సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2.13 లక్షల మంది పాడిరైతులకు సబ్సిడీపై గేదెలు, ఆవుల పంపిణీని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయ, కరీంనగర్, ముల్కనూర్, మదర్ డెయిరీలకు పాలు పోస్తున్న 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, పాడి ఆవులను పంపిణీ చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఒక్కో పాడిగేదెకు రూ. 80 వేలు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీని వర్తింప చేస్తామని పేర్కొన్నారు. మొదటగా 15 వేల మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేస్తామని, ప్రతినెలా 15 వేల నుండి 16 వేల పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ గేదెలను హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయా రాష్ట్రాలలో గేదెల లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీల ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించినట్లు వివరించారు.
రైతుల ఇష్టాఇష్టాలపై ఆధారపడే విధంగా పాడిగేదెల కొనుగోలు పథకం నిబంధనలు రూపొందిస్తామన్నారు. పశువుల కొనుగోలు విధివిధానాలను 2.13 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రం రూపంలో ముద్రించి అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్ల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు అధికారులు స్థానిక డెయిరీతో కూడిన 300 బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాడిగేదెల కొనుగోళ్లకు వెళ్లే లబ్ధిదారుల ఎంపిక తదితర బాధ్యతలను ఆయా డెయిరీ ఫెడరేషన్ చైర్మన్లు చేపట్టాలని మంత్రి సూచించారు. విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇతర డెయిరీల చైర్మన్లతో సమన్వయం చేస్తారన్నారు. కొనుగోలు చేసిన ప్రతి గేదెకు తప్పనిసరిగా బీమా చేస్తామని తలసాని చెప్పారు. ఇప్పటికే పాడిరైతులను ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకోవాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు.
లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ..
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని విలీన గ్రామాల్లో నివసిస్తున్న గొల్ల, కురుమలకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, వనపర్తి, కొల్హాపూర్‌ల్లో నివసిస్తున్న వారికి పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా మంత్రి తలసాని ఆదేశించారు. గతేడాది జూన్ 20వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ. 3,700 కోట్లతో 65 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు.
సబ్సిడీపై 2.13 లక్షల పాడి పశువులు
Published Sun, Jul 15 2018 2:12 AM | Last Updated on Sun, Jul 15 2018 2:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment