గ్రామ స్థాయిలో పశుమిత్రల నియమాకం
-
జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌కుమార్
నెల్లూరు రూరల్ : గ్రామ స్థాయిలో పశుసంవర్థక శాఖ సేవలు విస్తృతం చేసేందుకు పశుమిత్రలను నియమించనున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్‌కుమార్ తెలిపారు. స్థానిక రైల్వేఫీడర్స్ రోడ్డులోని ఆశాఖ కార్యాలయంలో ఎంపిక చేసిన పశుమిత్రలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశువైద్యశాలలు, గామీణ ఆరోగ్య కేంద్రాలు, గోపాలమిత్రలు లేని 597 గ్రామ పంచాయితీల్లో పశుమిత్రలను నియమిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతగా 167 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. మిగిలి వారిని త్వరలో నియమిస్తామని చెప్పారు. పశుమిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదని, పాడి రైతులకు వారు అందించే సేవల ఆధారంగానే యూజర్ చార్జీలను తమ శాఖ ద్వారా చెల్లిస్తామన్నారు. పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించడం, రోగాల నివారణకు టీకాలు వేయడం, గొర్రెలకు నట్టల నివారణ మందులు తాపించడం, గొడ్డుమోతు పశువులకు ప్రత్యేక చికిత్స, సమీకృత పోషణ పథకం, ఉపాధి హామీ పథకం ద్వారా పశుగ్రాసాల పెంపకం కార్యక్రమంలో పశుమిత్రలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు వెటర్నరీ పాలి క్లినిక్ డీడీ డాక్టర్ పెద్దస్వామి, పశుమిత్రలు పాల్గొన్నారు.