సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావును సోమవారం ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులుగా కూనంనేని సాంబశివరావు కార్మికులకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోలీసులు సాంబశివరావును అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు చేపడుతుందని మండిపడ్డారు. నిన్న రాత్రి వరకు ఆయన దగ్గరే ఉన్నామని.. అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని రాజిరెడ్డి తెలిపారు.
మెడికల్ టెస్టుల పేరిట కావాలనే రాత్రి 2 గంటల సమయంలో పోలీసులను పంపించి అరెస్టు చేయించారని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు సైతం ప్రభుత్వం నిర్భంధంగా జరిపిందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కేసీఆర్‌కు భయం పట్టిందని, అందుకే అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment