
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్‌ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించారు. 52 రోజుల పాటు సమ్మె పేరుతో కార్మికుల జీవితాలతో చేలగాటమాడాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అశ్వత్థామరెడ్డి నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన రవినాయక్.. సోమవారం సాయంత్రం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నామని, మంగళవారం ఉదయం నుంచి ఉద్యోగులందరూ విధుల్లో పాల్గొనాలని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. దీంతో ఉదయం 6.00 నుంచే అన్ని డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment