సాక్షి,అమరావతి: ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్ జగన్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆక్వా లాబ్స్‌ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్‌ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు.
కేజ్ ఫిష్ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక
5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిస్ ల్యాండ్ సెంటర్‌లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలని, ఆదాయాలు బాగా పెరుగుతాయని తెలిపారు. కేజ్ ఫిష్ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, మూడు చోట్ల మరీకల్చర్‌లను మొదలుపెట్టాలని తెలిపారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు.
డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం
హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. అయితే కొన్ని డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయని అధికారులు ముందు మ్యాపింగ్ చేసి తర్వాత వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment