పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
- ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ డిమాండ్.. ముఖ్యమంత్రిని కలసి నివేదించాలని తీర్మానం
- పీఆర్సీ, హెల్త్‌కార్డులపై పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశం
- హెల్త్‌కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని విమర్శ
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) సిఫార్సులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలవాలని తీర్మానించింది. పదో పీఆర్సీ, హెల్త్‌కార్డులు తదితరల అంశాలపై శుక్రవారం పీఆర్టీయూ భవన్లో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది.
ఇందులో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులు జేబులో పెట్టుకునేందుకే పరిమితమయ్యాయని, పీఆర్సీ అమల్లో జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ.. పీఆర్సీ అమలుకు, ఉద్యోగుల విభజనకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.7 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
గతేడాది జూలై 1నుంచి ఆర్థిక లాభం వర్తింపజేయాలని సీఎంను ఇప్పటికే కోరినట్లు చెప్పారు. హెల్త్ కార్డుల అమలుపై కార్పొరేట్ ఆసుపత్రులతో సంప్రదింపుల బాధ్యతను ముఖ్యమంత్రి... డిప్యూటీ సీఎం రాజయ్యకు అప్పగించారని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గుప్తా, ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజమహేందర్‌రెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రప్రకాశరావు, పీఆర్‌టీయూ(టీఎస్) ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం తీర్మానాలివే..
పీఆర్సీ అమలుకు జేఎసీ పక్షాన సీఎం కేసీఆర్‌ను కలవడం
63 శాతం ఫిట్‌మెంట్‌తో గత జూలై నుంచి ఆర్థిక లాభం కోరడం
ప్రతి మూడేళ్ల సర్వీసుకు ఒక వెయిటేజీ ఇంక్రిమెంట్ వర్తింపు
మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్ మంజూరు
ఉద్యోగుల తల్లి లేదా తండ్రి మరణిస్తే 11 రోజుల ప్రత్యేక సెలవు
హెల్త్‌కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చర్యలు