సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగా లిచ్చి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎంకు తొలి లేఖ రాశారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హులైనవారు తెలంగాణలో దాదాపు 1,500 మంది ఉన్నారని పేర్కొన్నారు.
అప్పటి డీఎస్సీలో నష్టపోయిన వీరందరూ 24 ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారని తెలిపారు. 2016 జనవరి 3న వారికి మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసు కింద పరిగణించి వీరిని తీసుకుంటామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేసీఆర్‌ను కోరారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి వారిని ఆదుకొనే దిశగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆ ప్రకారం తెలంగాణలోనూ సానుకూలంగా స్పందించి త్వరలో నియామక ప్రక్రియ చేపట్టి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కూనంనేని సీఎంను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment