సాక్షి, నాగర్‌కర్నూల్: పాడిపశువులతో పాటు పాల ఉత్పత్తులు పెంచడానికి పశుసంవర్ధక శాఖ తగు చర్యలు చేపట్టింది. వాటిని నమ్ముకున్న రైతులకు ఆదాయం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 500 గ్రామాల్లో క్రిషి కల్యాణ్ అభియాన్ అమలు చేయాలని నిర్ణయించారు. పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేపట్టి పశు సంతానోత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పశు సంతానోత్పత్తి ఆశించినంతగా లేదు.
మగ పశువులు అందుబాటులో లేకపోవడం, ఉన్న వాటిలో మంచి బీడ్ర్ కాకపోవడం, పశువులు ఎదకు వచ్చినప్పుడు రైతులు గుర్తు పట్టకపోవడం తదితర కారణాల వల్ల సహజ సిద్ధ విధానంలో పశు సంతానోత్పత్తి ఆశించినస్థాయిలో జరగడం లేదని పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఫలితంగా పాల దిగుబడీ పెరగడం లేదు. దీనిని అధిగమిచేందుకు గాను గేదెలు, ఆవుల్లో కృత్రిక గర్భధారణను చేపట్టేందుకు కేంద్రం, పశు సంవర్ధకశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అమలు చేయనున్న గ్రామాలను గుర్తించారు. దీనిపై ఈపాటికే వెటర్నరీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ప్రతి గ్రామంలో 200 పాడి పశువులకు..
ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన 200 పాడి పశువులను గుర్తిస్తారు. వీటికి ఆవులు, ముర్రా గేదెలకు ఐఎన్‌ఏపీహెచ్ టాగింగ్ వేసి ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు వేయనున్నారు. దీనిని అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో వంద గ్రామాలను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఇలా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తం 500 గ్రామాల్లో జిల్లాకు 20వేల పశువుల చొప్పున పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా ఈ నెలాఖరు నుంచి 2020 మార్చి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పశువులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ నిమిత్తం టెక్నీషియన్‌కు రూ.50, దూడపుట్టిన తర్వాత మరో రూ.వంద చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. వారు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి ఉచితంగా పశువులకు ఎద సూది ఇవ్వనున్నారు. అలాగే వాటిలో రోగ నిరోధకశక్తి పెంపొందించడానికి మందులు వేస్తారు. వచ్చే ఆరు నెలల్లోనే కృత్రిమ గర్భధారణను 40శాతానికి పెంచాలని పశు సంవర్ధకశాఖ భావిస్తోంది.
రైతుల వద్ద ఉన్న ఆవులు, గేదెలకు మేలు జాతికి చెందిన పశువుల వీర్యాన్ని మాత్రమే ఎక్కిస్తారు. గేదెలకు ముర్రజాతి, ఆవులకు జెర్సీ, హెచ్‌ఎఫ్, ఒంగోలు, సాయివాల్, గిర్ తదితర జాతులకు చెందిన పశువుల వీర్యాన్ని వినియోగిస్తారు. తమ వద్ద ఉన్న పశువులకు ఏ జాతి వీర్యం కావాలన్నది రైతులు నిర్ణయించుకోవచ్చు. ఈ సమయంలో పశు సంవర్ధకశాఖ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు.
వృద్ధి చెందనున్న పాడిరంగం
ఉమ్మడి జిల్లాలో గోజాతి, గేదె జాతి పశువులు కలిపి మొత్తం 6,76,072 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాలిచ్చే వాటినే అంచనా వేస్తే వీటి ద్వారా నిత్యం సుమారు ఐదు లక్షల లీటర్ల పాల దిగుబడి ఉంది. ఈ ఏడాది ఆఖరులోగా 20వేల పశువులకు కృత్రిమ గర్భధారణ విధానాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న పాల దిగుబడి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పశుసంతానోత్పత్తితో పాటు పాల ఉత్పత్తి పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.
పాడి రైతులకు ఎంతోమేలు
క్రిషి కల్యాణ్ అభియాన్‌తో పాడి రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. జిల్లాలో ఇప్పటికే వంద గ్రామాలను గుర్తించాం. ఒక్కో గ్రామంలో 200పశువులకు గర్భధారణ సూదులు ఇప్పిస్తాం. దీనిని గోపాలమిత్రలు, వెటర్నరీ సిబ్బంది ద్వారా అమలు చేస్తాం. ఇప్పటికే వారి శిక్షణ ఇచ్చాం.
– అంజిలప్ప, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment