
కోళ్ల ఫారాలకు కోలుకోలేని దెబ్బ!
తుపాన్‌తో ఉత్తరాంధ్రలో 25 లక్షల కోళ్ల మృతి
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉత్తరాంధ్రలో ఫౌల్ట్రీ పరిశ్రమ హుదూద్ తుపాను దెబ్బకు కోలుకోలేని విధంగా నష్టపోయింది. విషపు గాలుల తీవ్రతకు తుపాను ప్రభావిత నాలుగు జిల్లాల్లో 25 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ కోళ్ల ఫారాలు సుమారు 200 దాకా ఉన్నాయి.
విశాఖ జిల్లా యలమంచిలి నుంచి భోగాపురం వరకూ, విజయనగరంలోని జిల్లాలోని బొబ్బిలి, శృంగవరపుకోట, పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పార్వతీపురం, ఆముదాలవలస ప్రాంతాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరూ రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. మేత, నీరు అందక రోగాల బారిన పడ్డాయి. షెడ్లకున్న రేకులు, తాటాకులు గాలుల తీవ్రతకు ఎగిరిపోయి కోళ్లు వర్షంలో తడిసి అనారోగ్యం బారిన పడ్డాయి.
తీరని కష్టమిది....
తుపాను వల్ల ఫౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావాలి. - జీ రామకృష్ణ చౌదరి, విశాఖ జోనల్ చైర్మన్, నెక్