పౌల్ట్రీ విలవిల! | Chicken Demand Fallen Down Due To Lockdown In Telangana | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ విలవిల!

Published Tue, May 5 2020 2:21 AM | Last Updated on Tue, May 5 2020 4:11 AM

Chicken Demand Fallen Down Due To Lockdown In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పౌల్ట్రీ పరిశ్రమ సంకటంలో పడింది. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఫారం వద్ద కొనుగోళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడం.. మరోవైపు శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడటంతో వాణిజ్య పరంగా డిమాండ్‌ తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతు కుదేలవుతున్నాడు. రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమలో 85.10 కోట్ల కోళ్లున్నాయి. ఇందులో లేయర్స్‌ (గుడ్లు పెట్టేవి) 53.4 కోట్లు, బాయిలర్స్‌ (మాసం కోసం పెంచేవి) 31.70 కోట్లున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉంది. తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు బాయిలర్‌ కోళ్లు, గుడ్లు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ అతలాకుతలమవుతోంది.

ఇక్కడ తక్కువ.. అక్కడ ఎక్కువ!
దూర ప్రాంతాలకు కోళ్లు, గుడ్లు సరఫరా బంద్‌ కావడంతో వ్యాపారం అంతా స్థానిక మార్కెట్‌పై ఆధారపడింది. కరోనా నేపథ్యంలో డిమాండ్‌ కాస్త తగ్గినప్పటికీ.. క్షేత్రస్థాయిలో రిటైల్‌ వ్యాపారులు ధరలు మాత్రం తగ్గించలేదు. రిటైల్‌ వ్యాపారులు పౌల్ట్రీ ఫాం వద్ద  కిలోకు రూ.35 నుంచి రూ.45 చొప్పున బాయిలర్‌ కోళ్లు (లైవ్‌ బర్డ్‌) కొనుగోలు చేస్తున్నారు. అలాగే కోడి గుడ్డు ఒక్కింటికి రూ.1 నుంచి రూ.1.50 చొప్పున కొనుగోలు చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో రిటైల్‌ వ్యాపారులు కిలో చికెన్‌ (స్కిన్‌ లెస్‌) ధర రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు.

రెండో రకం కింద కిలో చికెన్‌ (విత్‌ స్కిన్‌) రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక గుడ్డు ఒక్కింటికి రూ.5 చొప్పున అమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో ధరలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. పౌల్ట్రీ రైతుల వద్ద మాత్రం సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు కోళ్లను ఎక్కువ రోజులు ఫారంలోనే ఉంచుకుంటే దానా వేయడం భారమవుతుందనే భావనతో ధర తక్కువైనా స్టాక్‌ను వదిలించుకోవల్సిన పరిస్థితి తలెత్తింది.

పెరిగిన అంతరం..
బాయిలర్‌ కోళ్ల పరిశ్రమలో కోడి పిల్లలను తెచ్చిన రోజు మొదలు 42 రోజుల్లో పెరిగి పెద్దవవుతాయి. దీంతో వాటిని లిఫ్ట్‌ చేసి చికెన్‌ మార్కెట్‌కు తరలిస్తారు. అలా లిఫ్ట్‌ చేసిన తర్వాత ఫారంను పక్షం రోజుల పాటు ఖాళీగా ఉంచి తిరిగి పిల్లలను తెచ్చి పెంచడం ప్రారంభిస్తారు. ఫారంలో ఇన్‌ఫెక్షన్లు ఇతర ఇబ్బందులు తొలగిపోయేందుకు ఈ అంతరం అవసరమనే నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంతరం 20 నుంచి 25 రోజులకు పెరిగింది. లాక్‌డౌన్, కరోనా వైరస్‌ ప్రభావంతో మార్కెట్‌ కాస్త మందగమనంలో ఉండటంతో రైతులు ఈ దిశగా గ్యాప్‌ పాటిస్తున్నారు. అయితే కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం కొత్త పిల్లలు పెంచేందుకు నిరాకరిస్తున్నారు. రెండు, మూడు నెలల పాటు వేచిచూసేందుకే మొగ్గుచూపుతున్నారు.

2 నెలల్లో అరకోటి నష్టం..
90 వేల లేయర్‌ బర్డ్స్‌తో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నా. పెట్టుబడి భారీగా అయ్యింది. లాక్‌డౌన్‌ కారణంగా పౌల్ట్రీ రంగంలో తీవ్ర నష్టాలే ఎదురవుతున్నాయి. గత ఐదు నెలలుగా గుడ్లు, చికెన్‌ సేల్స్‌ మందగించాయి. తర్వాత కాస్త కోలుకుంటున్న సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పరిశ్రమ కుదేలైంది. అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోవడంతో సరఫరా ఆగిపోయింది. దీంతో గుడ్ల డిమాండ్‌ తగ్గడంతో ధర భారీగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో రిటైలర్స్‌ సంతృప్తికరమైన ధరకే విక్రయిస్తున్నా.. మావద్ద మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు లేయర్‌ కోళ్లకు ఇచ్చే దానా ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో కిలో దానా రూ.12 నుంచి రూ.16 మధ్యలోఉండేది. ప్రస్తుతం ఈ ధర రూ.20కి పెరిగింది. మొత్తంగా గణిస్తే ఒక గుడ్డుపై సగటున రూ.1.50 నష్టం వస్తోంది. గడిచిన రెండు, మూడు నెలల్లో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చింది. 
– ఎడమ నరేందర్‌రెడ్డి, మంచాల, రంగారెడ్డి జిల్లా

ఆలస్యంతో లాభాలు ఆవిరి...
12 వేల బర్డ్స్‌తో బాయిలర్‌ పౌల్ట్రీ నిర్వహిస్తున్నా. సాధారణంగా ఒక కోడి పిల్ల పెరిగేందుకు 40 నుంచి 42 రోజులు పడుతుంది. ఎక్కువ శాతం 42వ రోజు బర్డ్స్‌ లిఫ్ట్‌ చేస్తాం. ఈ లెక్క ప్రకారం బర్డ్స్‌ లిఫ్ట్‌ చేస్తేనే ఆదాయం వస్తుంది. 42 రోజుల పాటు ఎదిగిన కోడి తినే ఆహారం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక్క రోజు ఆలస్యమైనా అంతే సంగతి. ఆ తర్వాత బర్డ్స్‌కు ఫీడ్‌ ఇచ్చినప్పటికీ కనీసం 10 గ్రాముల బరువు కూడా పెరగదు. కచ్చితంగా నిర్దేశించిన రోజుల్లో తీసేయాలి. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా గందరగోళంగా మారింది. దీంతో బర్డ్స్‌ లిఫ్ట్‌ చేయడానికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది. దీంతో బర్డ్స్‌కు ఫీడ్‌ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో వచ్చే లాభం కాస్త ఆవిరవుతోంది. – జూలూరు పాండు, కుమ్మెర, చేవెళ్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement