జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటు
– పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్
బనగానపల్లె రూరల్: జిల్లాలో వెయ్యి మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని పాతపాడు గ్రామంలో డ్వాక్రా మహిళతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలదిగుబడిని పెంచేందుకు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు డీఆర్‌డీఏ, పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో మినీ డెయిరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్క మహిళా రైతుకు ఐదు గేదెల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద పశువుల హాస్టల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గేదెల కొనుగోలుకు ఆసక్తి ఉన్న మహిళలు 25 శాతం వాటా చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. మాదసుపల్లె, పాతపాడు గ్రామాల్లో పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను వారు పరిశీలించారు. డీఆర్‌డీఏ ఏపీవో డాక్టర్ అచ్చన్న, తహసీల్దార్ అనురాధ, ఈవోఆర్‌డీ నాగేశ్వరరెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీను, గ్రామ సర్పంచ్ పాపారాయుడు తదితర వెలుగు సీసీలు పాల్గొన్నారు.