పుంజు చూడు, పుంజందం చూడు...
వర్ణం: టేబుల్ మీద ఠీవిగా, ఛాతీ విరుచుకుని నడిచి, న్యాయమూర్తే అవాక్కయ్యేలా చేసిందీ కోడిపుంజు. సంగతేమిటంటే, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ‘సెరెమా’ రకం కోళ్లమధ్య అందాల పోటీలు జరుగుతాయి. అరకిలో కూడా తూగని ఈ స్థానిక చిన్నరకం జాతికి ఆ దేశంలో బాగా ఆదరణ ఉంది. ఐరోపాకు కూడా ఇవి ఎగుమతి అవుతుంటాయి. పౌల్ట్రీ ప్రమోషన్లో భాగంగా జరిగే ఈ పోటీల్లో ఫొటోలోని పుంజు సుమారు ఆరులక్షల రూపాయల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. ‘దీన్ని కొంటామని చాలామంది అడిగారు, కానీ అమ్మను. ఇది నా కుటుంబంలో భాగం,’ అని మురిసిపోతాడు యజమాని మహమ్మద్ హత్తా.
మొరాకో ఘాట్
ఫొటోలోనిది ప్రపంచంలోనే పాతదిగా పేరొందిన ‘చర్మకారశాల’! సుమారు 900 ఏళ్ల నాటిది! గొప్ప నైపుణ్యం కనబరిచే చర్మతీతకారులకు మొరాకోలోని పాతనగరం ఫెజ్ ప్రసిద్ధి. అవసరమైన రసాయనాలు, రంగులు ఇలా గుంటల్లో పోసివుంచుకుంటారు. చనిపోయిన గొర్రెలు, మేకలు, ఒంటెల చర్మాలు ఇక్కడ ఒలుస్తారు. ఒలిచిన జంతుచర్మాలు బ్యాగులు, కోట్లు, బూట్లు, స్లిప్పర్లు లాంటి ఉత్పత్తుల తయారీకి తరలుతాయి.
అందం?- ఆరోగ్యం?
100 మీటర్ల హైహీల్స్ పరుగుపందేనికి సిద్ధంగా కూర్చున్న యువతుల్ని ఈ ఫొటోలో చూడవచ్చు. అయితే, ఇది పందెం గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. రష్యాలో మితిమీరిన ఫ్యాషన్స్‌ను అదుపు చేయాలన్న చర్చలు సాగుతున్నాయి. చాలా వంపుగా ఉండే హై హీల్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివికావనీ, వీటి గురించి ఏమైనా చేయాల్సిన సమయం ఆసన్నమైందనీ శాసనకర్త ఒలెగ్ మిఖాయెవ్ చెబుతున్నారు. అదే జరిగితే హీల్స్ మీద నిషేధం విధించే అవకాశం ఉంది. ట్రైనర్స్, బ్యాలె ఫ్లాట్స్, మగవాళ్లు ధరించే లోఫర్స్ కూడా ‘అనారోగ్య’ జాబితాలో ఉన్నాయి.