గుడ్డు.. అ‘ధర’గొడుతోంది.. ధర నిలకడగా సాగుతూ పరిశ్రమకు ఊతమిస్తోంది.. కోవిడ్ కాలంలో వచ్చిన వదంతులతో సంక్షోభంలో చిక్కుకున్నా.. ఆ తర్వాత కోలుకుని ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 250 వరకు పౌల్ట్రీలు ఉండగా వాటిలో సుమారు 1.20 కోట్ల మేర కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకు కోటి గుడ్లు వరకు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 80 శాతం మేర కోడిగుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం, బిహార్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిన 20 శాతం స్థానికంగా వినియోగిస్తుంటారు.
తణుకు (పశ్చిమ గోదావరి): కరోనా విపత్తు నుంచి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ బయటపడుతోంది. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. చికెన్, గుడ్డు వినియోగం తగ్గింది. దీంతో ఒక్కసారిగా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పట్లో చికెన్ ధర పతనం కాగా గుడ్డు ధర సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.2.25కు పతనమైంది.
అయితే కరోనా కట్టడిలో పౌష్టికాహారం అయిన కోడిగుడ్లు, చికెన్ ప్రాధాన్యం పెరగడంతోపాటు ప్రభుత్వం, వైద్యులు సైతం అవగాహన పెంచడంతో పౌల్ట్రీకు కలిసి వచ్చింది. అనంతర కాలంలో గుడ్డు, చికెన్ వినియోగం పెరగడంతో వాటి ధరలు సైతం గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఏడాదిగా కోడిగుడ్డు నెక్ ధర రూ.5 పైగా పలుకుతూ వస్తోంది. ఇటీవల బహిరంగ మార్కెట్‌లో రూ.6 ధర ఉండగా ప్రస్తుతం నెక్ ధర రూ.3.65 వద్ద కొనసాగుతోంది.
తగ్గిన ఉత్పత్తి
జిల్లాలో 250 వరకు పౌల్ట్రీలు ఉండగా వీటిల్లో సుమారు 1.20 కోట్లు కోళ్లు పెరుగుతున్నాయి. వీటి ద్వారా రోజూ కోటి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 80 శాతం మేర కోడిగుడ్లు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా.. 20 శాతం స్థానికంగా వినియోగిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పెద్ద సంఖ్యలో కోళ్లు వదిలించుకుని చేతులు దులుపుకున్నారు. తర్వాత బ్యాచ్‌లు వేయకపోవడంతో దాదాపు సగం మేర కోళ్ల ఫారాలు ఖాళీ అయ్యాయి.
దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి సైతం సగానికి పైగా పడిపోయింది. మరోవైపు కరోనా వదంతులతో ఎగుమతులు నిలిచిపోవడంతో స్థానికంగా వినియోగం కూడా భారీగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో 2020 మార్చిలో గుడ్డు ధర రూ.2.25 కనిష్ట స్థాయికి దిగజారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కోగుడ్డు ఉత్పత్తి ధర రూ.3.75 అవుతుంది. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకోవడంతో గుడ్ల ఉత్పత్తి పెరిగింది. మరోవైపు నెక్ ప్రకటించిన ధరకు వ్యాపారులు తమ వద్ద నుంచి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన కృషితో పౌల్ట్రీ పరిశ్రమ మరోసారి నిలదొక్కుకుంది. కోవిడ్ కారణంగా సంక్షోభంలోకి వెళ్లిన పౌల్ట్రీ పరిశ్రమను గట్టెక్కించేందుకు పౌల్ట్రీ అసోసియేషన్‌తో కలిసి గతంలో చికెన్, ఎగ్ మేళాలను ప్రభుత్వం నిర్వహించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం తగ్గింది. మరోవైపు స్థానికంగా గత నెలలో ఎండలు పెరుగడటంతో కోళ్లు మేతతో పోల్చితే నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కోడిగుడ్డు పెంకు పటిష్టత తగ్గుతోంది.
దీంతో గుడ్డు నాణ్యత తగ్గి ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇదే వంకతో పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారులు గుడ్డు ధరను తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డు ధర రూ.4 ఉంటేనే గత నష్టాలను భర్తీ చేసుకునే వీలుంటుందని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ రైతులకు వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం
రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా కోళ్ల పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అయితే ఇటీవల కాలంలో గుడ్డు వినియోగం పెరగడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. గుడ్డు ధర నిలకడగా ఉంటే నష్టాల నుంచి గట్టెక్కుతాం. పౌల్ట్రీ రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– పెన్మత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, కావలిపురం, ఇరగవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment