సాక్షి, అమరావతి: చికెన్ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.306కు చేరి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు తోడు కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కోవిడ్‌కు ముందు వరకు చికెన్ రేటు అధికంగానే (కిలో రూ.270 వరకు) ఉండేది. కోవిడ్ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్‌తో నాలుగైదు నెలల పాటు చికెన్ ధర గణనీయంగా పడిపోయింది.
ఒకానొక దశలో మూడు కిలోల చికెన్‌ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్ ధర పెరగడం మొదలైంది. విజయవాడ జోన్‌లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో చికెన్ రేటు మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. దాన్ని కూడా అధిగమించి.. చికెన్ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది.
కోళ్ల కొరత వల్లే..
కొన్నాళ్ల నుంచి బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా చికెన్ ధర పెరగడానికి ఇదే కారణం. ఈ స్థాయిలో ధర పెరగడం పౌల్ట్రీ చరిత్రలో ఇదే ప్రథమం.
– కాజా వెంకటేశ్వరరావు (నాని), ప్రెసిడెంట్, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.
ఎండ దెబ్బ..
వేసవికాలంలో కోళ్ల ఎదుగుదల తగ్గుతుంది. మేత అధికంగా తింటే ఎండల ధాటికి తట్టుకోలేక చనిపోతాయని పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లకు ఉదయం పూట మేత పెట్టరు. పైగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కోళ్లు సరిగ్గా తిండి కూడా తినలేవు. ఫలితంగా కోళ్లు ఎదుగుదల తగ్గి బరువు పెరగవు. అదే సమయంలో వడగాలులకు ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు 10 నుంచి 15 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి.
అలాగే ఏటా కోళ్ల విక్రయాల పెంపును దృష్టిలో ఉంచుకుని హ్యాచరీలు వారంపాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తాయి. ఆ సమయంలో పౌల్ట్రీలకు హ్యాచరీల వాళ్లు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెల కిందట తెలుగు రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే అమలు చేశారు. ఇవన్నీ వెరసి ఇప్పుడు డిమాండ్‌కు సరిపడినన్ని కోళ్లు లభ్యం కావడం లేదు. ఫలితంగా చికెన్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మరో రెండు వారాలకు కోళ్ల లభ్యత పెరుగుతుందని, ఆ తర్వాత చికెన్ ధర దిగివస్తుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment