
గొర్రెల మేతకు ఖాళీ భూముల వెతుకులాట
- పంట, ఖాళీ భూముల వివరాల సేకరణలో ఏఈవోలు
- లక్ష యూనిట్ల గొర్రెల పంపిణీకి సర్కారు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల మేతకు ఖాళీ భూములను వెతికేపనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఇటీవల నియమితులైన వెయ్యి మంది వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)తో భూముల వివరాల సేకరిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం లక్ష యూనిట్ల గొర్రెలను గొర్రెల కాపరులకు, సంబంధిత సామాజిక వర్గాలకు సరఫరా చేయనుంది. వాటి మేతకు సమస్య తలెత్తకుండా గ్రామాల్లో పంట, బీడు, కొండలు, గుట్టలతో కూడిన భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీ భూములను గొర్రెల మేతకు ఉపయోగిస్తారు. ఒక్కో యూనిట్‌లో 20+1 గొర్రెలుంటాయి. అందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించి జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) నుంచి రూ.1400 కోట్లు రుణం తీసుకురానుంది. 21 లక్షల గొర్రెలను ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలన్న దానిపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.
పది రోజుల్లో పూర్తి వివరాల సేకరణ
పశు సంవర్థకశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోని వివిధ సంతలకు వెళ్లి మేలుజాతి గొర్రెలను అధ్యయనం చేసి వచ్చారు. లబ్ధిదారులను ఎంపిక చేశాక గొర్రెలను ఇక్కడకు తీసుకొస్తారు. భారీగా వాటిని తీసుకురావడంతో మేతకు అనువైన ప్రాంతాల అధ్యయనం కొనసాగుతోంది. ఇటీవల నియమితులైన ఏఈవోలకు వారి పరిధిలో ఉండే 2,500 హెక్టార్ల భూమిలో ప్రతీ ఎకరాపైనా సమగ్రంగా నివేదిక తయారు చేస్తారు.
పంట పండే భూములు, బీడు భూముల వివరాలను సమగ్రంగా తయారు చేస్తారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి భూముల వివరాలపై కసరత్తు సాగుతోంది. మరో వారం, పది రోజుల్లో వివరాలను సేకరించాక వ్యవసాయశాఖకు నివేదిక పంపుతారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. గ్రామాలవారీగా ఖాళీ భూముల వివరాలు తెలిశాక లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వారు ఎక్కడెక్కడ గొర్రెలను మేపుకోవచ్చో తెలియపరుస్తారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతీ గొర్రెల పెంపకందారునికి గొర్రెలను సరఫరా చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకోసం దాదాపు రూ. 7 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తోంది.