►రాజ్యాంగ విరుద్ధంగా జీవోల జారీ
►రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
విజయవాడ : రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు జారీ చేస్తోందని పలువురు వక్తలు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాజధాని భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అవసరం లేకపోయినప్పటికీ రైతులనుంచి వేల ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకుంటున్నారన్నారు.
రాజ్యాంగ విరుద్దంగా జీవోలు జారీ చేసి రైతులను మోసగిస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.39లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీచేయకుండా నిరంతరం రాజధాని చుట్టూ పాలకులు చక్కర్లు కొడుతున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 109, 110 ,166.జీవోలతో ప్రభుత్వ మోసం బయటపడిందన్నారు, సీపీడిఎంసీ పేరుతో కంపెనీ పాలనకు తెరధీశారని మండిపడ్డారు.
కంపెనీ పేరును తర్వాత కార్పొరేషన్‌గా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు. రైతులు తమకు అంగీకారం ఉంటేనే భూముఇలివ్వండని నమ్మబలుకుతూ మరో వైపు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కార్పొరేషన్ పాలన అమల్లోకి వస్తే ప్రతి పనికి పన్ను వసూలు చేస్తారన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములు సమీకరించి కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారన్నారు.
తులసీదాసు మాట్లాడుతూ క్రెడా చట్టం ప్రకారం భూములు సేకరించి కార్పొరేషన్‌కు అప్పగించడం ద్వారా ప్రభుత్వం పూర్తి ప్రజావ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ నాయకుల పోలారి, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి జె.వి.రాఘవులు, రాజధాని ప్రాంత కన్వీనర్ రాధాకృష్ణ, సీపీఐ నాయకులు, వై కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలన్నారు.
ప్రభుత్వం తీసుకున్న భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తే రానున్న కాలంలో భూములిచ్చిన రైతులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తోందన్నారు. అంతా కలిసి ప్రభుత్వా నిర్ణయాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎం విజయ్‌కుమార్, గంగాధరరావు, శ్రీనివాస్, జి వీరాంజనేయులు, మల్నిడి ఎలమందరావు తదితరులు పాల్గొన్నారు.
రాజధాని రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం
Published Fri, May 22 2015 2:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement