అశ్వత్థామరెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు ఆదివారం సాయం త్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అశ్వత్థామరెడ్డి దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ తలుపులు గడియవేసి ఉండటంతో లోనికి వెళ్లలేకపోయారు.
దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లు వచ్చారు. అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని కోరారు.
మరోసారి రాజిరెడ్డి అరెస్టు
జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం ఆయన రెడ్డి కాలనీలోని తన ఇంట్లో దీక్ష నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీఫ్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్‌లో కూడా దీక్ష కొనసాగించిన రాజిరెడ్డి ఇంటికి వచ్చి తిరిగి దీక్షలోనే ఉన్నారు. దీంతో ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు దీక్షను విరమించాలని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. తలుపు గడియ పెట్టి ఉండటంతో బలప్రయోగంతో రాజిరెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తోటి కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యాన్‌లో నినాదాలు చేసే క్రమంలో రాజిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. వీరిద్దరి అరెస్టులను ఖండిస్తూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద సంఘీభావ దీక్షలు కొనసాగించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 68.32 శాతం బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 1,924 అద్దె బస్సులుసహా 6,114 బస్సులను తిప్పినట్టు వెల్లడించారు. 4,189 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,114 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని చెప్పారు. 5,864 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 174 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో ట్రే టికెట్లు జారీ చేశామన్నారు.
ఉస్మానియాలో కొనసాగుతున్న దీక్ష
నిన్నటి నుండి తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్న ఆశ్వత్థామరెడ్డిని వైద్య చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మెడికల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో ఆయనను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. బీపీ, షుగర్ ఉన్నందున వైద్యానికి సహకరించాలని వైద్యులు కోరుతున్నా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, యూరిన్‌లో కీటోన్స్ వచ్చాయని, అవి పెరిగితే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని డ్యూటీ డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment