ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Animal Husbandry Department Today | Sakshi
Sakshi News home page

ఆ పోస్టులు వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్

Published Mon, Mar 22 2021 6:56 PM | Last Updated on Mon, Mar 22 2021 7:49 PM

CM YS Jagan Review Meeting On Animal Husbandry Department Today - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అదే విధంగా, వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశు సంవవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సీఎం జగన్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్బీకేల్లో కియోస్క్‌ ద్వారా పశు దాణా, మందులు కూడా ఇవ్వండి. సీడ్, ఫీడ్, మెడికేషన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

నాసిరకం వాడకూడదు, కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి’’అని మార్గనిర్దేశనం చేశారు. ఇందుకు స్పందనగా.. ఫీడ్, సీడ్‌ కియోస్క్‌ ద్వారా ఇప్పటికే మందులు సరఫరా చేస్తున్నామని అధికారులు సమాధానమిచ్చారు.ఈ క్రమంలో.. ‘‘రైతులకు ఏది అవసరమో తెలియజెప్పండి, అవే తిరిగి వాళ్లకు అందించే ప్రయత్నం జరగాలి. నకిలీలకు అడ్డుకట్ట వేయాలి. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పశువులకు ఇనాఫ్‌ ట్యాగ్‌ చేయించాలి. వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం ఆర్బీకేల్లో డిస్‌ప్లే చేయాలి’’ అని సీఎం జగన్‌ సూచించారు. అదే విధంగా, ప్రతి మూడు నెలలకొకసారి బీమా పరిహారం క్లెయిమ్స్‌ క్లియర్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఇందుకు సంబంధించి, రూ.98 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో, సీఎంఓ అధికారులు కూడా దీనిపై కలెక్టర్లతో సమన్వయం చేసుకుని, వారికి స్పష్టమైన  సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ఇక సమీక్ష సందర్భంగా, ఆర్బీకేల్లోని ఇంటిగ్రేడెట్‌ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 155251 పనిచేస్తుందా లేదా ? అని సీఎం జగన్‌ అధికారులను ప్రశ్నించారు. ఈ నంబరు పనితీరుపై క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. ‘‘గ్యారంటీ, టెస్టెడ్, క్వాలిటీ అని ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నాం. వీటి నాణ్యతలో ఎలాంటి తేడా రావడానికి వీల్లేదు. ఆర్బీకేల ద్వారా ఇచ్చే ఇన్‌పుట్స్‌లో నాణ్యత లేకపోతే కచ్చితంగా అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.

ఏహెచ్‌ఏ ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్
6099 ఏనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్‌ (ఏహెచ్‌ఏ) ఖాళీల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇక సమీక్ష సందర్భంగా, పశుసంరక్షక్‌ యాప్‌ పనితీరుని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యానిమల్‌ ఫీడ్‌ యాక్ట్‌ రావడంతో క్వాలిటీ సీడ్‌ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో.. ‘‘బయో ఫెస్టిసైడ్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. నాణ్యత విషయంలో రాజీపడొద్దు’’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక వైఎస్సార్‌ చేయూత కింద జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా పశువులు, గొర్రెలు, మేకల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని మరింత విస్తతంగా చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా బ్యాంకులతో మరింత సమన్వయం చేసుకోవాలన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ లాబ్స్‌
వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌ ఏర్పాటు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఇందుకు సంబంధించి కూడా జూన్‌ 1, 2021 నాటికి భవనాలన్నీ సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, కొత్తగా 21 లాబ్‌ టెక్నిషియన్స్, 21 లాబ్‌ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ వీటన్నింటికీ ఒకే కాల్‌ సెంటర్, ఒకే నంబర్‌ ఉండాలని పేర్కొన్నారు.

వెటర్నరీ ఆసుపత్రుల్లో నాడు–నేడు
నాడు నేడు కింద వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణ పనులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ఈ క్రమంలో మూడు సంవత్సరాల్లో అన్ని పశువైద్యశాలలు ఆధునీకరణ నాడు–నేడు ( పశు వైద్యశాలలు) కార్యక్రమాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

మొబైల్‌ యాంబులేటరీ(వెటర్నరీ) సర్వీసెస్‌
108 తరహాలో పశువులకు కూడా అంబులెన్స్‌ ద్వారా వైద్య సేవలు మొబైల్‌ యాంబులేటరీ (వెటర్నరీ) సర్వీసెస్‌ ఏర్పాటుపై సమీక్షలో చర్చ జరిగింది. నియోజకవర్గానికి ఒక వాహనం మంజూరుకు సీఎం ఆమోదం తెలిపారు. తమిళనాడు తరహాలో మొబైల్‌ యాంబులేటరీ సర్వీసెస్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలుచేశారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం జబ్బుపడిన పశువులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా వైఎస్సార్‌ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్‌ పౌల్ట్రీ ఫాంను పునురుద్ధరించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. కడక్‌నాథ్‌ చికెన్‌కు  ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ను వివరించారు. ఈ క్రమంలో ఉటుకూరు పౌల్ట్రీ ఫాం పునరుద్ధరణకు సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement