సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానికంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న సీఎస్‌హెచ్–24 జొన్న రకం పశుగ్రాసం విత్తనాలను సరఫరా చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 శాతం సబ్సిడీపై 1,503.87 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా స్థానికంగా ఉన్న పశు సంపద, డిమాండ్ ఆధారంగా ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. 20 సెంట్ల నుంచి ఎకరం వ్యవసాయ పొలం కలిగిన సన్న, చిన్నకారు రైతులకు 5 నుంచి 20 కిలోల వరకు సరఫరా చేయనున్నారు.
మార్కెట్‌లో ఐదు కిలోల ప్యాకెట్ విలువ రూ.436.75 ఉండగా, ప్రభుత్వం రూ.327.55 సబ్సిడీగా భరిస్తుంది. రైతు కేవలం రూ.109.20 చెల్లిస్తే చాలు. వర్షాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ విత్తనం చల్లుకుంటే మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఆరేడు పశువులకు కనీసం ఆరు నెలలపాటు పశుగ్రాసానికి లోటు లేకుండా అందించవచ్చు. వీటిలో అత్యధికంగా 8–10 శాతం వరకు మాంసకృత్తులతో పాటు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆసక్తి గల రైతులు సమీప ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా బుక్ చేసుకుని సబ్సిడీ పోనూ మిగిలిన మొత్తం చెల్లిస్తే 24 గంటల్లోనే సరఫరా చేస్తారు.
ఆర్బీకేల్లో సంప్రదించండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. అర్హత, ఆసక్తి కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆర్బీకేల్లోని పశుసంవర్థక సహాయకులను సంప్రదించండి. నాణ్యమైన సీఎస్‌హెచ్–24 విత్తనాన్ని తీసుకొని అదును దాటిపోకుండా నాటుకోవాలి.
– ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్థక శాఖ
Comments
Please login to add a commentAdd a comment