
ఇదో కం‘త్రీ’ వ్యవహారం
పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 33 మంది నిరుద్యోగుల నుంచి రూ.45 లక్షలు స్వాహా చేసిన ఉదంతమిది.
కాకినాడ: పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 33 మంది నిరుద్యోగుల నుంచి రూ.45 లక్షలు స్వాహా చేసిన ఉదంతమిది. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో సొమ్ము చెల్లించినవారు నిందితురాలిపై చేయిచేసుకోవడం, అమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం గుట్టురట్టయింది. కాకినాడ వెటర్నరీ పాలిక్లినిక్‌లో కాకర్ల వరప్రసాద్ అలియాస్ వేళంగి వరప్రసాద్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వేళంగి పశువైద్యశాల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
కాకినాడ వెటర్నరీ పాలిక్లినిక్‌లోనే అటెండర్‌గా పనిచేస్తున్న శీరం లలితాదేVelangi veterinary polyclinicవి పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి వలవేసింది. 33 మంది నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష, లక్షన్నర చొప్పున మొత్తం రూ.45 లక్షలు వసూలు చేసింది. వసూళ్లు సాగిస్తున్న సమయంలో కరప మండలం పెరుగుదురుకు చెందిన పిల్లి వీర్రాజును డాక్టర్ వరప్రసాద్‌గా నిరుద్యోగులకు పరిచయం చేసి అతని ద్వారానే ఉద్యోగాలు వస్తాయంటూ నమ్మబలికింది. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా ఉద్యోగాలు వచ్చే సూచనలు కన్పించకపోవడంతో బాధితులు లలితాదేవిని నిలదీశారు.
కొంతమంది ఆమెపై చేయిచేసుకుని, తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తల్లి పద్మావతి సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు లలితాదేవి, డాక్టర్ వరప్రసాద్, పిల్లి వీర్రాజులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను వసూలు చేసిన సొమ్ము డాక్టర్ వరప్రసాద్‌కే ఇచ్చానని లలితాదేవి చెపుతుండగా, ఆమె ఎవరో తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని డాక్టర్ వరప్రసాద్ అంటున్నాడు. తనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ పెడితే డాక్టర్‌లా నటించానని వీర్రాజు పేర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో కంత్రీలు ఎవరో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.