కెరీర్ రైట్... వెటర్నరీ సైన్స్ | Veterinary Science course to develop career | Sakshi
Sakshi News home page

కెరీర్ రైట్... వెటర్నరీ సైన్స్

Published Thu, Oct 9 2014 2:52 AM | Last Updated on Sat, Jun 2 2018 8:44 PM

కెరీర్ రైట్... వెటర్నరీ సైన్స్ - Sakshi

కెరీర్ రైట్... వెటర్నరీ సైన్స్

భారత్ పూర్వకాలం నుంచీ ప్రధానంగా  పశుపోషణపై ఆధారపడిన దేశం.  పారిశ్రామికంగా పురోగమిస్తున్నప్పటికీ..  నేటికీ గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజల  జీవనాధారం పశుపోషణే! పాల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే  పశుపక్ష్యాదులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసే నిపుణులకు ప్రాధాన్యత పెరుగుతోంది. పశువైద్యం, చికిత్సలో నిష్ణాతులను తయారు చేసే కోర్సే..  బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్  యానిమల్ హస్బెండ్రీ. నగర శివార్లలో పశువుల పెంపకం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెటర్నరీ సైన్స్ కోర్సులను అందించే సంస్థలు..  అర్హతలు, ఎంపిక, కెరీర్‌పై ఫోకస్..
 
 గ్రామాల ఆర్థిక పరిపుష్టిలో పశువులదే ప్రధాన పాత్ర. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు ఉండాల్సిందే. ఇటీవల కుందేళ్లు, గిన్నెకోళ్లు, నిప్పుకోళ్ల  పెంపకంపట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇక సిటీలో చూస్తే మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలు తమ స్థాయికి తగినట్లుగా దేశీయ, విదేశీ శునకాలను పెంచుకుంటున్నారు. వాటిని తమ ప్రాణ సమానంగా భావిస్తున్నారు. మరికొంతమంది పక్షి ప్రేమికులు.. చిలుకలు, పావురాలు, నెమళ్లు, పిచ్చుకలను కూడా మచ్చిక చేసుకుంటున్నారు. వాటికి చిన్న బాధ కలిగినా విలవిల్లాడిపోతున్నారు. వాటికి వైద్యం అందించే పశువైద్య నిపుణుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వెటర్నరీ సైన్స్.. ఏ కోర్సులకూ తీసిపోని ఎవర్‌గ్రీన్ కెరీర్‌గా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఐదు కళాశాలల్లో మాత్రమే వెటర్నరీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు కోకొల్లలు.
 
 కోర్సులు.. అర్హతలు
 వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా స్థాయిలో యానిమల్ హస్బెండ్రీ కోర్సు ఉంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం పది కళాశాలల్లో 205 సీట్లున్నాయి. పదో తరగతిలో నిర్దేశిత గ్రేడ్‌పాయింట్‌తో ఉత్తీర్ణత సాధించినవారు ఈ కోర్సుకు అర్హులు. కోర్సు వ్యవధి రెండేళ్లు. బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్), మాస్టర్స్ డిగ్రీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ), డాక్టోరల్ స్థాయిలో పీహెచ్‌డీ కోర్సులున్నాయి. ఇందులో బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌కు అర్హత.. 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి ఐదేళ్లు.
 
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో హైదరాబాద్(రాజేంద్రనగర్), తిరుపతి, కోరుట్ల(కరీంనగర్ జిల్లా), గన్నవరం(కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా)లో వెటర్నరీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సీట్ల సంఖ్య 240. ఎంసెట్(మెడికల్) ద్వారా ప్రవేశం ఉంటుంది. ఎంసెట్ ప్రకటన ప్రతిఏటా మార్చి/ఏప్రిల్‌లో వెలువడుతుంది. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో 18 అంశాల్లో బోధన ఉంటుంది. ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియూలజీ, గైనకాలజీ, జెనెటిక్స్ తదితర అంశాలను చదవాలి. ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కేవలం జంతు సంరక్షణపైనే కాకుండా.. పౌల్ట్రీ, బ్రీడ్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లోనూ విద్యార్థులకు శిక్షణనిస్తారు.
 
 పీజీ, పీహెచ్‌డీలో స్పెషలైజేషన్లు ఎన్నో..
 బీవీఎస్సీ అండ్ ఏహెచ్ పూర్తయ్యాక చేసే మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ)లో ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. వెటర్నరీ అనాటమీ అండ్ హిస్టాలజీ; యానిమల్ రిప్రొడక్షన్, గైనకాలజీ అండ్ ఆబెస్టెట్రిక్స్, క్లినికల్ వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ పారాసిటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, వెటర్నరీ ఎపిడిమియాలజీ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండ్రీ ఎక్స్‌టెన్షన్, వెటర్నరీ బయోటెక్నాలజీ. పీహెచ్‌డీలో కూడా ఈ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
 
 కావాల్సిన స్కిల్స్:
 మూగజీవాల పట్ల జాలి, దయ ఉండాలి.
 వివిధ సీజన్ లకనుగుణంగా వాటికొచ్చే వ్యాధులపై అవగాహన అవసరం
 ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న పశు చికిత్సలు, వ్యాధినివారణ మందుల గురించి తెలుసుకోవాలి.  
గ్రామీణ ప్రాంతాల్లో కూడా పనిచేయాలి.
 
 అవకాశాలు:  వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్నవారికి క్లినికల్ విభాగంతో పాటు పరిశోధన, ఫార్మాస్యూటికల్ తదితర రంగాల్లో అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు.  పశు సంవర్థక శాఖలో, ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బర్డ్స్ శాంక్చురీస్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించవచ్చు. జంతు సంరక్షణకు ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి.
 
 వేతనాలు: ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ.45 వేల వేతనం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు. ఇక సొంతంగా ఆస్పత్రి పెట్టుకుంటే మరింత ఆదాయం గడించొచ్చు. ఖాళీ సమయాల్లో ఆయా గ్రామాల్లో పర్యటించడం ద్వారా ఎక్కువ మొత్తం ఆర్జించొచ్చు. శాస్త్రవేత్తలకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయి. బోధన రంగంలో ఉన్నవారు నెలకు రూ.20,000 నుంచి రూ.40,000 వరకు పొందొచ్చు.
 
 జాతీయస్థాయిలో ప్రముఖ పరీక్షలు
 ఆల్ ఇండియా ప్రీ వెటర్నరీ టెస్ట్ (ఏఐపీవీటీ):
 దేశవ్యాప్తంగా వివిధ వెటర్నరీ కళాశాలల్లో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ప్రవేశాలకు ఏఐపీవీటీ నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా కళాశాలల్లో 15శాతం సీట్లను భర్తీ చేస్తారు. 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు.  ఈ ర్యాంకు ద్వారా తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ - చెన్నై, పాండిచ్చేరి యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ - ఇంఫాల్, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ - రాయ్‌పూర్, జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ - జబల్‌పూర్, కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీ సెన్సైస్ యూనివర్సిటీ - బీదర్, అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థల్లో చేరొచ్చు. ఈ పరీక్షకు ప్రతి ఏటా జనవరి/ఫిబ్రవరిలో ప్రకటన విడుదలవుతుంది.
 
 జేఎన్‌యూ కంబైన్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్:
 ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు ప్రతి ఏటా ఆల్ ఇండియా కంబైన్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ - హిస్సార్, జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ - పంత్‌నగర్, నానాజీ దేశ్‌ముఖ్ పశు చికిత్స విజ్ఞాన్ విశ్వవిద్యాలయ - జబల్‌పూర్, గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ - లూధియానా, మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సెన్సైస్ యూనివర్సిటీ - నాగ్‌పూర్, అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీ వంటివాటిలో ఎంవీఎస్సీ కోర్సులో చేరొచ్చు. నిర్దేశిత మార్కులతో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సు ఉత్తీర్ణులు ఈ ప్రవేశపరీక్షకు అర్హులు. ఈ పరీక్షకు ప్రతి ఏటా ఫిబ్రవరి/మార్చిలో ప్రకటన వెలువడుతుంది.
 
 పశువైద్య రంగంలో అవకాశాలెన్నో...
 ‘‘మారుతున్న అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకుంటే కెరీర్‌లో వెంటనే స్థిరపడొచ్చు. పశు వైద్యం అనేది భిన్నమైన కోర్‌‌స. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే అవకాశాలకు కొదవలేదు. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా, పశుై వెద్యశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కొలువులున్నాయి. పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి బోలెడు అవకాశాలున్నాయి. సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేయొచ్చు’’
 -డాక్టర్ జి.త్రివేణి, పీఆర్‌ఓ ఇన్‌ఛార్జి, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement