ప్రస్తుతం నెలలవారీగా ఇంధన సర్దుబాటు చార్జీలు
తాజాగా ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్‌లో మార్పులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల భారాన్ని మోపింది. ఈ చార్జీలను ప్రతి నెలా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇది చాలదన్నట్లు కూటమిలో భాగమైన బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కొత్త దారిలో ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమవుతోంది. దానిని నేరుగా కాకుండా పరోక్షంగా వేస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రజల కరెంటు బిల్లు మరింతగా పెంచేలా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సాయపడుతోంది.
కొత్త పేరుతో కొత్త చార్జీ
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతించిన దానికంటే అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొంటున్నాయి. ఈ విద్యుత్తు కొనుగోలుకయ్యే అదనపు ఖర్చును ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి.
గతంలో ఈ చార్జీలను ఏడాది చివరిలో మదించి, ఒకే సారి వేసేవి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నిబంధనలు (రెగ్యులేషన్స్) 2005కు సవసరణ చేసి వాటిని ప్రతి నెలా వసూలు చేసుకునే వి«ధానాన్ని తెచ్చింది. ఎప్పుడు చేసిన ఖర్చును అప్పుడే మరుసటి నెల బిల్లులో యూనిట్‌పై గరిష్టంగా రూ.0.50 చొప్పున వసూలు చేసుకొనేలా ఏపీఈఆర్‌సీ కూడా చట్టంలో మార్పులు చేసింది.
ఏడాదికోసారి కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రూ అప్‌ను లెక్కించేలా సవరణలు చేసింది. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ‘ఇంధన సర్దుబాటు సర్‌చార్జి’ పేరుతో కొత్త వడ్డనకు శ్రీకారం చుట్టింది.
రెండు విధాలుగా వడ్డన
డిస్కంలు ఆర్ధిక స్థిరత్వం కోసం వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లులతో పాటుగా ఇంధన సర్దుబాటు సర్‌చార్జీని కూడా వసూలు చేసుకోవడానికి కేంద్రం విద్యుత్ చట్టంలోని నిబంధనల్లో సవరణలకు ముసాయిదాను రూపొందించింది. గడిచిన మూడేళ్లలో సర్దుబాటు చార్జీల సగటును తీసుకుని ఈ సర్‌చార్జీని ఏపీఈఆర్‌సీ నిర్ణయించాలని చెప్పింది. దానిని ఏడాదికోసారి నిర్ణయించే టారిఫ్ ఆర్డర్‌తో కలిపి ప్రకటించాలని సూచించింది.
తద్వారా సర్దుబాటు చార్జీల లెక్కలతో సంబంధం లేకుండా ప్రజలపై సర్‌చార్జీల రూపంలో వచ్చి పడుతుంది. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఎఫ్‌పీపీఏ సర్దుబాటుకు డిస్కంలు వాడుకోవచ్చని, వినియోగదారుల నుంచి వసూలు చేసేంతవరకూ వేచి చూడాల్సిన అవసరం ఉండదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారటీ (సీఈఏ) వివరించింది.
అది కూడా సరిపోకపోతే నిర్దిష్ట శాతంలో కొంత వరకూ చార్జీలను వేసి నెల నెలా కూడా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 15 వరకూ ముసాయిదాపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు, సూచనలను కేంద్రం స్వీకరించింది. వాటిని పరిశీలించి త్వరలోనే ఈ చార్జీల వసూలుపై కొత్త నిబంధనలను ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment