గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని సంఘ సభ్యులైన సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు తరలిరావడంతో గోదావరిఖనిలో రోజంతా సందడి నెలకొంది.
టీబీజీకేఎస్‌లో తలెత్తిన నాయకత్వ వివాదంపై హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ రీజినల్ లేబర్ కమిషనర్ పీఎం శ్రీవాస్తవ నేతృత్వంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్యానల్ టోపీ, లైటు గుర్తుపై, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్యానెల్ తట్టాచెమ్మస్ గుర్తుపై తలపడ్డాయి. సింగరేణి వ్యాప్తంగా సంఘ సభ్యులైన 40,752 మందికి ఓటుహక్కు ఉండగా, వీరిలో 24,532 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 60.19 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండం రీజియన్‌లో అత్యధికంగా 74.4 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా కొత్తగూడెం రీజియన్‌లో 37.4 శాతం పోలింగ్ నమోదైంది.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదు కేంద్రాల్లోని 26 బూత్‌లలో పోలింగ్ నిర్వహించారు. పలు కేంద్రాల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండి, బూత్‌ల సంఖ్య తక్కువగా ఉండడంతో రాత్రి ఏడు గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 గంటలకు వచ్చినవారు క్యూలైన్‌లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సెయింట్‌పాల్ స్కూల్, గంగానగర్ సింగరేణి స్కూల్‌లో లైన్‌లో నిలుచున్న కార్మికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఒకరినొకరు నెట్టుకోవడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. గోదావరిఖని డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మహేందర్‌జీ ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. రెండు ప్యానళ్ల మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. కార్మికుల ఓట్లను పొందేందుకు ఆయావర్గాలు మద్యం బాటిళ్లు పంపిణీ చేసినట్టు తెలిసింది. గుర్తింపు కార్మిక సంఘంలో నాయకత్వ సమస్య వల్ల అంతర్గత ఎన్నికలు నిర్వహించడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. సంఘం నాయకత్వ వివాదం హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎన్నికల ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు.
గెలుపెవరిదో..?
Published Mon, Feb 24 2014 3:35 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement