
పౌల్ట్రీకి సగం ధరకే విద్యుత్
‘పౌల్ట్రీ ఎక్స్‌పో 2013’ ప్రారంభ సభలో సీఎం ప్రకటన
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ చార్జీలు తగ్గించాలనే పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల చిరకాల డిమాండ్‌కు అనుగుణంగా ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇక్కడి హైటెక్స్‌లో మూడురోజుల పాటు జరగనున్న ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2013’ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ.5.60తో విద్యుత్ సరఫరా అవుతోందని ఈ ధరను సగానికి తగ్గించి రూ.2.80 కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
ఒక్క వ్యవసాయంపైనే రైతు ఆధారపడే పరిస్థితులు ప్రస్తుతం లేవని, అనుబంధ రంగాలైన పాడి, చేపలు, కోళ్ల పెంపకం లాంటివి చేపట్టినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కాసు వెంకట కృష్ణారెడ్డి, కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనుప్ కుమార్ ఠాకూర్, సహ కార్యదర్శి సంజయ్ బోస్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.