎన్నికల్లో మిర్యాల రాజిరెడ్డి వర్గం ఘనవిజయం సాధించింది. గోదావరిఖనిలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం ఎన్నిక నిర్వహించగా.. 40,752 ఓట్లకు 24,532 ఓట్లు పోలయ్యాయి. అదేరాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వర కు ఓట్లు లెక్కించారు. రాజిరెడ్డి వర్గానికి 14,499 ఓట్లు, కెంగెర్ల మల్లయ్య వర్గానికి 9,917ఓట్లు లభిం చాయి. మరో 116ఓట్లు చెల్లకుండా పోయాయి. మొ త్తంగా మల్లయ్య ప్యానెల్‌పై రాజిరెడ్డి ప్యానెల్ 4,582 ఓట్ల మెజారిటీ సాధించింది. గెలుపొందిన ప్యానెల్‌లో అధ్యక్షుడిగా ఆకునూరి కనకరాజు (కొత్తగూడెం), ఉపాధ్యక్షుడిగా ఏనుగు రవీందర్‌రెడ్డి (శ్రీరాంపూర్), ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి (ఆర్జీ-3), సంయుక్త కార్యదర్శిగా మేడిపల్లి సంపత్ (మందమర్రి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.ఆగయ్య (భూపాలపల్లి), కోశాధికారిగా కె.సారంగపాణి (భూపాలపల్లి) ఉన్నారు. లేబర్ కమిషనర్ (సెంట్రల్) రీజినల్ పీఎం శ్రీవాస్తవ ఓట్ల వివరాల పత్రాన్ని ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి, ఇతర ప్యానెల్ నాయకులకు అందించారు. ఫలితాలను హైకోర్టుకు నివేదిస్తానని, అక్కడినుంచే ఎన్నికైన వారి సమాచారం అధికారికంగా వస్తుందని తెలిపారు.
కార్మికుల భారీ ర్యాలీ
ఫలితాల ప్రకటన అనంతరం టీబీజీకేఎస్ శ్రేణులు, ఐఎన్‌టీయూ, ఏఐటీయూసీ, దళిత, ఇతర సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రంగులు చ ల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ.. ఆర్జీ-1 కమ్యూనిటీహాల్ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని యూనియన్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
టీఆర్‌ఎస్ మద్దతిచ్చినా ఓడిన ‘కెంగెర్ల’
టీబీజీకేఎస్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కెంగెర్ల మల్లయ్య ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, నల్లాల ఓదెలు, ఎంపీ వివేక్ బహిరంగంగా ప్రకటించారు. అయినా కార్మికులు మల్లయ్య, ఆయన ప్యానెల్‌కు చెక్‌పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తరుణంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఒకే యూనియన్‌లో ఓ వర్గానికి పార్టీ మద్దతిచ్చినా ఓడిన విషయమై పార్టీలో చర్చనీయాంశమైంది. దీని ప్రభావం త్వరలో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.
ఇది కార్మికుల విజయం
తమ గెలుపు ముమ్మాటికీ కార్మికుల విజయమేనని టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో గెలిచిన యూనియన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. కార్మిక సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. సింగరేణిని రక్షించుకునేందుకు సికాస తరహాలో పనిచేస్తామన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలువనున్నట్లు వెల్లడించారు.